బీర్ల అయిలయ్య సారథ్యంలో ప్రగతి పథంలో ఆలేరు నియోజకవర్గం : నీలం పద్మ వెంకటస్వామి

Aleru constituency is on the path of progress under the leadership of Beerla Ailaiah: Neelam Padma Venkataswamy
Spread the love

By Interview :
M.D ABDUL (Editor-Tollywoodtimes)

రాజకీయరంగంలో ఇప్పుడు ఎవ్వరి నోటా విన్నా ఒకటే మాట. అసలు ఎవరీమె.. ఎందుకు ఇంతలా దూసుకుపోతోంది అని! అవును మరి.. కసి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం అంత కష్టమేమీకాదు.. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలంటే మాటలు కాదు.. చేతలు కావాలి. కాంగ్రెస్‌ పార్టీలో అడుగు పెట్టగానే జెడ్పీటీసీగా…శిశు సంక్షేమశాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా జెడ్పీ స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌గా.. డిస్టిక్‌ ప్లానింగ్‌ కమిటీ (డిపిసి) మెంబర్‌గా… పంచాయతీరాజ్‌ మహిళా శక్తి అభియాన్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీగా.. ఉమ్మడి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రెండు పర్యాయాలు.. మరియు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మెంబర్‌గా…భువనగిరి పార్లమెంటరీ దిశా కమిటీ మెంబర్‌ గా… తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా… స్టేట్‌ మహిళా కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కో-ఆర్డినేటర్‌గా… ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలుగా ..ఇలా ఒకటేమిటి..? ఎన్నో ఎన్నెన్నో పదవులు ఆమెను వరించాయి. నిత్యం పార్టీ కోసం.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకోసం.. ప్రజా సమస్యలపై నిరంతరం పాటు పడుతూనే ఉంటుంది. ఆమె ఎవరో కాదు.. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు నీలం పద్మ. ఇటీవల ఆమెను కలిసి తను చేస్తున్న రాజకీయ మజిలీల గురించి విపులంగా ముచ్చటించడం జరిగింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే మీ కోసం…

మీ రాజకీయ ప్రస్థానం ఎలా జరిగింది?
-నా భర్త నీలం వెంకటస్వామి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్న సమయంలో ఆలేరు జెడ్పీటీసీకి మహిళా రిజర్వేషన్‌ రావడం వలన నన్ను జెడ్పీటీసీగా పోటీచేయమని స్వర్గీయ పెద్దలు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు నాకు టికెట్‌ ఇచ్చి.. మహిళలు రాజకీయంగా ఎదగాలని ఎంతగానో ప్రోత్సహించారు.

రాజకీయంలోకి ప్రవేశించాలన్న ఆలోచన ఎలా కలిగింది?
– నా భర్త నీలం వెంకట స్వామి అప్పటికే కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఉన్నతమైన పదవిలో ఉంటూ పార్టీ కోసం నిరంతరం పాటుపడుతూనే ఉన్నారు కాబట్టి ఆలేరు మండల జెడ్పీటీసీ అవకాశం ఒక మహిళగా నాకు లభించింది. అధిష్టానం నన్ను జెడ్పీటీసీగా పోటీ చేయమన్నారు. అప్పుడు నేను ఆలోచించి రాజకీయంగా పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది.

రాజకీయంలో మీరు ఎవరి నుంచి ప్రేరణ పొందారు..?
-నా భర్త నీలం వెంకట స్వామి గారి నుండి నేను ప్రేరణ పొందానని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన లేకపోతే నా రాజకీయ ప్రస్థానమే లేదు. నేను టీచర్‌ గా పనిచేస్తున్న సమయంలో జెడ్పీటీసీగా నాకు అవకాశం వచ్చిందంటే నా భర్త వెంకట స్వామి గారే అని కచ్చితంగా చెప్పగలను.

కాంగ్రెస్‌ పార్టీలో మీరు పొందిన పదవులు మీకు లభిస్తున్న ఆదరణ?
– కాంగ్రెస్‌ పార్టీలో నేను జెడ్పీటీసీగా. శిశు సంక్షేమశాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా జెడ్పీ స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌ గా… డిపిసి డిస్టిక్‌ ప్లానింగ్‌ కమిటీ మెంబర్‌ గా… పంచాయతీరాజ్‌ మహిళా శక్తి అభియాన్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీగా.. ఉమ్మడి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా రెండు పర్యాయాలు.. మరియు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మెంబర్‌ గా… భువనగిరి పార్లమెంటరీ దిశా కమిటీ మెంబర్‌ గా. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా. స్టేట్‌ మహిళా కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కోఆర్డినేటర్‌గా… యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు గా కొనసాగుతున్నాను.

రాజకీయంగా మీకు.. మీ కుటుంబం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం ఎలా ఉంది?
-2000 – 2025వ సంవత్సరం వరకు రాజకీయంగా నా కుటుంబం నుండి నాకు పూర్తి సహకారం లభిస్తుంది. కాబట్టి ఈ రోజు నేను రాజకీయంగా ప్రతి విషయంలో ముందంజలో ఉన్నాను. నా కుటుంబం నాకు ఎప్పుడు సపోర్టుగా ఉంటుంది. నా కుటుంబమే నాకు బలం.

మీ శాసనసభ్యుడు బీర్ల అయిలయ్య సారథ్యంలో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది?
-మా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు ప్రజల మనిషి. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతూనే ఉంటారు. ఎక్కడ ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించడం.. పరిష్కరించడం ఆయన నైజం. అదే ఆయన ప్రత్యేకత. అందుకే మా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారిని ప్రజలు దేవుడులాగా కొలుస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ విప్ గా గొప్ప బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఆలేరు నియోజకవర్గ పేరు మారుమోగుతోంది. ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి అన్ని రంగాల్లో ముందుకు సాగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పాలనపై మీ అభిప్రాయం?
-తెలంగాణ అభివృద్ధి దశ,దిశలా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్హి వైపు పరుగులు పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో మహిళలకు అన్ని విధాలా సముచిత గౌరవం.. సముచిత స్థానం లభిస్తోంది.

ప్రస్తుత సమాజంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందనుకుంటున్నారు?
– మహిళా సాధికారత మన భారత్‌లో ఇంకా రావడం లేదు. మహిళను విలాసవస్తువుగానే చూస్తున్నారు. అనేకానేక అవరోధాల మధ్య కూడా తమతమ రంగాలలో శక్తివంతమైన మహిళలుగా నిరూపించుకుంటూనే ఉన్నారు. వ్యక్తిత్వ హననం జరుగుతున్నా.. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉన్నారు. మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం అని మనమంతా కీర్తిస్తూ వారిని మభ్య పెడుతున్నామని గుర్తించాలి. మహిళా సమానత్వమే సమాజానికి హితం అని చెబుతున్న పాలకులు సమాన గౌరవం ఇచ్చి చట్టసభల్లో ప్రవేశించేలా చేయడంలో మరింత ప్రోత్సాహం అందించాలి. మహిళల్లో స్ఫూర్తిని నింపడమే గాకుండా, వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో పురుష సమాజం విఫలమయ్యిందనడంలో సందేహం లేదు. ఇక దీనిని సవాల్‌గా తీసుకుని మహిళలే తమ హక్కుల కోసం పోరాడాలని గుర్తుంచుకోవాలి.

దేశంలో ప్రస్తుత మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనపై మీ అభిప్రాయం?
-ప్రజల పక్షాన నిలబడటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. దీనికి భిన్నంగా మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు, మార్కెట్‌ శక్తులకు లాభాన్ని చేకూర్చే విధానాన్ని అమలు చేస్తోంది. ఫలితంగా పాలకుల తప్పులకు బాధ్యులు ఎవరన్నది చెప్పాలి. కార్పొరేట్ల కొమ్ము కాస్తే అది ప్రజలకు భారంగానే మారుతుంది. రోడ్లు వేయటం, ప్రాజెక్టులు కట్టడం, పరిశ్రమలు స్థాపించడం, రైల్వే, ఎల్‌ఐసి, పోస్టల్‌, టెలికం రంగాల నిర్వహణ అన్నీ భారంగానే మారతాయి. అందుకే ప్రభుత్వాలు కార్పొరేట్లకు లాభం చేకూర్చే వైపు కాకుండా ప్రజల సంక్షేమం వైపు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవసాయరంగంలో మనం ముందున్నాం. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి మనది. అది మరచి విదేశీ పెట్టుబడుల కోసం మోదీ దేబురించడం సరికాదు. కార్పోరేట్లకు చేసే మేలు వల్ల సామాజిక బాధ్యత గురించి, సామాజిక అంశాల గురించి, ఆ మాటకొస్తే మానవత్వం గురించి మాట్లాడలేరు. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, ప్రభుత్వ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వమే అమలు చేసింది. 1980 తరువాత భారతదేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిరది. విదేశీ మారక నిల్వలు కరిగిపోవడం, బంగారాన్ని సైతం కుదువ పెట్టాల్సి రావడం, అప్పుల కోసం ప్రపంచ దేశాల విరీద ఆధార పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతదేశం అప్పు కోసం ప్రపంచ బ్యాంకు తలుపు తట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచ బ్యాంక్‌ షరతులకు లోబడి తెచ్చుకున్న అప్పు ఫలితంగా ప్రభుత్వం సంక్షేమ బాధ్యత నుంచి పక్కకు తప్పు కోవటం, ప్రజలకు కావలసిన ప్రతి అవసరాన్ని సరుకుగగా చూడడం మొదలు పెట్టింది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు 32 సంవత్సరాల కాలంలో ప్రతిదీ సరుకుగా మారిపోయింది. ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా మారిపోయింది. ఆఖరికి ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మడం కోసం, కార్పొరేట్లకు అప్పచెప్పటం కోసం కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసిందంటే పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల కార్పొరేట్లకు అవసరమైన పెట్టుబడుల వెతుకులాటలో వుండగా…. భారతదేశ ప్రభుత్వరంగ పరిశ్రమలతో పాటు ప్రభుత్వం దగ్గర ఉన్న వివిధ రకాల నిల్వలు, పెన్షన్‌ ఫండు నిల్వల విరీద ప్రపంచ బ్యాంక్‌ కన్ను పడిరది. పరిశ్రమలతో పాటు ఈ దేశంలో ఉన్న సహజ సంపదల విరీద కూడా ప్రపంచ బ్యాంకు చూపు పడిరది. అప్పుకెళ్లిన ప్రతిసారీ సంస్కరణల పేరుతో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుని ప్రైవేటు రంగానికి కేటాయింపులు చేసేలా ఒత్తిడి తెచ్చింది. దాని ఫలితంగానే నేడు మనకు సర్వదరిద్రాలు వచ్చాయి. దీనిలో భాగంగానే ప్రజలకిచ్చే సబ్సిడీలపై కోతను విధిస్తోంది. ధరలు పెంచుతోంది. రైతాంగ వ్యతిరేక చట్టాలు తెస్తోంది. భూమి, గనులు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గాలి, నీరు, పాలు… ఒక్కటేమిటి ఇప్పటి వరకు సహజ సంపదలుగా, ప్రభుత్వరంగ సంస్థలుగా ఉన్న అన్నీ… ప్రైవేటు సేవలుగా మారుతున్నాయి. అన్ని రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకొని, కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెబుతోంది. దీనివల్ల భవిష్యత్తు లో యూజర్‌ చార్జీల పేరుతో వందలాది రూపాయలు వసూలు చేసే పని జరుగుతున్నది. ఎంటర్‌ట్కెన్‌ మెంట్‌కు కూడా రుసుము చెల్లించాల్సిన పరిస్థితి. ప్రతిదాన్నీ ప్రభుత్వం సరుకుగా మార్చివేస్తున్న తీరు ప్రజలకు భారంగా మారుతోంది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహూల్‌ గాంధీ నిరంతరం గళమెత్తుతున్నారు. దేశం కోసం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. అందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే రాహూల్‌ గాంధీ పక్షాన మద్దతును అందిస్తూనే ఉంది.

ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలపై మీ అభిప్రాయం..?
-డీలిమిటేషన్‌ భయాలు, జనగణన, జిఎస్టీ, నిరుద్యోగం, ఔషధధరలు, పెరుగుతున్న నిత్యావసర ధరలు వంటి ప్రధాన సమస్యలు ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు డీలిమిటేషన్‌పై సర్వత్రా చర్చ నడుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై బిజెపి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. తెలంగాణ బిజెపి నేతలు మాత్రం సీట్లు తగ్గవని అంటున్నారు. ఇంతకీ ఇప్పుడున్న సీట్లు తగ్గవా లేక, పెరిగే సీట్లు తగ్గవా అన్నది స్పష్టం చేయకుండా గోడవాటం పిల్లిలా వ్యవహరిస్తున్నారు. అమెరికా తరహాలోనే భారత్‌ కూడా ప్రజ్యాస్వామ్య వ్యవస్థ కలిగిన సమాఖ్య రాజ్యం. 1971లోని జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయనే వాస్తవాన్ని గుర్తించాయి. అయితే ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి బదులు దాన్ని 2026 దాకా వాయిదా వేశారు . చివరి జనాభా గణన 2011లో జరిగింది. తదుపరి జనాభా గణన 2021లో జరగవలసి ఉండగా కోవిడ్‌ విలయం వల్ల వాయిదా వేశారు. 2021 నుంచి ఏదో ఒక సాకుతో జనాభా గణన జరగనే లేదు. ఈ క్రమంలో 2026లో జనాభా గణన అనంతరం విధిగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగవలసి ఉన్నది. ప్రతి రాష్ట్రానికి కేటాయించే సీట్ల సంఖ్యను కూడా అప్పుడే నిర్ణయిస్తారు. జనాభా పెరుగుదల అదుపులేకుండా జరిగినందుకు కొన్ని రాష్ట్రాలకు ప్రయోజనాలు కల్పిస్తారు. సంపూర్ణ ప్రజనన రేటు 2 శాతం, అంతకంటే తక్కువగా ఉండాలన్న నిర్దేశిత లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాలను సీట్ల కుదింపుతో శిక్షించనున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇలా కేవలం జనాభా ప్రాదిపదికగా కాకుండా మధ్యేమార్గం అవలంబించాల్సిన అసవరం ఇప్పుడు కనిపిస్తోంది. జిఎస్టీతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న బాదుళ్లను చర్చించాలి. ఎందుకంటే అధికార పార్టీ కాబూలీవాలాల లాగా వసూళ్లకు తెగిస్తోంది. పదేళ్లుగా పోరాటం చేస్తే..ఆదాయపు పన్నును 12 లక్షలకు చేర్చినా అందులోనూ మెలికలే పెట్టారు. మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆర్థిక అంశాలపై పార్లమెంట్‌లో చర్చించడం లేదు. బిజెపి ఎంపిలు ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టి పెట్టుకోవడం లేదు. కుక్కిన పేనుల్లా మోదీ ముందు మోకరిల్లుతున్నారు. ఆహా మోదీ..ఓహో మోదీ అంటూ భజనలు చేయడానికే సమయం కేటాయిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కడా చర్చ చేయడం లేదు. ఎవరైనా చర్చించినా దానిని పట్టించుకోవడం లేదు. అంతెందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎదురుదాడితో విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జిఎస్టీపై గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమె చేసిన ఎదురుదాడి ప్రసంగమే ఇందుకు నిదర్శనం. జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై కేంద్ర ప్రభుత్వ 18 శాతం జిఎస్‌టి విధించడం అత్యంత దుర్మార్గం. ఆపద వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఆ కష్టాన్ని సైతం ఖజానాను నింపుకోవడానికి మార్గంగా చూడటం అమానుషం! సొంత పార్టీ నుండే వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, సీనియర్‌ నేతలే ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నా మోదీ ప్రభుత్వం మాత్రం కష్టకాలంలోనూ ప్రజల మూలుగులను పీల్చి పిప్పి చేయాలనే భావిస్తోంది. అందుకే కాంగ్రెస్‌ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాక్స్‌ టెర్రరిజంగా అభివర్ణిస్తున్నాయి. జిఎస్‌టిలో వివిధ వస్తువులు, సేవలపై సున్నా నుండి గరిష్టంగా 28 శాతం వరకు పన్నులు విధించవచ్చు. ఈ పట్టికలో చివరి నుండి రెండవ స్థానంలో ఉన్న 18 శాతం జిఎస్‌టిని బీమాపై పాలసీలపై విధిస్తున్న కేంద్రం బంగారం పై మూడు శాతం, వజ్రాలపై 0.25 శాతం మాత్రమే పన్ను వసూలు చేస్తుండటం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా బీమా కంపెనీలు రకరకాల కారణాలు చెబుతూ ప్రీమియం మొత్తాలను ఇష్టా రాజ్యంగా పెంచుతున్నాయి. ఈ పెంపును నియంత్రించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు. రెండు సంవత్సరాల క్రితం 22 సంవత్సరాలున్న ఒక వ్యక్తి ఐదు లక్షల రూపాయల బీమా మొత్తానికి పది వేల రూపాయలు ప్రీమియంగా చెల్లించే పరిస్థితి ఉంటే, గతేడాది ఆ ప్రీమియం 15 వేల రూపాయలకు చేరింది. ఇదే తలకు మించిన భారంగా మారుతుండటంతో అనేక మంది తమ పాలసీలను రద్దు చేసుకుం టున్నారు. ఇప్పుడు 18 శాతం జిఎస్‌టి విధించడంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా దీనిని లేవెనెత్తినా..ఆయనను ఈగలాగా తీసిపారేశారు. ఆయన సూచనలకు విలువనివ్వలేదు. దీంతో పాలసీలపై పడే భారం మరింత పెరుగుతుం దన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా ఉన్నప్పటికీ రోగగ్రస్థ దేశంగా మారే ప్రమాదం ఉంది. ఆరోగ్య పాలసీలను పక్కన పెట్టి ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆరోగ్యశ్రీలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది కాస్తా కార్పోరేట్‌ ఆస్పత్రులను ప్రోత్సహించేలా మారుతోంది. నయా ఉదారవాద విధానాలు అమలు చేస్తున్న పాలక వర్గాలు ఒక వ్యూహం ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. వైద్య సేవల కోసం ప్రైవేటు రంగంపై ఆధారపడక తప్పని స్థితిని సామాన్యులకు కల్పించాయి. ప్రైవేటు రంగానికి లాభాల లెక్కలే కీలకం కావడంతో వైద్యం సాధారణ ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని తిరిగి పట్టాలెక్కిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మాటలు చెబుతున్నప్పటికీ ఆచరణలో అవి అమలుకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితే వైద్య రంగంలో బీమా ఆవశ్యకతను పెంచాయి. జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేయడం తప్పనిసరి అవసరంగా మారింది. ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంల పైనే ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరంలో 8,263 కోట్ల రూపాయలు వసూలైందని ఆనాటి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో తెలిపారు. అది చాలదన్నట్లు మరింతగా ప్రజల నుండి వసూళ్లు చేయాలని కేంద్రం భావిస్తోంది. 18 శాతం జిఎస్‌టి విధించడం ద్వారా ఏటా 24 వేల కోట్ల రూపాయలు కేంద్ర బొక్కసానికి చేరుతున్నాయని అంచనా. ప్రజల రక్త మాంసాలతో ఖజానాను నింపాలని చూడటం సబబు కాదు. దుర్మార్గమైన ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరిచుకోవాలి. దీనిపై పోరాటం ఒక్కటే శరణ్యం. లేదా దీనిపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని జీవితబీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జిఎస్టీ ఎత్తేయాలి. పేద, మధ్య తరగతి ప్రజలు రక్తమాంసాలు వెచ్చించి కడుతున్న పాలసీలపై జిఎస్టీ విధించడం దుర్మార్గం కాక మరోటి కాదని మోదీ ప్రభుత్వం గుర్తించాలి.

