విడుదల రోజే నాగ చైతన్య ‘లవ్‌స్టోరి’ చూస్తాను : ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌ లో బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌

love story pree reles event
Spread the love

‘‘విడుదల రోజే నేను నాగ చైతన్య ‘లవ్‌స్టోరి’ చూస్తాను. మహారాష్ట్రలో థియేటర్లు ఇంకా తెరవలేదు. ప్రత్యేకంగా స్ర్కీనింగ్‌ వేసుకొని మరీ చూడాలనుకుంటున్నాను. ఈ సినిమా పాటలో ఫస్ట్‌ క్లిప్‌ చూసినప్పుడే సాయిపల్లవికి నేను అభిమానిని అయ్యాను’’ అని బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ పేర్కొన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదలవుతోంది. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. నారాయణ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఆదివారం నిర్వహించిన ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌కు ఆమిర్‌ఖాన్‌, చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘నాగచైతన్యను ‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌లో తొలిసారి కలిశాను. కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. అతని తల్లితండ్రులు చాలా సంస్కారంతో పెంచారు. సినిమా ట్రైలర్‌ చూశాను. నాకు బాగా నచ్చింది. అందుకే నేనే స్వయంగా అడిగి మరీ ఈ కార్యక్రమానికి వచ్చాను. సినిమా ఘన విజయం సాధించాలి’’ అని కోరుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘లవ్‌స్టోరి’ టైటిల్‌ విన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నాగచైతన్య జయాపజయాలను వినమ్రంగా స్వీకరిస్తాడు. ‘ఫిదా’లో సాయిపల్లవి డ్యాన్స్‌, ఎనర్జీ చూసి ముచ్చటేసింది. నా సినిమాలో సాయిపల్లవి సోదరి క్యారెక్టర్‌ చేయాల్సింది. కానీ ‘నో’ చెప్పింది. ఆమెలాంటి అద్భుతమైన డ్యాన్సర్‌తో హీరోగా డ్యాన్స్‌ చేయాలనుంది. శేఖర్‌ కమ్ముల తనదైన శైలిలో ప్రేక్షకులకు హత్తుకునేలా సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఇక చివరగా ఓ రెండు ప్రభుత్వాలకు ఓ విన్నపం అంటూ.. ‘‘చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ 10-15 శాతం మాత్రమే సక్సెస్‌ రేటు ఉంది. ‘20 శాతం సక్సెస్‌ రేటుకే చిత్రపరిశ్రమ పచ్చగా ఉంటుంది’ అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్లు, రెక్కాడితే తప్ప డొక్కాడని చాలామంది కార్మికులు ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లందరూ కలిస్తేనే ఇండస్ట్రీ. అంతేతప్ప ఒక ఐదారుమంది నిర్మాతలో, హీరోలో, దర్శకులో బాగున్నారు కాబట్టి సినిమా పరిశ్రమ అంతా పచ్చగా ఉందని అనుకోకూడదు’’ అని చిరంజీవి అన్నారు. నాగచైతన్య హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం అన్‌ప్లగ్డ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో, ఆ తర్వాత.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు. ‘‘మెరిసేదంతా బంగారం కాదు’ అనే సామెత చిత్ర పరిశ్రమకు సరిగ్గా వర్తిస్తుంది. ఈ మధ్య కరోనా సమయంలో ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసింది. షూటింగ్స్‌ నాలుగైదు నెలలు నిలిచిపోయేసరికి కార్మికులు పడిన ఇబ్బందులు మేం కళ్లారా చూశాం. హీరోలు, సినీరంగ పెద్దలతో కలసి నిధి సేకరణ చేసి నిత్యావసర వస్తువులు నాలుగు నెలల పాటు అందించాం. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, షూటింగ్స్‌ లేకపోతే కార్మికులు పడిన ఇబ్బందులు తెలియాలని. చిత్ర పరిశ్రమ అనేది నిత్యం పచ్చగా ఉండదు. వరదలు, భూకంపాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు ముందుగా స్పందించేది సాయం అందించేది మా చిత్ర పరిశ్రమే. ఈ విషయాన్ని నేను గర్వంగా చెపుతున్నాను. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. సినిమా నిర్మాణ వ్యయం పెరిగింది. కానీ, అందుకు తగ్గట్టు ఆదాయం రాకపోవడానికి కారణాలు ఏమిటని ‘లవ్‌స్టోరి’ వేదికగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలనూ వినమ్రంగా అడుగుతున్నాను. కొంచెం సానుకూలంగా స్పందించి, మా సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాం.’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘కూరగాయలు కూడా చూసి, బాగుంటేనే కొంటాం. కానీ ముందు టిక్కెట్‌ కొని తర్వాత సినిమా చూస్తాం. అలా ఎందుకు చూస్తున్నారంటే మా మీద నమ్మకం. మేం కూడా ప్రేక్షకులను నిరాశపరచకూడదని మా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. దానివల్ల నిర్మాణ వ్యయం పెరగొచ్చు. కొన్నిసార్లు మా పొరపాటు వల్ల ఫెయిల్యూర్స్‌ ఇవ్వొచ్చు. కానీ అందులో మోసం లేదు. దగా లేదు. అంచనాలను అందుకోలేకపోవడం మా తప్పిదం. ప్రేక్షకులను అలరించాలని కోరుకునే మా సాధకబాధకాలపై మీరు కొంచెం దృష్టి సారించి, ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలి. మేం ఆశతో అడగడం లేదు. అవసరానికి అడుగుతున్నాం. మీరు ఒప్పుకోవాలని కోరుకుంటున్నాం. ‘ఆచార్య’ పూర్తయింది. కానీ ఎప్పుడు, ఎలా రిలీజ్‌ చేయాలి. ఈ పరిస్థితుల్లో మనం రిలీజ్‌ చేయగలమా? చేస్తే ఆదాయం వస్తుందా? అనే పరిస్థితి. అసలు ప్రేక్షకులు వస్తారా రారా అనే పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తోంది. జనాలు వస్తారు. కానీ ఆదాయం అంతకంతా వస్తుందా అనేది మనం ఆలోచించాలి. ఆ ధైర్యం, వెసులుబాటు ప్రభుత్వాలు మనకు ఇవ్వాలి. మా కోరికను మీకు విన్నవించుకున్నాం. సానుకూలంగా స్పందించి వీలయినంత త్వరలో జీవో ఇవ్వగలిగితే ధన్యులం’’ అని చిరంజీవి అన్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘‘ఆమిర్‌ఖాన్‌, చిరంజీవిగారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు ఆమిర్‌ఖాన్‌ గారికి కథ చెప్పి ఒప్పిస్తాను అనే నమ్మకం ఉంది. మనం తీసే సినిమాలతో సమాజానికి ప్రయోజనం ఉండాలని భావిస్తాను. ‘లీడర్‌’ సినిమాలో ‘అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉంది’ అని నేను రాసిన డైలాగ్‌ స్ఫూర్తితో ‘లవ్‌స్టోరి’ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’’ అని ప్రేక్షకులను కోరారు.
సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘చిరంజీవి గారి డ్యాన్సు చూసి నాకూ అదే గ్రేస్‌ అలవాటు అయింది. ఆయన నన్ను మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ‘లవ్‌స్టోరి’ సినిమాలో అమ్మాయిలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. ఆ అంశం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది’’ అని చెప్పారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంట బాగుంది. ప్రదర్శన రంగానికి ఉత్తేజం ఇచ్చేలా ‘లవ్‌స్టోరి’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తుండడం సంతోషంగా ఉంది’’ అని చిత్ర నిర్మాతలను అభినందించారు.

Related posts

Leave a Comment