RRR Movie Review : మనసు దోచిన మల్టీ స్టారర్ !!

RRR Movie Review
Spread the love

by ABDUL M.D-Tollywoodtimes

చిత్రం : ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం)
దర్శకత్వం : ఎస్‌.ఎస్‌. రాజమౌళి
విడుదల : మార్చి 25, 2022
టాలీవుడ్ టైమ్స్ రేటింగ్: 5/5
నటీనటులు :
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌,
అజయ్ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌,
శ్రియా శరణ్‌, ఒలివియో మోరీస్,
రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ,
రాజీవ్‌ కనకాల, రాహుల్‌ రామకృష్ణ తదితరులు.
నిర్మాణం :డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్
నిర్మాత: డీవీవీ దానయ్య
కథ: విజయేంద్ర ప్రసాద్‌
సంగీతం : ఎం.ఎం. కీరవాణి
సినిమాటోగ్రఫీ : సెంథిల్‌ కుమార్‌
ఎడిటర్‌ : అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌ (రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి’ లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రమిదే కావడం..రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నవిషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా శుక్రవారం-మార్చి- 25-2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్లు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేసి అభిమానులను ఎంతగానో ఉత్తేజితుల్ని చేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా భారీ స్థాయిలో నిర్వహించడంతో ఈ ‘ట్రిపుల్ ఆర్’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. మరి ఎన్ని అంచనాలమధ్య విడుదలైన ఈ ఈ సినిమా ఎలావుందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..
కథలోకి వెళితే…
1920 ప్రాంతంలో ఈ చిత్ర కథంతా సాగుతుంది. అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వంలో విశాఖపట్టణానికి చెందిన రామరాజు (రామ్‌ చరణ్‌) పోలీసు అధికారిగా ఉంటూ పదోన్నతి కోసం పై అధికారుల ఆదేశాలనుగుణంగా విధులు నిర్వహిస్తుంటాడు. ఆ గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటకోసం కట్టుబడి ఉంటాడు. వారికిచ్చిన మాటను నిలుపుకోవాలంటే.. ఆయన కచ్చితంగా పదోన్నతి పొందాల్సిందే. ఆ పదోన్నతి పొందడం కోసమే స్వాతంత్య్ర పోరాట యోధులపై కూడా విరుచుకుపడతాడు. ఇదిలా ఉండగా మరోవైపు గవర్నర్‌ స్కాట్‌ దొర (రే స్టీవెన్ సన్) ఓ సారి ఫ్యామిలీతో కలిసి ఆదిలాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు.. అక్కడ గోండు జాతికి చెందిన బాలిక మల్లిని తమతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తాడు. తమ బిడ్డని తీసుకెళ్లొద్దని అడ్డుకున్న తల్లిపై దాడి చేయిస్తాడు. ఇది అన్యాయం అని భావించిన గోండు జాతి బిడ్డ భీమ్‌ (ఎన్టీఆర్‌) ఎలాగైనా మల్లిని తిరిగి తీసుకురావాలనుకుంటాడు. అందు కోసం తన స్నేహితులతో కలిసి ఢిల్లీకి బయలుదేరుతాడు. పకడ్బందీ బందోబస్తు ఉన్న బ్రిటీష్‌ కోటలోకి భీమ్‌ ఎలా వెళ్లగలిగాడు? అక్కడే పోలీసు అధికారిగా ఉన్న రామరాజు, ఎన్టీఆర్‌ ఎలా స్నేహితులు అయ్యారు? వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఒకరిపై ఒకరు ఎందుకు ఎదురు దాడికి పూనుకున్నారు? అసలు రామరాజు తన మరదలు సీత (ఆలియా భట్‌) కథేంటి? అతని నేపథ్యం వివరాలు ఎలాంటివి? శక్తిమంతులైన ఈ ఇద్దరు కలిసి బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చారు? అనేదే క్లయిమాక్స్!!