ఆందోళనలకు దారితీస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మీరేమనుకుంటున్నారు?
-ఇది బిజెపి పునర్విభజన రాజకీయంగా అభివర్ణించొచ్చు. దక్షిణాదిలో బిజెపి పెద్దగా పట్టు సాధించలేకపోతోంది. తమిళనాడు, కేరళలో అడుగు పెట్టడమే కష్టంగా ఉంది. గత దశాబ్దంగా ఎంతగా ప్రయత్నించినా ఒక్కసీటు సాధించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన సరికొత్త ఆందోళనలకు దారితీస్తున్నది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లు పెరిగే బదులు తగ్గుతాయన్న ఆందోళన ఇప్పుడు దక్షిణాది నేతల్లో కలవరానికి గురి చేస్తోంది. 2011 జనాభా లెక్కలు తీసుకుంటే, అప్పటికీ ఇప్పటికీ దక్షిణాదిలో జనాభా తగ్గింది. ఈ లెక్కన సీట్లు పెరగాల్సింది పోయి తగ్గే ప్రమాదం ఉంది. రాజ్యాంగ బద్ధంగా జరగాల్సిన ఈ పునర్విభజన రాజకీయ విభజనగా మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరిపించాలి. మార్పులు చేర్పులను బట్టి చట్టసభల నియోజకవర్గాల సంఖ్యలు, హద్దులు సవరణలు చేయాల్సి వుంటుంది. ఎందుకంటే జనాభా అధికంగా వున్నా తక్కువగా వున్నా అన్ని రాష్ట్రాల్లోనూ ఓటుకు ఒకే విలువ వుండాలి. ఎమర్జన్సీలో తెచ్చిన 42వ రాజ్యాంగ సవరణలో నియోజకవర్గాల పునర్విభజన స్తంభింపచేశారు. ఆ సమయంలోనే జనాభా నియంత్రణపై ప్రత్యేక కేంద్రీకరణ పెట్టారు. జనాభాను తగ్గించే చర్యల కోసం రాష్ట్రాలను ప్రోత్సహించారు. అప్పటికి దక్షిణాది రాష్ట్రల్లో 6 నుంచి 10 శాతం పెరుగుదల వుంటే ఉత్తరాదిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, యు.పి, బీహార్‌ లలో 12 నుంచి 15 శాతం వుండిరది. కనుక జనాభా నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలనీ ఇరవయ్యేళ్ల తర్వాతనే పునర్విభజన చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమయంలో జనాభా తగ్గితే సీట్లు తగ్గించడం సరికాదు గనక పార్లమెంటు స్థానాల సంఖ్యను 2001 వరకూ స్తంభింపచేశారు. అందువల్ల సీట్ల స్వరూపంలో అనేక మార్పులు జరిగినా మొత్తం ఎంపిల సంఖ్యలో మార్పు రాలేదు. సరిహద్దుల మార్పు తప్ప ఆ యా రాష్ట్రాలవారీగా వున్న సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా నియోజకవర్గాల పునర్వి భజన పక్రియను 2026 వరకూ వాయిదా వేస్తూ 2002 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది. ఈ సమయంలో గందరగోళం చెలరేగుతోంది. ఉన్నసీట్లు తగ్గిస్తే తమకు పార్లమెంటులో పట్టు లేకుండా పోతోందన్న ఆందోళన మొదలయ్యింది. నిజానికి ఇదో కీలకమైన అంశం. విధాన నిర్ణయం కూడా. ఇలాంటి కీలకాంశాలపై పారదర్శకంగా సమగ్రంగా చర్చ జరగాలి. దక్షిణాది నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ కేంద్రం మాత్ర స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ఏకపక్ష నిర్ణయాలు లేకుండా చూడడం కేంద్ర ప్రభుత్వ విద్యుక్త ధర్మం. ఎలాగూ దక్షిణాదితో వచ్చే లాభం లేదు కనుక సీట్లు తగ్గిస్తేనే మంచిదన్న కుత్సిత ఆలోచన ఏద్కెనా ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అధ్యక్ష తరహాను తలపించే విధంగా కేంద్రీకృత పెత్తనానికి బిజెపి యత్నిస్తోందని అనేక ఆరోపణలు సైతం ఉన్నాయి. అదే సమయంలో అంతా రాజ్యాంగబద్ధంగా పద్ధతి ప్రకారమే జరగడానికి చర్యలు అవసరం. నియోజకవర్గాల పునర్విభజన సరికొత్త సవాళ్లకు దారితీస్తున్నది. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల తర్వాత జరగాల్సిన పునర్విభజన అనేక కారణాల వల్ల సందేహాస్పదమై పోయింది. దక్షిణాది రాష్ట్రాల స్థానాల సంఖ్య తగ్గిపోతుందనీ, ఒకవేళ పెంచినా వాటి వాటాగా రావలసిన పెరుగుదల రాదనీ విమర్శ చేస్తున్నారు. అయితే హోం మంత్రి అమిత్‌ షా ఎవరి సీట్లూ తగ్గబోవని ప్రకటించారు. అసలు పునర్విభజన ఏ ప్రాతిపదికపై జరుగుతుందో చెప్పాలని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి గట్టిగా కోరుతున్నారు. దక్షిణాదిపై బిజెపి, కేంద్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా అమిత్‌ షా హావిరీలను నమ్మలేమని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల నోరు నొక్కేందుకు పునర్విభజన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి వుంటే ఈ పునర్విభజన ఏ ప్రాతిపదికన జరుగుతుంది, ఇప్పుడున్న సీట్లు ప్రస్తుత జనాభా ప్రకారమే వుంటాయా అని ఆయన ప్రశ్నించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ కూడా కేంద్రం అందరితో చర్చించి అడుగు వేయాలనీ, సందేహాలు తొలగించాలని వ్యాఖ్యానించారు. అయితే జమిలి ఎన్నికల బిల్లుతో ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సిద్దం అవుతున్న వేళ ఈ ఆందోళనపై స్పష్టత రావాల్సి ఉంది. 1976 తర్వాత కాలంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తర్వాత ఎ.పి, తెలంగాణలు జనాభా తగ్గింపులో గణనీయమైన ప్రగతిని సాధించాయి. తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 2001 నాటికే 2.0గా వుంది. అంటే జనాభా స్థిరీకరణ దశకు చేరిందని అంచనా వేశారు. అమిత్‌ షా ప్రకటనను బట్టి చూస్తే 2026లో ఈ పక్రియ చేపట్టడం తథ్యంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కేవలం జనాభాను బట్టి సీట్లు నిర్ణయించేట్టయితే తక్కువ జనాభా వున్న దక్షిణాదిన సీట్లు తగ్గితే ఇప్పటికే చాలా ఎక్కువగా వున్న యు.పి, బీహార్‌ వంటి వాటికి ఇంకా పెరుగుతాయి. సగటు జనాభాను చూస్తే వేరే తేడాలుంటాయి. ఉదాహరణకు నాలుగు కోట్ల జనాభా వున్న తెలంగాణకు 17 లోక్‌సభ సీట్లున్నాయి. 12.6 కోట్ల జనాభా వున్న బీహార్‌కు 40 సీట్లున్నాయి. సగటున తెలంగాణకు 23 లక్షల మందికి ఒక సీటు వుంటే బీహార్‌లో సగటున 32 లక్షల మందికి ఒక సీటు వున్నట్టు లెక్క. అందులోనూ జనాభాను బట్టి దామాషా ప్రాతిపదికన పెంచేట్టయితే ఆ ఫార్ములాను బట్టి ఈ తేడా ఇంకా విపరీతంగా మారొచ్చు. సాంకేతికంగానేగాక రాజకీయంగానూ ఈ మార్పులకు చాలా ప్రభావం వుంటుంది. బిజెపి ఎన్నిఎత్తులు వేసినా దక్షిణాదిన స్వంతంగా అధికారంలోకి వచ్చేంతగా బలం పెంచుకోవడంలో సఫలం కాలేకపోయింది. కర్ణాటక మినహా ఇతర చోట్ల ప్రత్యక్ష, పరోక్ష మిత్రులపైనే ఆధారపడి వుంటున్నది. ఇలాంటి సమయంలో పునర్విభజన పేరిట ఉత్తరాదిన సీట్లు పెంచి దక్షిణాదిన తగ్గించేలా రాజకీయ ఎజెండాతో ముందుకు పోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయనుకుంటున్నారు?
-మహిళల రక్షణకు మరిన్ని కఠిన చట్టాలు తీసుకుని వస్తే తప్ప వారికి రక్షణ కల్పించలేం. హత్యలు, అత్యాచారాలు నిరోధానికి పాలకులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మహిళలను గౌరవించే మనదేశంలో మహిళల కోసం ఏం చేశారంటూ ఏమీ లేదు. ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయడం మాత్రం అభినందించాల్సిందే. ఘనత వహించిన ప్రధాని మోదీకి ఇవన్నీ తెలియనివి కాదు. మహిళా బిల్లును ఆమోదించినా..(అది అందని ద్రాక్షగానే మిగిలింది. జనాభా లెక్కల సేకరణ తరవాత డీ-లిమిటేషన్‌తో దానికి లంకె పెట్టారు. దీంతో మరో రెండుమూడేళ్లు వేచిచూడక తప్పదు. ప్రధానంగా మహిళలకు ఉద్యోగ, ఉపాధి హామీల్లో పెద్దపీట వేయాలి. అలాగే వారికి ఉచిత విద్యను అందచేయాలి. ఉన్నత చదువులకు వెళ్లే వారికి వడ్డీరహిత రుణాలు అందించాలి. మహిళా సదస్సులు నిర్వహిస్తూ… మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటున్నా వారి అభివృద్దికి ప్రత్యేక కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. బేటీపడావో..బేటీ బచావో నినాదంగానే మారింది. కేంద్రంలో ఆడపిల్లల చదువులకు, క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏవీ అమలు కావడం లేదు. ఆడపిల్లల చదువులకు ప్రత్యేక రుణాలు, వడ్డీలేని పథకాలు అమలుచేసివుంటే బాగుండేది. ఉద్యోగాలు లేవు. చదువుకునే మహిళలకు కనీసం ఫ్రీ చదువులు లేవు. విద్యా రుణాలు తీసుకుంటే కనీసం వడ్డీ మాఫీ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. అలాచేసివుంటే బేటీపడావో..బేటీ బచావోకు అర్థం ఉండేది. ఆర్థిక మంత్రిగా ఓ మహిళ ఉన్నా మహిళలకు ప్రత్యేకంగా ఒనగూరుతున్న ప్రయోజనం లేదు. అలాగే చదువుకునే అమ్మాయిలకు ఉచిత విద్యా రుణాలు అందాలి. అలాగే వారి ఉన్నత విద్యకు ప్రభుత్వాలు చేయూత నివ్వాలి. బేటీపడావో .. బేటీ బచావో నినాదం కార్యరూపం దాల్చాలి. మహిళలను విలాసవస్తువుగా చూసే సంస్కృతిపై కఠినంగా వ్యవహరించాలి. అత్యాచారాలు, వేధింపులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాలు రావాలి. మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడే మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. అవసరమైతే ఉరిశిక్షలకు కూడా వెనకాడరాదు. వరకట్న వేధింపులు వంటివి లేకుండా చూడాలి. పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలి. ఇవన్నీ కూడా అమలుకు కఠిన చట్టాలే శరణ్యం.

