By ఎం.డి అబ్దుల్ (సీనియర్ జర్నలిస్ట్)
”గమ్యం చేరేవరకు ఆగవద్దు..జాగృతులు కండి. దీర్ఘ అంతమవుతోంది…పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు.. ప్రేమతత్వాన్ని వీడవద్దు.. విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి. మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి. మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు.. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు. మతం అనేది సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. అది ఆచరణలో, ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది”
– ఇవన్నీ స్వామి వివేకానంద దివ్య ప్రబోధాలు
అంతటి మహనీయుడు స్వామి వివేకానంద 120 ప్రబోదాలను తీసుకొని వాటిని తెలుగులోకి అనువదించారు శ్రీ బండి రాజుల శంకర్ గారు. సూక్తులను పద్య రూపంలో సులువుగా అందరికీ అర్ధమయ్యే రీతిలో అనువదించాలంటే ఆ సూక్తికి సంబంధించిన భావార్థం ముందుగా అనువాదకుడికి అర్ధమై ఉండాలి. బండి రాజుల శంకర్ గారు పూర్తిగా వివేకానంద బోధల సారాన్ని జీర్ణించుకున్నారని ఈ ‘వివేకానంద సూక్తిశతి’లోని పద్యాలను చదివిన వారు ఇట్టే గ్రహిస్తారు. శ్రీ శంకర్ గారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో గత మూడు దశాబ్దాలుగా శ్రీ రామకృష్ణ విద్యాలయాన్ని నడుపుతూ తమ దగ్గర చేరిన పిల్లలందరికీ స్వామి వివేకానంద బోధనలను పరిచయం చేస్తూ వారు చక్కటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి దోహదపడుతున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో వారు ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసి సమాజానికి అందించారు. అయితే స్వామి వివేకానంద ధీర వాక్కులు ఇంకా ఎక్కువ మందికి చేరాలన్న సత్సంకల్పంతో ముఖ్యంగా పల్లెల్లో, చిన్న పట్టణాల్లో చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ ‘వివేకానంద సూక్తిశతి’కి అనువాద రూపంలో శ్రీకారం చుట్టారు. అలాగే ఉపాధ్యాయులు తమ విద్యార్థులను స్వామి వివేకానంద బోధలతో ఉత్తేజ పరచదలచుకుంటే ఈ పద్య రూప సూక్తులను పాడి చెబుతూ వాళ్లలో నిరంతరం స్ఫూర్తిని నింపవచ్చు. ఆంగ్లంలో వివేకానందుడి దీరవాణిని చెప్పి వెంటనే ఈ తెలుగు అనువాదం వాళ్లకు వినిపిస్తే వాళ్లు చక్కని స్ఫూర్తిని పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. భాషీయ కళలలో కథలు, పాటలు, గేయాలు ఎంతో ఆసక్తికరంగా ఉండి త్వరితగతిన మనస్సులపై చెరగని ముద్ర వేస్తాయి. శ్రీ బండి రాజుల శంకర్ గారు ‘స్వామి వివేకానంద జీవిత కథ’ను బుర్రకథ రూపంలో జన బాహుళ్యంలోకి తీసుకు వెళ్లటానికి విశేష కృషి చేస్తున్నారు. మూలసూక్తి అంతరార్ధాన్ని పద్యరూపంలో చేసి ప్రతి పద్యానికి చివర ‘విశ్వదాభిరామ వినురవేమ’లాగా ‘వినుడి స్వామి సద్వివేక వాణి’తో ముగించడం చాలా బావుంది. అలానే వివేకానందులు ప్రవచించిన మరికొన్ని అమృత వాక్కులకు కూడా సులభమైన తెలుగు పద్యాలను అందించారు.
వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్త్వ శాస్త్రములో నే కాకుండా, సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో ‘జీవుడే దేవుడు’ అనేది అతని మంత్రముగా మారింది. ‘దరిద్ర నారాయణ సేవ’ (పేదవారి సేవతో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. ‘విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?’ అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతిలో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది. అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహమును కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి.
సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగు వాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది. సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి. త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు. స్వామి వివేకానంద ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్ఫై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా ప్రకటించింది.