విశ్లేషణలోకి వెళదామా…
ఇద్దరు స్టార్ల‌తో సినిమా తీయటం అంటే మాటలు కాదు. చేతలు కావలి. అయితే అవతల ఏ హీరో ఉన్నా తన యాక్షన్ స్కీమ్ లోకి తెచ్చుకోవటం రాజమౌళికి బాగాఅలవాటు. వాళ్ల ఇమేజ్ లకు ప్రాముఖ్యతనిస్తూనే తనదైన శైలిలో యాక్ష‌న్ ప్యాకేజీని ప్రిపేర్ చేస్తాడు. అదే ‘ఆర్ ఆర్ ఆర్’కు చేసారు. రామ్, భీమ్ అనే పవర్ ఫుల్ పాత్రల మధ్య నడిచే క్యారక్టర్ డ్రామా ఈ సినిమా కథ. సినిమాను ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందించడంలో దర్శకధీరుడు ఎస్. ఎస్.రాజమౌళికి తెలిసిన కిటుకులు మరే దర్శకుడికి తెలియవేమో! ‘ట్రిపుల్ ఆర్’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ సినిమా కోసం అహోరాత్రులు శ్రమించాడు దర్శకుడు రాజమౌళి. ఆయన పడ్డ కష్టమంతా ప్రేక్షకులకు తెరపై స్పష్టంగా కనిపించింది. ఓ చిన్న పాయింట్‌ని కథగా ఎంచుకొని, దానికి భావోద్వేగాలు మేళవించి, కథనాన్ని నడిపించిన తీరు అబ్బో..అనిపిస్తుంది. గిరిజన బాలికను బ్రిటీష్‌ సైన్యం ఎత్తుకెళ్లే ఓ ఎమోషనల్‌ సీన్‌తో కథ మొదలయి.. నీరు, నిప్పు అంటూ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల పాత్రలను పరిచయం చేసిన తీరు భలేగా ఉంది. అందుకు తగ్గట్టే బలమైన సన్నివేశాలతో ప్రథమార్ధం సాగుతుంది. ఇంటర్వెల్‌ సీన్ అయితే.. చిత్రానికే హైలెట్‌ గా నిలిచింది. బ్రిటీష్‌ కోటలోకి ఎన్టీఆర్‌ వెళ్లే సన్నివేశాలు వాహ్.. అనిపిస్తాయి. ప్రథమార్ధం ఆసక్తికర సన్నివేశాలతో ఎంతో ఎమోషనల్‌గా సాగి.. తర్వాత ఏం జరగబోతోందోనని ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తుంది. ద్వితీయార్ధంలో అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియల ఎంట్రీ కథపై మరింత పట్టును బిగిస్తుంది. భీమ్‌ని అరెస్ట్‌ చేసి శిక్షించే సన్నివేషాలయితీ ప్రతీ ఒక్కరినీ కంటతడిపెట్టిస్తాయి. ముఖ్యంగా సుద్దాల అశోక్ తేజ రాసిన ‘కొమరం భీముడో.. కొమరం భీముడో’ అనే పాట హృదయాలను కొల్లగొడుతుంది. మనసుపొరల్లో రగులుతున్న ఆవేశాన్ని సుద్దాల అశోక్ తేజ తనదైన శైలిలో రంగరించి వదిలిన బాణం ఎక్కడో తగులుతుంది. ఎన్టీఆర్ అభిమానులకు ఈ పాట సుద్దాల అశోక్ తేజ ఇచ్చిన గిఫ్టుగా అనుకోవచ్చు. అలాగే ఈ పాటను తెరపై చిత్రీకరించిన విధానం కూడా గొప్పగా ఉంది అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే రామ్‌-భీమ్‌ లు కలిసి చేసే పోరాట సన్నివేశాలు.. ఆ తర్వాత జైల్లో ఉన్న రామ్‌ని తీసుకురావడానికి భీమ్‌ వెళ్లే సన్నివేశం.. హై లెవల్లోకి తీసుకెళ్లి సినిమాపై మరింత ఆసక్తిని కలగజేశాయి. ఇద్దరు కలిసి బ్రీటీష్‌ కోటపై దాడి చేసిన సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది.