చట్టసభల్లో మహిళలకు లభిస్తున్న రిజర్వేషన్లపై మీ అభిప్రాయం?
-మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో అధికారంలో ఉన్న సభ్యులు ఉమ్మడిగా విఫలం అయ్యారు. బిల్లును పాస్‌ చేసినా అమలు కాకుండా అటకెక్కించారు. ఈ బిల్లుతో రాజకీయ లబ్ది పొందానలన్న బిజెపి ఎత్తుగడ మాత్రం ఫలించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఇలా ఏటేటా జరుపుకుంటున్నా… మన నేతల్లో మార్పు రావడం లేదు. చట్టసభల్లో వారికి రావాల్సిన వాటాను కావాలనే ఇంతకాలం అడ్డుకున్నారు. సమాజంలో మహిళలకు ఉన్న అత్యుతన్నత స్థాయి గౌరవాన్ని మనమే దిగజార్చుకుంటున్నా పెద్దగా భయపడడం లేదు. చట్టసభల్లో కనీసం వారి అభిప్రాయాలకు విలువను ఇచ్చినట్లుగా ఉంటే బాగుండేది. కానీ అలా జరగడంలేదు. కేవలం వారికి శుభాకాంక్షలు చెప్పడంతో బడానేతలు తప్పించుకుంటున్నారు. తమ ధర్మాన్ని విస్మరించారు. సమాజం కూడా వారిని ఇంకా విలాసవస్తువుగానే చూస్తున్నది.. అమ్మాయి కనిపిస్తే అత్యాచారం చేయడమే లక్ష్యంగా మృగాళ్లు చెలరేగి పోతున్నారు. వారి గౌరవానికి భంగం కలిగించే అంశాలపై యుద్దం చేయాలి. పురుషాహంకార సమాజాన్ని నిలదీయాలి. నిగ్గదీయాలి. తమ హక్కులను సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించాలి.

