గురు పరంపర కు చాలా విశిష్టత వున్నదని, గురువులను శిష్యులు సత్కరించు కోవడం గొప్ప సంప్రదాయం అని సమాచార హక్కు పూర్వ కమీషనర్, సీనియర్ పాత్రికేయులు శ్రీ పి.విజయ్ బాబు అన్నారు. కళలను కళాకారులను పోషించిన దివంగత వై కె నాగేశ్వరారావు ను గురు పూర్ణిమ రోజు స్మరించుకోవడం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. శనివారం లకిడికపుల్ సెంట్ హోటల్ లో కనకదుర్గ నృత్య విభావరి నాట్యగురు, తెలుగు యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు నిర్మల ప్రభాకర్ ఆధ్వర్యం లో గురు పూజోత్సవం వైభవంగా జరిగింది. తొలుత యువకళావాహిని వ్యవస్థాపకులు వై కె నాగేశ్వరరావు ను స్మరించుకుని, నాట్యగురు నిర్మల ప్రభాకర్ ను వారి శిష్యులు కలసి ఘనంగా సత్కరించి గురు వందనం సమర్పించారు.
ముఖ్యఅతిధిగా విచ్చేసిన పి.విజయబాబు మాట్లాడుతూ వై కె నాగేశ్వరరావు సాంస్కృతిక రంగానికి విశేష సేవలు అందించారని, వారి వ్యక్తిత్వం విలక్షణం అని గుర్తు చేసుకున్నారు. సభాధ్యక్షత వహించిన తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ భట్టు రమేష్ మాట్లాడుతూ కళా హృదయం, మానవత్వం వున్న వై.కె.నాగేశ్వరరావు ను ఒక నాట్య గురువు నిర్మల గురువుగా భావించి వందనం చేయడం గొప్ప స్ఫూర్తిని ఇస్తున్నదని అభినందించారు. సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ కళా సారధిగా, కళాకారుడిగా అందరి హృదయాల్లో చిరంజీవిగా వైకె నాగేశ్వరరావు నిలిచిపోయారని, ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ఇంకా ఈ వేడుకలో నాట్యగురు డాక్టర్ భాగవతుల సేతురాం, జివిఆర్ ఆరాధన అధ్యక్షులు జి.వెంకటరెడ్డి, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీ నారాయణ, సామాజికవేత్తలు వైఎస్ఆర్ మూర్తి, కుసుమ భోగరాజు పాల్గొన్నారు. భాగి శివశంకర శాస్త్రి, నిర్మల ప్రభాకర్ పర్యవేక్షించారు.