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ తమ పాత్రని ఒక ఆయుధంగా మలుచుకున్నారనిపిస్తుంది. భీమ్‌గా ఎన్టీఆర్‌, రామరాజుగా రామ్‌ చరణ్‌.. తమతమ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు వాహ్.. అనిపించకమానదు. ఇద్దరి హీరోల్లో ఎవరు బాగా చేసారు అంటే.. ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడి ఇరగదీశారనే చెప్పాలి. దర్శకుడు రాజమౌళికి ఈ ఇద్దరితో చేసిన అనుభవంతో వాళ్ల బలాలు, బలహీనతలు తెలుసు. వాటిని దృష్టిలో పెట్టుకుని సీన్స్ డిజైన్ చేయటంతో ఫెర్ ఫెక్ట్ గా ఆ పాత్రలకు మ్యాచ్ అయ్యారు. ఫస్టాఫ్ లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తే..సెకండాఫ్ రామ్ చరణ్ తనేంటో, తన కెపాసిటీ ఏంటో చూపించారు. ఇక రామ్ చరణ్ ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయింది. కథలోంచి తీసుకుని రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ని చాలా చక్కగా ఎలివేట్ చేసారనిపిస్తోంది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రడక్షనే కూడా చాలా బాగుంది. హై మూమెంట్స్ కూడా ఇద్దరికి ఫెరఫెక్ట్ గా షేర్ చేయటంతో ఇద్దరిలో ఒకరే బాగా చేసారని ఎక్కడా చెప్పలేని విధంగా సినిమా ఉంటుంది. ఇద్దరూ ఒకర్ని మించి మరొకరు చెలరేగిపోయారు. ప్రతి సన్నివేశంలోనూ నువ్వా నేనా అన్నట్లుగా విజృభించారు. వీరిద్దరి మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకే హైలైట్‌ గా నిలిచాయి. ‘నాటు నాటు..’ పాటకు ఈ ఇద్దరు హీరోలు వేసిన స్టెప్పులకు థియేటర్స్‌లో గోళలు..ఈలలు వినిపించాయి. ఈ సినిమా కోసం తారక్‌, చెర్రి పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తోంది. ఇక సీత పాత్రలో ఆలియా భట్‌, జెన్నీఫర్‌ అనే బ్రిటీష్‌ యువతిగా ఒలివియా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వెంకట రామరాజు అలియాస్‌ బాబాగా అజయ్‌ దేవ్‌గణ్‌, అతని భార్య సరోజిగా శ్రియ మెప్పించారు. వీరి పాత్రల నిడివి తక్కువే అయినా.. సినిమాకు అవి కీలకంగా ఉంటాయి. విలన్‌ స్కాట్‌ పాత్రలో రే స్టీవెన్ సన్, అతని భార్యగా అలిసన్ డూడీ తనదైన నటనతో మెప్పించారు. రామరాజు బాబాయ్‌గా సముధ్రఖని, భీమ్‌ స్నేహితుడు లచ్చుగా రాహుల్‌ రామకృష్ణ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సగటు సినీ అభిమాని కోరుకునే అన్ని అంశాలతో ఆర్.ఆర్. ఆర్ అంచనాలను అందుకుని మించిపోయే రేంజ్ లో ఉంది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం ఎమ్‌. ఎమ్‌. కీరవాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని పాత్రలకు ప్రాణం పోశాడు. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ ఎంతో బావుంది. ఈ సినిమాలోని పోరాట ఘట్టాలన్నీ సినిమా స్థాయిని పెంచాయి. 1920నాటి కథకు జీవకళ ఉట్టిపడేలా సెట్స్‌ని తీర్చిదిద్దాడు ప్రొడెక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌. సాయి మాధవ్‌ బుర్రా మాటలు సూపర్. అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ వండర్. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండి సినిమాకు రెట్టింపు ఆకర్షణను తెచ్చాయి. మొత్తం మీద ఈ ‘ట్రిపుల్ ఆర్’కు ఢోఖాలేదు…దర్శకధీరుడు ఎస్. ఎస్.రాజమౌళికి ఎదురేలేదు!!

Related posts

Leave a Comment