భారత రాజకీయాల్లో మహిళలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందనుకుంటున్నారు?
– భారత రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా తగినంతగా ప్రోత్సాహం మాత్రం దక్కడం లేదు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఎందుకనో రాజకీయంగా ముందుకు సాకుండా అణగ దొక్కుతున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కారణంగా ఎందరో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటుల్లో మాత్రం రిజర్వేషన్ల దక్కితేనే మరింతగా రాణిస్తారు. వారిని అణచి వేయడం వల్ల 50శాతం జనాభా ఆకాంక్షలను కాలరాస్తున్న వారం అవుతున్నాం. మహిళా సాధికారతతో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాలన సాగాలి. అన్నిరంగాల్లో మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యపడుతుంది. ప్రజాస్వామ్యంలో కేవలం అధికార పక్షమే కాదు ప్రతిపక్షాలకూ, ప్రజలందరికీ పాత్ర ఉంటుంది. ఇది గమనించి అందరూ ముందుకు సాగాలి. మహిళల గొప్పతనాన్ని భారతీయ మహిళల ఆదర్శాలను ప్రముఖంగా ప్రస్తావించిన మన సంస్కృతిని ముందుకు తీసుకుని వెళ్లే క్రమంలో సమాజం వారిపట్ల గౌరవభావంతో సాగాలి. విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో వారిని ముందుకు నడిపించేలా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలి. అప్పుడే మనం ఆశించిన మహిళాభ్యుదయం సాకారం అవుతుంది.

