కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు

kannada hero punith rajkumar no more
Spread the love

కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ (46) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు వెంటనే విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు విక్రమ్‌ ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్‌.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బెట్టడా హువు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకూ ఆయన 32 చిత్రాల్లో నటించారు. ‘వసంత గీత’, ‘భాగ్యవంత’, ‘ఏడు నక్షత్రాలు’, ‘భక్త ప్రహ్లాద’, ‘యరివాను’ వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యువరత్న’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్‌ సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి. పునీత్‌ రాజ్‌కుమార్‌ బాలనటుడిగా సుమారు 14 సినిమాల్లో నటించారు. 2002లో ‘అప్పు’ (తెలుగులో ‘ఇడియట్’)తో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు పునీత్‌. ‘వీర కన్నడిత’, ‘అరసు’, ‘మిలనా’, ‘వంశీ’, ‘రాజ్‌’, ‘జాకీ’, ‘హుడుగరు’, ‘అన్నా బాండ్‌’, ‘యారే కూగడాలి’, ‘పవర్‌’, ‘దొడ్డమానే హుడుగ’, ‘రాజకుమార’, ‘యువరత్న’ తదితర సినిమాలతో మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నటన మాత్రమే కాకుండా నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. డ్యాన్స్‌ ఆధారిత టీవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. కర్ణాటక లెజండరీ యాక్టర్, కంఠీరవ రాజ్‌కుమార్‌, పార్వతమ్మ దంపతులకు 1975వ సంవత్సరం మార్చి 17వ తారీఖున జన్మించారు. తండ్రి వారసత్వంగా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు. 1985వ సంవత్సరంలో బెట్టాడ హూవు అనే సినిమాలో బాలనటుడిగా మెప్పించినందుకుగానూ జాతీయ ఉత్తమ బాలనటుడు అవార్డుకు ఎంపికయ్యారు. అదే సమయంలో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఉత్తమ బాలనటుడిగా ఎంపిక చేసింది. హీరోగానే కాకుండా, గాయకుడిగా కూడా మెప్పించారు. 2002వ సంవత్సరంలో అప్పు సినిమాతో హీరోగా పునీత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే పునీత్‌ను ‘అప్పూ’ అని ఫ్యాన్స్ పిలిచుకోవడం ప్రారంభించారు. వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, అంజనీపుత్ర వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హీరోగా ఆయన 29 సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఆయన నటించిన యువరత్న సినిమా విడుదలయింది. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. 1999వ సంవత్సరంలో డిసెంబర్ ఒకటో తారీఖున అశ్వనీ రేవంత్ అనే ఆమెను పునీత్ రాజ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఫ్రెండ్స్ ద్వారా పరిచయమయిన ఆమెను ఇష్టపడి పెద్దల అంగీకారంతోనే పెళ్లాడారు. ఆ దంపతులకు ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ కు ప్రస్తుతం 46 ఏళ్లు. ఎంతో కెరీర్ ఉండి, ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌కుమార్‌ మరణవార్త గురించి తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలి వచ్చారు. పునీత్ మృతితో కన్నడ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని. పునీత్‌ మృతి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్‌ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీరనిలోటు అని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. పునీత్‌ మరణవార్త విని ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పునీత్‌ మృతి పట్ల విచారం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related posts

Leave a Comment