రామసత్యనారాయణ దారి నిర్మాతలందరికీ ఓ చక్కని రహదారి

jaathiyarahadhaari successmeet
Spread the love

-‘జాతీయ రహదారి’ అభినందన వేడుకలో అతిధులు

భీమవరం టాకీస్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నరసింహనంది దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘జాతీయ రహదారి’ ప్రేక్షకుల ఆదరణతోపాటు… విమర్శకుల ప్రశంసలు పొందడం తెలిసిందే. ముఖ్యంగా… నిర్మాతగా తుమ్మలపల్లికి ఇది 101వ చిత్రం కావడం, ఫిల్మ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకోవడంతోపాటు… కె.రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ, బి.గోపాల్, వి.వి.విజయేంద్రప్రసాద్, వి.వి.వినాయక్ వంటి లబ్ధ ప్రతిష్టుల మెప్పు పొందడాన్ని పురస్కరించుకుని భారత్ ఆర్ట్స్ అకాడమీ. ఎ.బి.సి.ఫౌండేషన్ సంయుక్తంగా అభినందన సభ నిర్వహించాయి. భారత్ ఆర్ట్స్ అకాడమి సారధి లయన్ కె.వి.రమణారావు సారధ్యంలో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, చిత్ర సమర్పకులు-సంధ్య, మోషన్ పిక్చర్స్ అధినేత రవి కనగాల, చిత్ర దర్శకులు నరసింహనంది, హీరో మధు చిట్టి, హీరోయిన్ మమత, లార్విన్ గ్రూప్స్ అధినేత మడిపదిగే రాము తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను రామసత్యనారాయణ కు అందజేశారు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు అతీతంగా… నిర్మాతగా తాను ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉంటానని, అందుకే 100కు పైగా సినిమాలు తీసి… మరో 100 సినిమాలు చేయగలిగే పొజిషన్ లో ఉన్నానని రామసత్యనారాయణ అన్నారు. ప్రతి నిర్మాతకు రామసత్యనారాయణ ఆదర్శప్రాయుడని, ఆయనొక నిత్య కృషీవలుడని అతిధులు పేర్కొన్నారు. అనంతరం యూనిట్ సభ్యులు అందరూ అతిధుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు.

Related posts

Leave a Comment