(By ఎం.డి అబ్దుల్)
(చిత్రం : అనకాపల్లి, విడుదల : 2 అక్టోబర్ 2026, రేటింగ్: 3.5/5, నటీనటులు : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ, మహబూబ్ భాషా, సంగీత క్రిష్, వడ్లమాని శ్రీనివాస్, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్ తదితరులు. సంగీతం: దేవ్ జండ్, ఎడిటర్: అత్తలూరి శ్రీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సెట్రామరాజు మల్లెల, సంభాషణలు: ఉదయ్ భాగవతుల, ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి, నృత్యాలు: శేఖర్ వీజే – యష్ మాస్టర్ – జిత్తు మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్: సూర్య కొయ్య, సాహిత్యం: అనంత శ్రీరామ్ – కెకె – గణేష్ సలాది – రాంబాబు గోశాల – తేజ గొర్లె, సినిమాటోగ్రాఫర్: కటివరపు వంశీ కృష్ణ, కొరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్, బ్యానర్: నక్కిన నరేటివ్స్, భవ్యశ్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: కాండ్రేగుల నాయుడు – త్రినాథ రావు నక్కిన, సహ నిర్మాత: కాండ్రేగుల కుమార్ రాజా, కథ – స్క్రీన్ ప్లే: త్రినాథ రావు నక్కిన, దర్శకత్వం: ఖగేష్ తమ్మినేని)
టాలీవుడ్లో ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో ‘అనకాపల్లి’ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించిందింది. విక్రమ్ సహిదేవ్ గుర్తు ఉన్నారా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాలో కీలక పాత్రలో నటించారు. మరికొన్ని సినిమాలు కూడా చేశారు. కొంత విరామం తర్వాత విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా ‘అనకాపల్లి’. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడే విక్రమ్ సాహిదేవ్. ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా.. ఓ కీలక పాత్రలో త్రినాథరావు నక్కిన నటించారు. వినోదాత్మక చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు త్రినాథ రావు నక్కిన నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కమర్షియల్ దర్శకుడు నక్కిన త్రినాథరావు కథను అందించడంతో సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఒక ఆశాజనకమైన, భావోద్వేగభరితమైన .. తీవ్రమైన గ్రామీణ డ్రామాగా భారీ అంచనాలతో ఈ శుక్రవారం (2 అక్టోబర్ 2026) థియేటర్లలో విడుదలైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రా అండ్ రస్టిక్ లవ్, రివేంజ్ డ్రామా ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించింది? గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ లవ్ స్టోరీ హీరో విక్రమ్ సహిదేవ్ కు ఎలాంటి పేరును తెచ్చిపెట్టింది? అనేది తెలుసుకుందాం…
కథ : అనకాపల్లి రూరల్ నేపథ్యంలో సాగే రస్టిక్ యాక్షన్ .. రొమాంటిక్ డ్రామా ఇది. అనకాపల్లికి చెందిన సూర్య (విక్రమ్ సాహిదేవ్) అనే యువకుడు.. సుయోధన (బుల్లెట్టు -తారక్ పొన్నప్ప) తన గుండా రాజ్యాన్ని కొనసాగిస్తుంటాడు. క్రూరమైన గ్యాంగ్‌స్టర్ నియంత్రించే క్రైమ్ సిండికేట్‌లోకి సూర్య ఎలా లాగబడతాడో ఈ కథ వివరిస్తుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సూర్య ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కలలు కంటాడు, కానీ పరిస్థితులు .. విధేయత అతన్ని అధికారం, నేరాల ప్రపంచంలోకి నెట్టివేస్తాయి. క్రైమ్ సిండికేట్‌లో అతని ప్రయాణం తీవ్రంగా, వాస్తవికంగా, యాక్షన్.. భావోద్వేగ సంఘర్షణలతో నిండి ఉంటుంది. సంధ్యా వశిష్ట పోషించిన ప్రేమ పాత్ర అతని జీవితంలోకి ప్రవేశించినప్పుడు, అంతా మారిపోతుంది. కథానాయికతో సూర్య సంబంధం అతని కఠినమైన జీవితానికి మృదుత్వాన్ని తెస్తుంది, కానీ అధికారం, విధేయత, అతని వ్యక్తిగత కలల మధ్య తీవ్రమైన సంఘర్షణను కూడా సృష్టిస్తుంది. అధికారం .. తన బాస్ పట్ల విధేయత కోసం అతను నేర ప్రపంచంలో కొనసాగాలా, లేక ప్రేమను.. సాధారణ జీవితం అనే తన కలను ఎంచుకోవాలా? ఈ అంతర్గత.. బాహ్య పోరాటాన్ని అతను ఎలా ఎదుర్కొంటాడు ? అతను దేనిని ఎంచుకుంటాడు? సరదాగా ఉండే యువకుడు సూర్య జీవితంలో ప్రేమ ఎలా ప్రవేశించింది? ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? సొంత అన్నలా భావించే బుల్లెట్‌తో సూర్యకి ఎక్కడ చెడింది? ఇందులో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ మెంట్ ఏంటి? సూర్య విషయంలో వాళ్ల అమ్మానాన్న ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు అమృత (సంధ్యా వశిష్ట) ఆ బుల్లెట్‌ని ఎందుకు ఇష్టపడింది? సూర్య ప్రేమ కథ ఎలా ముగిసింది? ఈ ప్రయాణంలో తల్లి జయంతి (ఇంద్రజ), తండ్రి, ఇతర పాత్రల ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? ఇలా బుల్లెట్టుకు అత్యంత నమ్మకమైన అనుచరుడిగా ఉన్న సూరి ఎదురు తిరుగుతాడు? అనకాపల్లిలో బుల్లెట్టు గుండాయిజం ఎలా సాగింది? బుల్లెట్టును ఏ పరిస్థితుల్లో చూసి ముఖ్య అనుచరుడిగా మారాడు? నిజాయితీ పరులైన తల్లిదండ్రులను వదులుకొని సూరి మాఫియా గ్యాంగ్‌లో ఎలా భాగమయ్యాడు? మొదటి చూపులోనే ప్రేమించిన అమ్ములుతో లవ్ ట్రాక్ ఎలా కొనసాగించాడు? బుల్లెట్టు, సూరికి మధ్య విభేదాలకు కారణం ఏమిటి? బుల్లెట్టుకు సూరిని విడగొట్టడానికి ఎమ్మెల్యే ఎలాంటి కుట్రలు పన్నాడు? అమ్ములు ప్రేమ కోసం సూరి ఎలాంటి త్యాగం చేశాడు? అనేదే ఈ చిత్ర ప్రధాన కథ.
విశ్లేషణ: ఈ చిత్రంలో మాస్ ప్రేక్షకులకు నచ్చే యాక్షన్, యువతను ఆకట్టుకునే లవ్ ట్రాక్, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే ఎమోషనల్ సీన్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయి. ఇవన్నీ వయలెంట్ యాక్షన్ అండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచే దర్శకుడు కథలోని తీవ్రతను, గ్రామీణ నేపథ్యాన్ని చక్కగా పరిచయం చేశారు. స్థానికత, భావోద్వేగాలు, సహజమైన పాత్రలతో అనకాపల్లి ప్రాంతం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ”అనకాపల్లి – ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే? ఎదుటోడికి మనం అంటే భయం ఉండాలి. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి. అదీ తెలిసినోడికి ఓబీ రుచి చూపించాలి. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి. మనకు కావాల్సింది దక్కించుకోవాలి” అంటూ హీరో విక్రమ్ సహిదేవ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. త్రినాథరావుకు ఒక పిట్టకథను తారక్ పొన్నప్ప చెబుతున్నట్లుగా సాగుతుంది. కథ చెబుతా, కథ చెబుతా అంటూ ఓ పాట రూపంలో ‘అనకాపల్లి’ స్టోరీని చెబుతున్న తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంది. హీరోగా విక్రమ్ సహిదేవ్ లుక్, బాడీ లాంగ్వేజ్, మేకోవర్ చాలా రగ్గడ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రేమికుడిగా, ఊరమాస్ అవతార్‌లో శత్రువులపై విరుచుకుపడే యువకుడిగా విక్రమ్ చూపించిన ఎనర్జీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒకవైపు చిలిపి ప్రేమకథ, పల్లెటూరి వాతావరణం కనిపిస్తూనే, మరోవైపు కౌరవ నీతి, చీకటి-వెలుగుల పోరాటం అంటూ సాగే వైలెంట్ డ్రామా సినిమా గ్రాఫ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్ళింది. త్రినాథరావు నక్కిన, ఇంద్రజ జంట నేచురల్‌గా కనిపించారు. హీరో, హీరోయిన్లు చాలా ఫ్రెష్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఓ మంచి లవ్ స్టోరీతో పాటు.. మాస్, రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంది. అనకాపల్లి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు క్రూరమైన నేర ప్రపంచంలోకి లాగబడతాడు. ప్రేమ అతని జీవితాన్ని మార్చేస్తుండగా, అతను అధికారం, విధేయత, తాను నిజంగా కోరుకునే భవిష్యత్తు మధ్య ఒకదాన్ని ఎంచుకోవలసి వస్తుంది. ఈ విధంగా సాగే కథలో ఇంటర్వెల్ వద్ద వచ్చే ఊహించని ట్విస్ట్ ని చిత్రానికి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అలాగే క్లైమాక్స్ ఎమోషన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. విక్రమ్ సాహిదేవ్ నటన, హీరోయిన్ సంధ్యా వశిష్ట అప్పియరెన్స్ అందర్నీ కట్టిపడేశాయి. విలన్‌గా నటించిన తారక్ పొన్నప్ప స్క్రీన్ మీద భయపెట్టేలా భీకరమైన విలన్ గా మెప్పించారు. సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా ఉంటూ, కథా ప్రపంచాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. దర్శకుడు ఖగేష్ తమ్మినేని అనకాపల్లి గ్రామీణ వాతావరణాన్ని, హీరో కుటుంబ నేపథ్యాన్ని, ప్రేమ కథను చాలా ఆసక్తికరంగా ఆవిష్కరించారు. ప్రేమ సన్నివేశాలు, పాటలు, సరదా క్షణాలు ఆకట్టుకుంటాయి. ఇవి కథను సున్నితంగా ముందుకు నడిపిస్తూనే, రాబోయే చీకటి ప్రపంచం గురించి కూడా సూచనలు ఇస్తాయి. విరామ సమయంలో వచ్చే మలుపు అనూహ్యంగా ఉండి, గట్టి ఉత్సాహాన్ని ఇస్తుంది. ద్వితీయార్థం మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మారుతుంది. తల్లి సెంటిమెంట్ సంభాషణలు, శక్తివంతమైన ఘర్షణలు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఈ చిత్రం ప్రేమ నుండి విధేయత .. సంఘర్షణ వైపు మళ్లుతుంది. ప్రీ-క్లైమాక్స్ గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. భావోద్వేగభరితమైన క్లైమాక్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యం సహజంగా, అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం సినిమా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. రెగ్యులర్ రూరల్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్. బుల్లెట్టు పాత్ర చుట్టు డిజైన్ చేసిన ఎన్విరాన్మెంట్, క్యారెక్టర్స్ కొత్తగా అనిపిస్తాయి. అలాగే సూరి రోల్‌ను మలిచిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. లోకల్ గుండాయిజం, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అంశాలను మేళవించి కథను ఇంట్రెస్టింగ్గా చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. పాత కథలోకి కొత్త ట్విస్టులు, ఎమోషన్స్ జొప్పించిన విధానం ఈ బాగున్నాయి. కొన్ని ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. సెకండాఫ్‌లో రొటీన్ రివేంజ్ డ్రామా కొనసాగినప్పటికీ.. చివర్లో డివోషనల్ ఎలిమెంట్స్‌తో సినిమాను ముగించిన తీరు విశేషంగా ఆకట్టుకొనేలా ఉంటుంది. విలన్ని హీరోయిన్ ప్రేమించే కథలు చాలానే వచ్చినా, ఇటీవల కాలంలో మాత్రం ఇది కొత్తది అని చెప్పొచ్చు. హీరోయిన్ తనకే దక్కాలని హీరోలు ఆరాటపడ్డ రొటీన్ సినిమాలు చూసి విసుగుచెందిన ప్రేక్షకులకు ఈ సినిమా మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. హీరో సూర్య .. కథానాయిక మంచిని కోరుకుంటూ తను ఎక్కడున్నా… ఎవర్ని పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉంటే చాలనుకుంటాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే యాక్షన్, లవ్ స్టోరీ ఇది. అందులో చీకటి సామ్రాజ్యాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆ ఊబిలోకి హీరో వెళ్లడం, ఈ క్రమంలో పేరెంట్స్ మధ్య, ప్రియురాలి మధ్య, తనకు లైఫ్ ఇచ్చిన విలన్ మధ్య ఎలా నలిగిపోయాడు? దాన్నుంచి బయటపడ్డాడా లేదా అనే దానిపై కథ నడుస్తుంది. యాక్షన్ ప్రధానంగా సాగినా, ఇందులో ప్రేమ కథకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి విలన్ని ప్రేమించడం ఇందులో హైలైట్ పాయింట్‌గా చెప్పొచ్చు. కథగా ఇది ఆసక్తికరంగా ఉంది. సినిమా ప్రారంభం ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. హీరోకి సినిమాల పిచ్చి.. విలన్‌కి దగ్గరగా చేయడం, తాను కూడా విలన్లా మారిపోవడం, ఆ తర్వాత ప్రేమలో పడటం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. లవ్ ట్రాక్ కొంత రొటీన్‌గానే ఉన్నా, దాన్ని తెరపై చూపించిన తీరు బాగుంది. ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేసే సమయంలో ఆమె విలన్‌కి దగ్గరయ్యే ట్విస్ట్ షాకిస్తుంది. పేరెంట్స్ కి సంబంధించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. హృదయాన్ని కదిలిస్తాయి. దర్శకుడు ఖగేష్ ఎంచుకున్న నేపథ్యం చాలా సహజంగా ఉంటుంది. కత్తి పట్టిన వాడు కత్తిపోటుకే బలి అవుతాడనే పాయింట్‌తో పాటు, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు పడే వేదన, ప్రేమకు-ఆకర్షణకు మధ్య తేడాను ఈ కథ ద్వారా చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. బుల్లెట్ హంగామా, సూర్య గ్యాంగ్‌లో చేరడం, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ వంటి సన్నివేశాలతో సినిమా సాదాసీదాగా అనిపించినా, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. పూర్తిగా ఎమోషనల్ జర్నీగా , రివేంజ్ డ్రామాగా మారుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. సినిమా ముగింపు ప్రేమకు సరైన నిర్వచనంలా అనిపిస్తుంది.
నటీ నటుల పనితీరు : ఈ చిత్రానికి అతిపెద్ద బలం నిస్సందేహంగా హీరో విక్రమ్ సాహిదేవ్ అని చెప్పొచ్చు. అతని నటన ఈ ‘అనకాపల్లి’కి ప్రాణంగా నిలిచింది. యువ హీరోగా పరిచయమైన విక్రమ్ సహిదేవ్ సూరి పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా.. ప్రతీ సన్నివేశంలో టాలెంట్‌ను ప్రదర్శించారు. సన్నివేశాలకు అనుగుణంగా ఎమోషన్స్, రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను చక్కగా పలికించాడు. సినిమా భారన్నంతా తన భుజాలపై మోశాడనే చెప్పాలి. పరిణితి చెందిన నటనతో విక్రమ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అనకాపల్లికి చెందిన యువకుడిలా అచ్చం అలాగే కనిపిస్తాడు, అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలలో అతను ఎనర్జిటిక్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అదే సమయంలో ప్రేమ సన్నివేశాలు, తల్లి పట్ల ఎమోషనల్ సెంటిమెంట్ సన్నివేశాలలో తన ప్రతిభను చాటుతాడు. అంతే కాదు.. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా తన ప్రయాణాన్ని సాగిస్తాడు. సూర్య పాత్రలో విక్రమ్ సహిదేవ్ నటుడిగా ప్రతీ ఫ్రేమ్ లోనూ మెప్పించాడు. చాలా బాగా మెచ్యూర్డ్ గా చేశాడు. కుర్రాడిగా, లవర్‌గా, గ్యాంగ్ స్టర్‌గా, ఇన్నోసెంట్ కొడుకుగా ఇలా విభిన్నమైన ఎమోషన్స్ ని, భావోద్వేగాలను పలికించాడు. యాక్షన్‌తోనూ అదరగొట్టాడు. ఎక్కడా ఓవర్ యాక్షన్‌కి వెళ్లకుండా, ఇమేజ్, ఎలివేషన్ లు అనే దానికి వెళ్లకుండా చాలా సెటిల్డ్ గా చేసి అందరి హృదయాలను దోచుకున్నాడు. నటుడిగా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు. అతని