రజనీకాంత్… ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్ కలుగుతుంది. అయన అభిమానుల్లోనే కాదు.. ప్రతీ ఒక్కరిలో ఎంతో కొంత వాహ్.. రజనీ! అనిపిస్తుంది. అది ఆయన స్టయిల్ కు ఉన్న ఆదరణ. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు రజనీకాంత్. 1950 డిసెంబరు 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయనను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. సినిమాల్లో ఆయన పలికే సంభాషణలు, ప్రత్యేకమైన స్టయిల్ ని క్రియేట్ చేశాయి. దాంతో దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 160 కి పైగా సినిమాల్లో నటించారు. రజనీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. రజనీ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణ రావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్ బాలూభాయి. 1956 లో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్ కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయాడు.
1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించిన ఆయన . 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భాషా’ సినిమా ఘన విజయం సాధించి ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. 2007 లో వచ్చిన ‘శివాజీ’ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. 2010లో వచ్చిన ‘రోబో’, 2018 లో వచ్చిన ‘2.0’ సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. సినిమా రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది. ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్ం ఫేర్ పురస్కారంతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నాడు.
కె. బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ సినిమాలో కథానాయికగా నటించిన శ్రీవిద్య మాజీ భర్తగా రజనీకాంత్ చిన్నపాత్ర వేశాడు. ఈ చిత్రంలో వయసులో పెద్ద తేడాలున్న వారి మధ్య బాంధవ్యాల గురించిన కథ ఉంటుంది. ఇది విడుదలైనప్పుడు కొంత వివాదాలను కూడా చవి చూసింది. అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుని 1976 లో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు మూడింటిని చేజిక్కించుకుంది. ఆంగ్ల దినపత్రిక ది హిందూ, కొత్త నటుడు రజినీకాంత్ చక్కగా నటించాడని ప్రశంసించింది. తర్వాత రజనీ నటించిన చిత్రం పుట్టణ్ణ కనగల్ దర్శకత్వం వహించిన కథా సంగమ (1976). ఈ సినిమాలో రజనీకాంత్ చివర్లో ఒక రౌడీ పాత్రలో కనిపిస్తాడు. తర్వాత దర్శకుడు కె. బాలచందర్ తాను తమిళంలో రూపొందించిన అవల్ ఒరు తొడర్ కతై (1974) కి తెలుగు అనువాద చిత్రమైన అంతులేని కథ (1976) సినిమాలో నటింప జేశాడు. మూండ్రు ముడిచ్చు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సినిమాలో రజనీ సిగరెట్ పైకి ఎగరేసి కాల్చే స్టైలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1976 లో ఆయన చివరి చిత్రం బాలు జేను. ఈ సినిమాలో కథానాయికను ఏడిపించే ప్రధాన విలన్ పాత్ర పోషించాడు. 1977 లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అవర్గళ్, భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 16 వయదినిలే చిత్రాల్లో ఇలాంటి పాత్రల్లోనే నటించాడు. 1977 మధ్యలో తెలుగులో మొట్టమొదటి సారిగా చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటించాడు.
1978 లో రజనీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో మొదటి పి. మాధవన్ దర్శకత్వం వహించిన శంకర్ సలీం సిమోన్. ఈ సినిమాలో రజనీకాంత్ ముగ్గురు కథానాయకుల్లో ఒకడు. తర్వాత కన్నడ నటుడు విష్ణువర్ధన్ తో కలిసి కిలాడీ కిట్టు అనే సినిమాలో నటించాడు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అన్నదమ్ముల సవాల్ అనే చిత్రంలో రెండో కథానాయకుడుగా నటించాడు. ఈ సినిమాకు కన్నడ మాతృకలో కూడా రజనీకాంత్ అదే పాత్రలో నటించాడు. ఎం. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భైరవి రజనీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి తమిళ చిత్రం. ఈ సినిమాతోనే అతనికి సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఒకడైన ఎస్. థాను 35 అడుగుల ఎత్తైన రజినీకాంత్ కటవుట్ ఏర్పాటు చేశాడు. 1979 లో ఎన్. టి. ఆర్ తో కలిసి టైగర్ అనే తెలుగు సినిమాలో నటించాడు.
