చిత్రం: ‘నిశ్శబ్దం’
విడుదల: అమెజాన్ ప్రైమ్ (అక్టోబర్-02/2020)
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, షాలినిపాండే, సుబ్బరాజ్, మైకేల్ మ్యాడ్‌సేన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు
డైరెక్టర్: హేమంత్ మధుకర్
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
కో-ప్రోడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: కోన వెంకట్
ఎడిటింగ్: ప‌్రవీణ్ పూడి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనే విషయం అందరికీ తెలిసిందే. ‘అరుంధతి’ ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాలతో తన రేంజ్ ఏంటో చాటి చెప్పుకుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. చాలా రోజుల తర్వాత మాధవన్ ఈ మూవీలో నటించగా.. అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు విభిన్న పాత్రల్లో నటించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో సినిమా రిలీజ్ కొన్ని నెలలపాటు ఆలస్యమైంది. వాస్తవానికి ఏప్రిల్ మొదటి వారంలోనే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ కరోనాతో థియేటర్లు ఓపెన్ కాకపోవడం.. అసలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియకపోవడంతో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. ఎట్టకేలకు అనుష్క అభిమానులు ఎదురుచూసిన ఈ సినిమా ఎలా ఉందో మన సమీక్షలో తెలుసుకుందాం.
‘నిశ్శబ్దం’ కథ
అది 1972.. అమెరికాలోని సీటెల్ ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే వుడ్ హౌస్‌లో నివాసముంటున్న భార్యభర్తలు పీటర్, మెలిసాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేస్తారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది.. ఆ వుడ్ హౌస్ ఓనర్ జోసెస్ ఆత్మేనని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే అసలు విషయం మాత్రం అది కాదు. అసలు ఈ దారుణానికి పాల్పడిందెవరు..? అనుమానాస్పద స్థితిలో వీరు ఎలా చనిపోయారు..? అని ఈ కేసును ఛేదించాలని పోలీసులు రంగంలోకి దిగుతారు. అయితే చివరికి ఎటూ తేల్చలేక ఇక మా వల్ల కాదన్నట్లుగా చేతులెత్తేసి మిస్టరీ కేసుగా మూసేస్తారు. అంతేకాదు.. ఆ దారుణ హత్యలు జరిగిన తర్వాత ఈ వుడ్ హౌస్‌లో ఎవరూ నివసించడానికి గానీ.. కొనడానికి కానీ ప్రయత్నించరు. అప్పట్నుంచి దీన్ని ‘హంటెడ్ హౌస్’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఘటన జరిగిన 1972 నుంచి 2019 వరకూ ఎవరూ కొనడానికి సాహసించరు. చివరికి కొలంబియాకు చెందిన బాగా పేరుగాంచిన బిజినెస్ మ్యాన్ మార్టిన్ ఎస్కవాడో ఆ విల్లాను కొంటాడు. ఆ తర్వాత ఓ పెయింటింగ్ కోసం విల్లాకు సాక్షి (అనుష్క), ఆంటోనీ (మాధవన్) వస్తారు. పుట్టుకతో మూగ, చెవుడు యువతి సాక్షి అద్భుతమైన పెయింటర్. ఆంటోని గొప్ప సంగీతకారుడు. వీరిద్దరూ కొన్ని సంఘటనలతో ప్రేమలో పడతారు. అయితే అప్పటికే ఆంటోనికి భార్య ఉంటుంది. ఆమె చనిపోతుంది. ఇదే సమయంలో కొందరు అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. అలాగే అనుష్క ఫ్రెండ్ అయిన షాలినీ పాండే కూడా మిస్ అవుతుంది. పెయింటింగ్ కోసం వెళ్లిన సాక్షి, ఆంటోనిలలో ఆంటోని దారుణంగా చంపబడతాడు. అనుష్క గాయాలతో బయటపడుతుంది. ఆంటోనిని ఎవరు, ఎందుకు చంపారు? నగరంలో అమ్మాయిలు మిస్ అవ్వడానికి కారణం ఏమిటి? షాలినీ పాండే చివరికి ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల విషయానికి వస్తే..