నటనే సినిమాకి మెయిన్ బలం. ఇక ‘పుష్ప 2’ తర్వాత బుల్లెట్టు పాత్రలో తారక్ పొన్నప్ప మరోసారి చెలరేగిపోయాడు. ప్రతినాయక పాత్రలో రెచ్చిపోయి, భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా విశ్వరూపం కనబరిచాడు. అతను భయంకరంగా, స్టైలిష్‌గా కనిపించడంతో హీరో-విలన్ సంఘర్షణ చాలా ఆసక్తికరంగా మారింది. హీరో క్యారెక్టర్ తో పోటీపడుతూ మంచి పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొన్నాడు. విక్రమ్, తారక్ ఇద్దరు పోటాపోటిగా నటించారని చెప్పొచ్చు. కథానాయికగా హీరోయిన్ సంధ్యా వశిష్ట చాలా ఆకర్షణీయంగా ఉంది. గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోవడమే కాకుండా కీలక సన్నివేశాల్లో తన ప్రతిభను చాటుకుంది. విక్రమ్‌తో ఆమె ప్రేమ, కెమిస్ట్రీ సన్నివేశాలు బాగా పండి, సినిమాకు ఒక అందమైన రొమాంటిక్ టచ్ ని ఇచ్చాయి. తల్లి పాత్రలలో ఇంద్రజ, సంగీత కృష్ణ అద్భుతంగా నటించారు. వారి భావోద్వేగ సంభాషణలకు థియేటర్లలో విజిల్స్ పడతాయి. కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, మహబూబ్ బాషా, వడ్లమణి శ్రీనివాస్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వారి నటన సినిమాకు ఒక పెద్ద ఆధారంలా నిలిచింది. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్. అత్యంత భావోద్వేగమై పాత్రను ఫీల్‌గుడ్ ఎమోషన్స్‌తో పండించారు. తనలో మంచి నటుడు ఉన్నాడనే సంకేతాలను ఇండస్ట్రీకి ఇచ్చారు. ఇంద్రజ, శ్రీనివాస్ వడ్లమాని గుర్తుండిపోయే పాత్రలు చేశారు. నాయుడుగా నిర్మాత కాండ్రేగుల నాయుడు ఈ సినిమాలో మంచి విలనిజం చూపించడమే కాకుండా సహజంగా యాక్టింగ్ చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ముందుగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవి ఈ సినిమాకు బలంగా కనిపిస్తాయి. అనకాపల్లి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా కెమెరా పనితనం ఉంది. దేవ్‌జాంద్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు, ఎమోషన్స్‌కు ప్రాణం పోసింది. అలాగే విజువల్స్, కలర్ గ్రేడింగ్ సినిమా రా అండ్ రస్టిక్ టోన్‌కు పర్ఫెక్ట్గా సరిపోయాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇవి సినిమా మూడ్‌ను మరింత ఎలివేట్ చేశాయి. కటివరపు వంశీ కృష్ణ చిత్రీకరించిన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లు సినిమా మరింత బలంగా మారాయి. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. గొప్ప నిర్మాణ విలువలతో సినిమా ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంటుంది. త్రినాథరావు, కాండ్రేగుల నాయుడు, కాండ్రేగుల కుమార్ రాజా అనుసరించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం చాలా బాగుంది. రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాలను మరింత ఉన్నతంగా నిలబెట్టింది. సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని చక్కగా పట్టుకుంది. ఎడిటింగ్ పదునుగా ఉంది. నేటివిటీకి తగినట్లుగా సాగే రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టాయి. కథ కమర్షియల్‌గా ఉన్నా .. దాన్ని తీసిన విధానం బాగుంది. దర్శకుడు బాగా తెరకెక్కించాడు. ఫీల్, డ్రామా, యాక్షన్, ఎమోషన్స్ బాగున్నాయి. కొంత రొటీన్ గా ఉన్నా, సరికొత్త యాక్షన్ లవ్ స్టోరీగా ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో బెటర్‌గా నిలుస్తుంది. మొత్తంమీద, ప్రేమ, భావోద్వేగం.. యాక్షన్‌తో కూడిన ‘అనకాపల్లి’ చిత్రం ప్రేమకు సరైన నిర్వచనంలా నిలిచింది.
