శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక అక్కినేని జీవన సాఫల్య పురస్కారాల కోసం ఈ ఏడాది ముగ్గురు సీనియర్ సినీ పాత్రికేయ ప్రముఖులను ఎంపిక చేసినట్లు అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. బుధవారం సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు, శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీంరెడ్డి, ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఆమని తో కలసి డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు.
సినీరంగం లో పాత్రికేయులుగా నాలుగు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న శైలి టివి డైరెక్టర్ భగీరథ, సుమన్ టివి క్రీయేటివ్ హెడ్ ఎ.ప్రభు, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ బ్యూరో చీఫ్ పసుమర్తి నాగేంద్ర కుమార్ లను అక్కినేని శృతిలయ జీవన సాఫల్య పురస్కారాల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. అక్కినేని నాగేశ్వరావుతో ముగ్గురికి ప్రత్యేక ప్రత్యక్ష అనుబంధం ఉందని, ముగ్గురూ వారి ప్రతిభా నైపుణ్యం తో నిబద్ధతతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
ఈనెల 20వ తేది సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి లో అక్కినేని జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, అదే వేదికపై 2021 అక్కినేని పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని ఆమని వివరించారు. ఈ వేడుకలో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ బి.చంద్రయ్య, తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూధనాచారి, తెలంగాణ ప్రెస్ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, తెలంగాణ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొంటారని ఆమె వివరించారు.
అక్కినేని ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు
పాత్రికేయ రంగంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సీనియర్ పాత్రికేయులు డి.నందకిషోర్, కిషోర్ దాస్, పెమ్మరాజు శ్రీనివాస్, టీవీ 9 న్యూస్ కో ఆర్డినేటర్ చిలుకూరి హరిప్రసాద్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, సాక్షి ఫోటో ఎడిటర్ కె.రవికాంత్ రెడ్డి, ఈనాడు సీనియర్ పాత్రికేయులు ఎల్.వేణుగోపాల్ నాయుడు, న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ మంజులత కళానిధి, సీనియర్ పాత్రికేయురాలు నిరుపమలు అక్కినేని శృతిలయ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాల కోసం ఎంపిక చేసినట్లు డాక్టర్ మహ్మద్ రఫీ ప్రకటించారు.
శృతిలయ సంస్థ ద్విదశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి నవరస గాయని ఆమని ఆధ్వర్యం లో అక్కినేని సినీ సంగీత విభావరి ఉంటుందని సంస్థ అధ్యక్షురాలు జి.ధనలక్ష్మి తెలిపారు.