అనుష్క ఈ సినిమాను ఏ కోణంలో చూసి అంగీకరించిందో తెలియదు. బహుశా పాత్ర కొత్తగా ఉంటుందని భావించి ఉంటుంది కానీ.. తను చేసిన భాగమతి చిత్రంలో ఆమె దాదాపు ఇటువంటి రోలే చేసింది. మాధవన్ పాత్రలో వేరియేషన్స్ చూపించలేకపోయారు. అటువంటి నటుడిని సరిగా వాడుకోలేకపోయారు. మైఖేల్ మ్యాడ్‌సన్ రోల్ కన్విన్సింగ్‌గా లేదు. మనిషి భీకరంగా ఉన్నా.. పాత్రలో పట్టు లేదు. షాలినీ పాండే పాత్ర హైలెట్ అనుకునే లోపే ఆమెను చంపేశారు. ఉన్నంతలో అంజలి, సుబ్బరాజ్ పాత్రలకు కాస్త నటించే స్కోప్ లభించింది. శ్రీనివాస్ అవసరాలను ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఇక మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకునేంతగా ఏం లేదు.
టెక్నికల్ టీమ్ విషయానికొస్తే..
సినిమా గురించి మాట్లాడే ముందు మొదట టెక్నికల్ టీమ్‌ను అభినందించాలి. విజువల్స్ మాత్రం వండర్.. అదిరిపోయాయని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా షనీల్ డియో కెమెరా పనితనం అద్భుతం అని చెప్పాలి. మరీ ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ‘నిన్నే నిన్నే’ సాంగ్ చాలా సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఎడిటర్ విషయానికొస్తే.. ప్రవీణ్ పూడి ప్రమాణాలు బాగున్నాయ్. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ చెప్పుకునేంతగా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక గోపీ సుందర్ ఇచ్చిన పాటల్లో ఓ పాట బాగుంది. డైరెక్షన్ పరంగా హేమంత్ మధుకర్ టేకింగ్ బాగుంది. దర్శకత్వం పరంగా సినిమాని బాగానే రూపొందించాడు కానీ.. స్ర్కీన్‌ప్లేలో మ్యాజిక్ మిస్పవడంతో.. అతను చేసిన పనికి అంతగా గుర్తింపు దక్కకపోవచ్చు. ఓవరాల్‌గా సినిమా ఓకే అనేలా ఉంది.
ప్లస్ పాయింట్స్:-
డైరెక్షన్
మ్యూజిక్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సుబ్బరాజ్
మైనస్ పాయింట్స్:-
స్క్రీన్‌ప్లే
స్లో నేరేషన్
రిపీటెడ్ సీన్స్
అనుష్క డ్రసెస్
మైఖేల్ మ్యాడ్‌సన్ రోల్ కన్విన్సింగ్‌గా లేదు
విశ్లేషణ:
‘నిశ్శబ్దం’ సినిమా గురించి చెప్పుకోవాలంటే విజువల్‌గా పరవాలేదు. మొత్తం సినిమా అమెరికాలో చిత్రీకరించడం వల్ల.. మధ్యలో ఇంగ్లీష్ భాషను కూడా వాడారు. అది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే. ఇటువంటి థ్రిల్లర్ సినిమాలకు స్ర్కీన్‌ప్లే చాలా ఇంపార్టెంట్. కానీ అదే ఇందులో మిస్ అయ్యింది. దర్శకుడు సినిమాని ఓ రేంజ్‌లో ఊహించుకున్నాడు కానీ.. ఆయన ఊహను ప్రేక్షకులు అందుకునే విషయంలో స్ర్కీన్‌ప్లే అడ్డుపడింది. థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింటే.. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని ఈ చిత్రం కాస్త అలరించేది. ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి.. మ్యాగ్జిమల్ మల్లీప్లెక్స్ ఆడియన్సే ఈ సినిమా చూస్తారు. బీ, సీ సెంటర్స్ ప్రేక్షకులను పట్టించుకున్నట్లు లేరు. ‘నిశ్శబ్దం’ కథను క్రియేటివ్‌గా రాసుకున్నా.. స్ర్కీన్‌ప్లే విషయంలో సినిమా గాడి తప్పింది. ఇటువంటి సినిమాలు మల్లీప్లెక్స్ ఆడియన్స్‌కి కొత్తకాదు. మంచి ఆర్టిస్ట్స్ లభించినా.. వారికి సరిపడిన కథ కాదని, కొత్తగా ఇందులో ఏం లేదని అనిపిస్తుంది. ఇక అనుష్క, అంజలి, షాలినీ పాండే, మాధవన్ వంటి వారిని ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు.
ట్యాగ్‌లైన్ : ‘నిశ్శబ్దం’
రేటింగ్: 2.75/5