మండుటెండలను లెక్కచేయని జర్నలిస్టులు..జగిత్యాల మహాసభకు అపూర్వ స్పందన : సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్యెల్యే హామీ

సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్యెల్యే హామీ
Spread the love

ఇవ్వాళ జగిత్యాల పట్టణంలోని వికెబి గార్డెన్స్ ఫంక్షన్ హాలులో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) జగిత్యాల జిల్లా మహాసభకు జర్నలిస్టుల నుండి అపూర్వ స్పందన లభించింది. భగ భగ మంటున్న మండుటెండలను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరై టీయుడబ్ల్యుజె సంఘం పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల నుండి 300పైగా జర్నలిస్టులు తరలిరావడంతో ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. స్థానిక ఎమ్యెల్యే సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీలు గౌరవ అతిథులుగా, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.కరుణాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.శ్రీనివాస్ లు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. సభలో శేఖర్, విరాహత్ అలీలు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, టీయుడబ్ల్యుజె సంఘం కార్యకలాపాలను వివరించారు. అలాగే ప్రత్యేకంగా జగిత్యాల జర్నలిస్టుల సమస్యలను ఎమ్యెల్యే సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్యెల్యే స్పందిస్తూ త్వరలో జగిత్యాల పట్టణంలో 100మంది జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూము ఇళ్లను మంజూరీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జగిత్యాల జర్నలిస్టులకు ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందేలా ఐఎంఏ నాయకుడిగా ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మపురి సురేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బండ స్వామి, సీనియర్ నాయకులు సూర్యం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment