విక్టరీల వీరుడు వెంకటేష్

Hero Venkatesh Special Article
Spread the love

వెంకీ- విక్టరీ వెంకటేష్ – అని అభిమానులు పిలుచుకునే దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ ప్రేక్షకుల ఆత్మీయ స్టార్ గా గుర్తింపు పొందారు. తన సుదీర్ఘమైన 35 ఏళ్ళ సినీ జీవితంలో 70 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన రికార్డు స్థాయిలో 7 నంది అవార్డులు, 6 ఫిలిమ్ ఫేర్ సౌత్ అవార్డులు, ఇంకా ఇతర అవార్డులు అందుకున్నారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు ‘స్వర్ణ కమలం’, ‘ప్రేమ’, ‘గణేష్’, ‘చంటి’, ‘కలిసుందాం రా’, ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’, ‘సుందరకాండ’, ‘బొబ్బిలి రాజా’, ‘ప్రేమించుకుందాం రా’, ‘పవిత్ర బంధం’, ‘లక్ష్మి’, ‘సూర్య వంశం’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘నారప్ప’, ‘దృశ్యం’, ‘దృశ్యం -2’ మొదలైనవి.
అత్యధికంగా తన సరసన తెలుగులో హీరోయిన్లను పరిచయం చేసిన పేరు కూడా ఆయనకుంది. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతీ జింటా, అంజలా జవెరీ, కత్రినా కైఫ్ మొదలైన హీరోయిన్లు వెంకటేష్ సరసన తొలిసారిగా తెలుగు తెరపై ప్రేక్షకుల్ని అలరించారు. సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్యతో ఏడు సినిమాలు నటించారు.
వెంకటేష్ డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించారు. ఆయన తండ్రి అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరి కార్డు సాధించిన, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత డి. రామానాయుడు. ఆయన సోదరుడు డి సురేష్ ప్రముఖ నిర్మాత అని తెలిసిందే. వెంకటేష్ 11 ఏళ్ళ వయసులోనే 1971 లో ఆయన తండ్రి నిర్మించిన అక్కినేని నాగేశ్వర రావు- వాణిశ్రీ సూపర్ హిట్ ‘ప్రేమనగర్’ లో బాలనటుడిగా పరిచయమైన సంగతి చాలా మందికి తెలియదు.
హీరోగా ఆయన తొలిమెట్టు 1986 లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ అనే సూపర్ హిట్ చిత్రం. విశేషమేమిటంటే, నటించిన ఈ తొలి చిత్రంతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు నందుకున్నారు. తరువాత ‘స్వర్ణ కమలం’, ‘చంటి’, ‘ధర్మ చక్రం’, ‘గణేష్’, ‘కలిసుందాం రా’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే’ వేరులే మొదలైన చిత్రాలతో ఉత్తమ నటుడుగా నంది అవార్డు లందుకున్నారు.
1988 లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో ‘స్వర్ణ కమలం’ ఆయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో, ఆసియా-పసిఫిక్ చిత్రోత్సవాల్లో, ఆన్ అర్బర్ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలందుకుంది. ఉత్తమ చిత్రం నంది అవార్డు, ఫిలిమ్ ఫేర్ అవార్డు, ఉత్తమ నటుడు నంది అవార్డులను కూడా సాధించి పెట్టింది ఈ చిత్రం.
వెంకటేష్ కెరీర్ ప్రారంభ దినాల్లో ‘బొబ్బిలి రాజా’ అతి పెద్ద కమర్షియల్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇళయరాజా పాటలతో ఫారెస్ట్ నేపథ్యంలో దివ్యభారతితో కలిసి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే వినోదాల విందునందించారు. ఆ తర్వాత ‘శత్రువు’ లో వెంకటేష్, న్యాయస్థానాల్లో అవినీతిని అరికట్టలేక, విసుగు చెంది, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక ఆవేశపూరితుడైన యువ న్యాయవాది పాత్రతో ఎమోషన్స్ పండించారు. దీని తర్వాత విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో, ‘క్షణం క్షణం’ అనే మరో మ్యూజికల్ అడ్వెంచర్ లో నటించి కెరీర్ గ్రాఫ్ ని పెంచుకున్నారు.
విక్టరీ వెంకటేష్ కి మరో మైలు రాయి 1991లో తమిళ సినిమా చిన్నతంబిని తెలుగులో పునర్నిర్మించి విడుదల చేసిన ‘చంటి’ ! వెంకటేష్ సినీ జీవితాన్ని ఒక మలుపు తిప్పిన చిత్రంగా ఇది నమోదైంది. అప్పటిదాకా అవేశ పూరిత యువకుడి పాత్రలు ఎక్కువగా పోషించిన వెంకటేష్, ‘చంటి’ లో అమాయకుడైన ఇంటి పని వాడుగా ఖుష్బూ తో చాలా శ్రమించి పాత్రని పండించారు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆ తర్వాత దీని హిందీ రీమేక్ ‘అనారీ’ కుడా ప్రధాన పాత్రను వెంకటేషే పోషించారు. ఈ చిత్రంతో వెంకటేష్ కుటుంబ తరహా చిత్రాలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు.. దీంతో మహిళా ప్రేక్షకులలో ఆదరణ కూడా ఆయనకు పెరిగింది. ఆ తరువాత వచ్చిన చాలా సినిమాలలో ఫ్యామిలీ హీరో పాత్రలు నటిస్తూ రూటు మార్చుకున్నారు. ప్రేక్షకులకు కూడా ఇదే నచ్చింది. ఫేంకటేష్ ని సాఫ్ట్ హీరోగా చూడదల్చుకున్నారు.
ఇక ‘లక్ష్మి’, ‘తులసి’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ మూడూ వరుసగా వెంకటేష్ కి హ్యాట్ ట్రిక్ ని సాధించి పెట్టాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మొదలైన విహాయవంతమైన ఫ్యామిలీ సినిమాల్లో నటిస్తూ వచ్చిన వెంకటేష్ -‘నారప్ప’, ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ లతో ఫ్యామిలీ సినిమాలకి థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్లని జోడించి కొత్త మలుపు తిప్పారు. ఈ మూడూ తమిళ, మలయాళ రీమేక్ లు.
వెంకటేష్ తన పనిని చాలా పట్టుదలతో చేస్తారు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని పలు సందర్భాలలో చెప్పుకున్నారు. “ఇష్టపడే వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యొద్దు. అవసరమైన వారికి ఎప్పుడూ బిజీ అని చెప్పొద్దు. నిజంగా నమ్మే వారిని మోసం చేయవద్దు, గుర్తుంచుకునే వారినెప్పుడూ మరచిపోవద్దు” అన్నది ఆయన డీప్ ఫిలాసఫీ.

-ఎం.డి అబ్దుల్

Related posts

Leave a Comment