మహిళా దినోత్సవాల సార్ధకత ఎంతవరకు నెరవేరుతుందనుకుంటున్నారు?
-1975వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం అంటే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మహిళా సమానత్వం 2025 థీమ్‌గా నిర్ణయించారు. అంటే లింగ వివక్ష లేకుండా ముందుకు సాగడం అన్నది ఈయేటి సంకల్పంగా ప్రకటించారు. స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంటప్రెన్యూర్‌ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్‌ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలను కున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై, యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం అని అర్థం చేసుకోవాలి. అభివృద్ది విధాన రూపకల్పనకు సంబంధించి నిర్ణయం తీసుకునే పక్రియలో మహిళలను ఆర్థికంగా భాగస్వాములుగా ఎలా చేయవచ్చో థీమ్‌ హైలైట్‌ చేస్తుంది. భవిష్యత్‌ వైపు అడుగులు వేయాలంటే మహిళలను ముందుకు తీసుకుని వెళ్లడంతో పాటు, లింగవివక్ష లేకుండా చేయాలి. స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్‌ డే సందేశం అదే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబ పరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించు కోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి.

తెలంగాణలో మహిళల రక్షణకు షీ టీమ్స్‌ ఏ విధంగా పనిచేస్తున్నాయనుకుంటున్నారు?
-ఇప్పుడు ఎక్కువగా సైబర్‌ క్రైమ్‌ ఫ్రాడ్‌ సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే రక్షణ దళాల వాట్సాప్‌ నెంబర్‌కి మెసేజ్‌ చేయాలి. తెలంగాణలో మహిళల రక్షణకు షీ టీమ్స్‌ ఏర్పాటు చేశాక మంచి ఫలితాలు వస్తున్నాయి. మహిళలకు అండగా అవి బాగా పనిచేస్తున్నాయి. గతంతో పోలిస్తే మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఒకే తరహా కఠిన చట్టాలు రావాలి. అప్పుడే ప్రజల్లో భయం నెలకొంటుంది. ఇకపోతే షీ టీమ్స్‌ ఏర్పాటు చేసినప్పుడు దీనిని బలోపేతం చేసి మహిళలకు అండగా నిలవడంలో రక్షణ దళాల కృషి ప్రశంసనీయం. ఇదో రకంగా తెలంగాణ షీ టీమ్స్‌కు దక్కిన గౌరవంగా చూడాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. షీటీమ్స్‌ ఏర్పడినందున వారి పాత్రను, కృషిని అభినందించాల్సిందే. ఎన్నో క్లిష్లమైన సమస్యలను, కేసులను పరిష్కరించడంతో పాటు..మహిళలకు తామున్నామన్న భరోసా ఇవ్వడంలో షీ టీమ్స్‌ విజయం సాధించాయి. డయల్‌ 100, మహిళా భద్రత, షీ టీమ్స్‌ గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు. ఉమెన్‌ సేప్టీ విషయంలో అనేక చర్యలు తీసుకున్నారు. మహిళలను వేధించినా లేదా రేప్‌ కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు చేయించడంలో షీటీమ్స్‌ కీలక భూమిక పోషించాయి. యువతులు, మహిళలు ఇక నగరంలో నిర్భయంగా ఉండొచ్చన్న భరోసా దక్కడంలో ఈ టీమ్స్‌ బాగా కృషి చేస్తున్నాయి. వారికి అండగా, రక్షణగా ‘షి’ బృందాలను ఏర్పాటు చేసి వారి భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది.