హిందీ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ను తన రోల్ మోడల్ గా పేర్కొనే రజనీకాంత్ ఈ దశకంలో అమితాబ్ హిందీలో నటించిన చిత్రాల రీమేక్ లలో కథానాయకుడిగా నటించడం ఈ దశకంలోనే ప్రారంభమైంది. 1978లో వచ్చిన శంకర్ సలీం సిమోన్ సినిమా 1977 లో అమితాబ్ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాకు పునర్నిర్మాణం. అదే సినిమా రామ్ రాబర్ట్ రహీమ్ అనే పేరుతో తెలుగులో పునర్నిర్మిస్తే అందులో కూడా రజినీ నటించడం విశేషం. ఈ దశకంలో మొత్తం 11 హిందీ చిత్రాల పునర్నిర్మాణాలలో రజినీ నటించాడు. 1983 వచ్చే సరికి తమిళంలోనే కాక తెలుగు, కన్నడ భాషల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందిన నటుడు అయ్యాడు. అదే సంవత్సరంలో అమితాబ్ బచ్చన్, హేమమాలినిలతో కలిసి అంధా కానూన్ అనే బాలీవుడ్ చిత్రంలో మొదటిసారిగా నటించాడు.
1990 వ దశకానికి వచ్చే సరికి రజనీకాంత్ కమర్షియల్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దశకంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. ఈ దశకంలో రజనీకాంత్ తొలి సినిమా పనక్కరన్ (1990) మంచి విజయం సాధించింది. తర్వాత అదే సంవత్సరంలో అతిశయ పిరవి అనే సినిమాలో నటించాడు. ఇది చిరంజీవి హీరోగా 1988లో వచ్చిన యముడికి మొగుడు చిత్రానికి పునర్నిర్మాణం. 1991 లో ధర్మ దొరై అనే సినిమాలో నటించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సగటు చిత్రాలుగా నిలిచాయి.
1995 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాషా సినిమా సినీ పరిశ్రమలో రికార్డు సృష్టించింది. ప్రేక్షకులకు ఆయన మరింత చేరువ చేసింది. అదే సంవత్సరంలో తన మిత్రుడైన మోహన్ బాబుకు పెదరాయుడు సినిమాకు హక్కులు తీసుకోవడంలో సహాయం చేసి ఆ సినిమాలో అతిథి పాత్రను కూడా పోషించాడు. 1995 లోనే మలయాళం సినిమా తెన్మవిన్ కొంబత్తు సినిమాను కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో కె. బాలచందర్ నిర్మాతగా తమిళం, తెలుగులో ముత్తు పేరుతో నిర్మించారు. ఈ సినిమా కూడా వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది. ఇది జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది.
కొంత కాలం విరామం తర్వాత 2002 లో రజనీకాంత్ బాబా అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాశాడు. ఈ సినిమా అభిమానుల ఉత్సాహంతో విపరీతమైన ప్రచారం మధ్య ఈ చిత్రం విడుదలైంది. ఒక గ్యాంగ్ స్టర్ తన పద్ధతిని మార్చుకుని రాజకీయ విప్లవం సాధించడం ఈ చిత్ర నేపథ్యం. కానీ ఇది మార్కెట్ అంచనాలు అందుకోలేక చతికిల పడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. నష్టపోయిన వారికి రజనీకాంత్ స్వయంగా సొమ్ము చెల్లించాడు. పిఎంకె అధ్యక్షుడు రాందాస్ ఈ సినిమాతో రజినీకాంత్ బిడీలు కాల్చడం వంటి దురలవాట్లతో తమిళ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించాడు. ఆ పార్టీ కార్యకర్తలు సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్ల పై దాడి చేసి ఫిల్ములను తగులబెట్టారు.