శ్రీ బండి రాజుల శంకర్ గారి పవిత్ర ఋష్యాత్మ నుంచి వెలువడి సుకృతి ఈ ‘వివేకానంద సూక్తి శాంతి’. విశ్వమానవ హృదయాన్ని భారతీయ సంస్కృతి వైవు మళ్లించిన మహాదార్శనికుడు స్వామి వివేకానందుడు ఆంగ్ల భాషలో రచించిన సూక్తులకు రమణీయ శతకాకృతి ఈ ‘వివేకానంద సూక్తిశతి’. సాహిత్యాధ్యయనం , రచనం, విశ్లేషణం, శోధనం, బోధనం వంటి అంశాలలో అపార ప్రతిభ, అనుభవం ఉన్న అంతకంటే మంచి మనసున్న శ్రీ శంకర్ గారు తన శతకంలో దిశలు మోస్తున్న భారతీయ సంసృతీ వైభవాన్ని మధుమధురంగా అభివర్ణిస్తూనే సమాజంలోని అమానుష శక్తులు తలెత్తకుండా పద్యాలలో అక్షరాస్త్రాలు ఎత్తడం ఒక ప్రత్యేకత. శంకర్ గారి పద్యం – పద్యంలా ఉంటుంది. ఆకట్టుకుంటుంది. పలకరిస్తుంది. గుండెల్లోకి చేరుతుంది. మధురిమలు కురుస్తుంది. పదం పధంలో సరళత్వం మెరుస్తుంది. భావదార మురిపిస్తుంది. పదానుబంధం సొగసులు వర్షిస్తుంది. అయన పద్యం హృదయైక వేద్యమైంది. అనపద్యమైంది. ఆరామ చైతన్యాభిరామ సుందరమైనది. ఇందులోని పద్యాలు కవితాత్మతో సందేశదాయకంగా ఉన్నాయి. ఈ శతక రచన ఒక మహోజ్వల సన్నివేశం అనిపిస్తుంది. ఇది ఒక అద్భుతం.. ఇది ఒక చరిత్రాత్మకం.
ఈ ‘వివేకానంద సూక్తిశతి’కి అభినందన రూపంలో స్వామి శితికంఠానంద (రామకృష్ణ మఠం -హైదరాబాద్), వివేకానందీయం -ఆచార్య కసిరెడ్డి (అధ్యక్షులు -అఖిల భారతీయ సాహిత్య పరిషత్), వివేకానంద సూక్తిశతి- భారత్ భాషాభూషణ్, కవితిలక కీ.శే డా. తిరునగరి (మహాకవి దాశరథి అవార్డు గ్రహీత-తెలంగాణ ప్రభుత్వం), శంకరాభరణం – డా. కూరెళ్ల విఠలాచార్య (రచయితల సంఘం వ్యవస్థాపకులు, యాదాద్రి భువనగిరి జిల్లా), ఈశ్వరవాణి – కవి సౌజన్య, మహోపాధ్యాయ డా. లింగంపల్లి రామచంద్ర (రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత), బహుముఖ ప్రజ్ఞాశాలి – బూర్గుల మధుసూదన్ (న్యాయమూర్తి -మల్కాజ్ గిరి కోర్టు), పద్యాలలో పరమార్ధం – తిరునగరి శ్రీనివాస్ (సీనియర్ జర్నలిస్ట్), వివేకపథం – డా. పోరెడ్డి రంగయ్య (అధ్యక్షుడు -తేజ సాహిత్య సేవాసంస్థ , యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం), అభినందన – రావుల మహేందర్ రెడ్డి (జాయింట్ కలెక్టర్, వరంగల్ రూరల్ జిల్లా), పద్య సూక్తి – మిట్టపల్లి విజయ్ కుమార్ ( వ్యవహర్త , ఎవరెస్ట్ హై స్కూల్ , ఆలేరు) తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
స్వామి వివేకానంద సందేశాన్ని విద్యార్ధి లోకానికి తీసుకు వెళ్లటానికి శ్రీ బండిరాజుల శంకర్ చేసిన ఈ ప్రయత్నం ఎంతో ఉపయుక్తమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి కృషి ప్రశంసనీయం. ఈ చిరు కృతి బహుళ జనాదరణ పొందాలని, విద్యార్ధులకు, యువతకు నిత్య స్ఫూర్తిదాయినిగా ఉండాలని ఆశిద్దాం.
***
వివేకానంద సూక్తిశతి
(120 పద్యాలలో వివేకానంద సందేశం)
రచన : బండిరాజుల శంకర్
ప్రథమ ముద్రణ: మార్చి 2021
ప్రతులు : 2000
ప్రచురణ : శ్రీ రామకృష్ణ విద్యాలయం, ఆలేరు
కవర్ పేజీ డిజైన్ & పేజీ లేఅవుట్ : శరత్ నల్లనాగుల
ముద్రణ : శ్రావ్య గ్రాఫిక్స్
వేల : రూ. 150/-
ప్రతులకు : శ్రీ రామకృష్ణ విద్యాలయం, 12-7, వివేకానందనగర్ ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా -508101 తెలంగాణ
ఇ-మెయిల్ : shankarbandirajula@gmail.com
సెల్ : 9948050608