యువత ఆన్‌లైన్‌ గేమ్‌లకు బలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా మహిళలు కూడా ఉన్నారు? వీరికి మీరిచ్చే సలహా?
– వందలాదిమంది యువత ఆన్‌లైన్‌ గేమ్‌లకు బలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా మహిళలు కూడా ఉండడం బాధాకరం. విచ్చలవిడి స్వేఛ్ఛ కూడా భయంలేకుండా చేస్తోంది. చట్టాలను గౌరవించడం లేదు. హత్యలు, ఆత్మహత్యలు సర్వసాధారణం అయ్యాయి. వీటిని అరికట్టేందుకు నిరంకుశ విధానాలు అవసరం. ప్రధానంగా బెట్టింగ్‌ యాప్‌లతో డబ్బుతో పాటు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అరికట్టాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు. జూదాలు ప్రాణాలు తీస్తున్నాయి. జూదమొక్కటే కాకుండా మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటివన్నీ యువతను మత్తులో దింపుతున్నాయి. ఆ తరవాత అరాచక శక్తులుగా చేస్తున్నాయి. చివరకు ప్రాణాలు తీస్తున్నాయి. ముందుగా ఇంటర్‌నెట్‌ నుంచి ఇలాంటి యాప్‌లను నిషేధించే విషయంలో చర్యలు లేవు. యాప్లు, మద్యం, గుట్కా ప్రకటనలు నేటికీ వస్తున్నాయి. ప్రముఖ నటులు నటించిన ప్రకటనలు టీవీల్లో కోకొల్లలు. వీటిని తక్షణమే నిషేధించాలి. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ యాప్‌లను పోర్న్‌ వీడియోలను నిలిపివేయాలి. గల్ఫ్‌, చైనా, కొరియా లాంటి దేశాల్లో ఇలాంటివి అస్సలు కనిపించవు. వాటిపై సంపూర్ణ నిషేధం ఉంది. మనం మాత్రం యదేఛ్ఛగా ప్రోత్సహిస్తున్నాం. ఆన్‌లైన్‌ బెట్టింగులలో కాసినో యాప్‌ల నుండి పోకర్‌, రౌలెట్‌, బ్లాక్‌ జాక్‌, జంగ్లీ, రమ్మీ వంటి వాటితో పాటు లాటరీ యాప్‌లు…ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ ఎక్కడో విదేశాల నుండి నడిపిస్తున్నా మన దేశంలో మరింత ప్రభావం చూపిస్తున్నాయి. వీటి బారిన పడి యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. డబ్బులు వస్తున్నాయి కదాని టీవీ ఛానళ్లు యధేచ్చగా ప్రసారం చేస్తున్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ మాయలో పడి ఇటీవల ఓ యువకుడు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేశాడు. అలాగే దానిని మానుకోలేక పోతున్నానని చెబుతూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలో ఇలాంటి ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. ఇటీవల హైదరాబాద్‌ మెట్రో రైల్లో ఓ బెట్టింగ్‌ యాప్‌ను అప్లోడ్‌ చేసినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తొలగించాల్సి వచ్చింది. ఈ బెట్టింగ్‌ యాప్‌లను సినీ, క్రీడా స్టార్లు ప్రమోట్‌ చేయడంతో ఈ మోజులో సామాన్యులూ పడుతున్నారు. వీటికి తోడు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల చెలామణీ విపరీతంగా పెరిగింది. పెద్ద పెద్ద సెలబ్రెటీలు, సినిమా స్టార్లు, రాజకీయ నాయకుల పిల్లలు దొరికిపోవడం చూస్తున్నాం. ఇలాంటివన్నీ తక్షణం నిషేధిస్తే తప్ప యువతను రక్షించుకోలేం.

ఇటీవల మరణించిన ఇద్దరు మహిళలు స్వేచ్ఛ-షెఫాలిల పై మీ అభిప్రాయం ?
– చాలా బాధాకరం. యాధృచ్చికమో, పూర్వ జన్మలంటూ ఉంటే వాటి పర్యవసానమో తెలియదు. ఇటీవల ఇద్దరు మహిళల జీవితాలు అటు ఇటుగా అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఒకేరోజు ఒకే సమయంలో ఇద్దరి జీవితాలను ముగించుకున్నారు. ఒకరు మోడల్‌, వీడియో జాకీ, బాలీవుడ్‌ నటి షెఫాలి జరీవాలా, మరొకరు కవయిత్రి, యాంకర్‌, జర్నలిస్ట్‌ స్వేచ్ఛ వొటార్కర్‌. షెఫాలి వయసు 42. స్వేచ్ఛ వయసు 40. ఈ ఇద్దరి జీవితాలను చూస్తే ఏమనిపిస్తోంది.. దాదాపు అటు ఇటుగా ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ అందగత్తెలే.. ఎన్నో అవకాశాలు వచ్చినా సరిగ్గా సెలెక్ట్‌ చేసుకోలేని ఓటమి. తలిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛలో సరైన నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధత. తల్లిదండ్రుల పని ఒత్తిళ్లలో ఒంటరితనం, సహకారం లేకపోవడం. మరోవైపు పాడులోకంలో ఎన్నో దారులు ఎన్నో అవకాశాలు. సరైన గైడెన్స్‌ లేక తప్పటడుగులు. పైగా ఇద్దరూ సెలబ్రిటీలు. మొఖాన నవ్వులు చెదరితే సమాజం హర్షించదు. ఎన్ని బాధలు వున్నా నవ్వుతూ తుళ్లుతూ కనిపించాలి. ఏమాత్రం తేడా కనిపిస్తే సమాజం ఊరుకోదు. తమ బాధను ఎవ్వరికీ చెప్పుకోలేరు. స్నేహితులను నమ్మలేరు. లోలోన కుమిలిపోతూ మానసిక ఒత్తిళ్లకు గురవుతూ అనారోగ్యాల పాలవుతూ ఆసుపత్రులకు తిరుగుతూ మందులు వాడుతూ వారు చేసే అవధానం అంతా ఇంతా కాదు. అందమైన లోకంలో అలా మెరుస్తూ ఉండాలంటే ఎంతో కష్టం. అభిమానులు మరో వైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. ఈ ఒత్తిళ్లను తట్టుకున్న వాళ్ళు ముందుకు వెళుతుంటారు. తట్టుకోలేని వారు, మరింత సున్నిత హృదయలు ఇలా మధ్యలో ఏదో ఒక రూపంలో జీవితాలను ముగించుకుంటూ ఉంటారు. వీరిద్దరి జీవితాలు యువతకు గుణపాఠాలు కావాలి.

Related posts

Leave a Comment