రెండేళ్ల విరామం తర్వాత మలయాళం సినిమా అయిన మణిచిత్రతళు కు పునర్నిర్మాణం అయిన చంద్రముఖి సినిమాలో, పి. వాసు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడమే కాక 2007 లో అత్యధిక కాలం నడిచిన తమిళ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది టర్కిష్, జర్మన్ భాషల్లోకి కూడా అనువాదం అయింది. చంద్రముఖి విడుదల తర్వాత శంకర్ దర్శకత్వంలో ఎవిఎం ప్రొడక్షంస్ వారు ఒక చిత్రణ్ నిర్మించడానికి సంకల్పించారు. అదే 2007లో విడుదలైన శివాజీ.
రజనీకాంత్ లతా రంగాచారిని వివాహం చేసుకున్నాడు. ఆమె యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని. ఒకసారి ఆమె తన కళాశాల మ్యాగజైన్ కోసం అతనిని ఇంటర్వ్యూ చేసింది. వీరి వివాహం 1981 ఫిబ్రవరి 26 న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగింది. ఈ దంపతులకు ఐశ్వర్య రజనీకాంత్ , సౌందర్య రజనీకాంత్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత “ది ఆశ్రమ్” పేరుతో పాఠశాలను నడుపుతోంది.
రజినీకాంత్ ను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా పరిగణిస్తారు. అతని జనాదరణకు “అతని ప్రత్యేకమైన శైలిలోని సంభాషణలు, మ్యానరిజం అలాగే, రాజకీయ ప్రకటనలు, దాతృత్వానికి” కారణమని చెబుతారు. ఇంకా నిజ జీవితంలో నిరాడంబరతను కొనసాగిస్తూనే ఆయన అనేక చిత్రాలలో తన జీవితంలో కంటే పెద్దగా సూపర్-హీరోగా కనిపించడం, తెరమీద అనూహ్యమైన విన్యాసాలు మరియు ఆకర్షణీయమైన వ్యక్తీకరణలు మొదలైనవి కూడా కారణమే. రజనీకాంత్ దాదాపు ప్రతి చిత్రంలోనూ అతను అసమానమైన శైలిలో పంచ్లైన్లను విస్రుతాడు. ఇవి తరచూ సందేశాన్ని కలిగి ఉంటాయి లేదా సినిమా విరోధులను హెచ్చరిస్తాయి. ఈ పంక్తులు సాధారణంగా కొత్త వాటిని సృష్టించడానికి లేదా హాస్యాస్పదంగా తీయడానికి కల్పితమైనవి, కానీ వీక్షకులలో వినోదాన్ని సృష్టించడంలో విఫలం కాలేదు.
తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుల్లో రజనీకాంత్ ఒకరు. 2014లో తన మొదటి అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన తర్వాత, రజనీకాంత్ 24 గంటల్లోనే 210,000 మంది ఫాలోవర్లను అందుకున్నారు, ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, సోషల్ మీడియా రీసెర్చ్ సంస్థలు ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా పెరగలేదని పేర్కొన్నాయి.
రజనీకాంత్ తాను నటించిన సినిమాలకు చాలా పురస్కారాలు అందుకున్నాడు. వీటిలో ఎక్కువ భాగం తమిళ సినిమాలే. 1984 లో నల్లవనుకు నల్లవాన్ అనే తమిళ సినిమాకు గాను మొదటిసారిగా ఉత్తమ తమిళ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. ఇప్పటిదాకా ఆయన అందుకున్న ఏకైన ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అదే. తర్వాత శివాజీ (2007), రోబో (2010) సినిమాలకు కూడా ఫిల్మ్ ఫేర్ నామినేషన్లకు ఎంపికయ్యాడు. 2014 నాటికి రజినీకాంత్ ఆరు సార్లు తమిళనాడు ప్రభుత్వ సినిమా పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా పలుమార్లు సినిమా ఎక్స్ప్రెస్ పురస్కారాలు, అభిమానుల తరపున సినిమాల్లో, బయట ఆయన చేసిన సేవలకు కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు.
రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వం నుంచి 1984 లో కలైమామణి, 1989 లో ఎం.జి.ఆర్ పురస్కారాన్ని అందుకున్నాడు. 1995 లో దక్షిణ భారత నటీనటుల సంఘం తరపున కలైచెల్వం పురస్కారాన్ని అందుకున్నాడు. ఇతనికి 2016 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందాడు.