చిత్రం : ‘పిఠాపురంలో అలా మొదలైంది’
విడుదల : సెప్టెంబర్ 18, 2026
నటీనటులు : డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు.
నిర్మాణం : మహేష్ చంద్ర సినిమా టీమ్ – ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణం
నిర్మాతలు : దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య)
దర్శకత్వం : మహేష్ చంద్ర
రేటింగ్: 3/5
దర్శకుడు చంద్ర మహేశ్ తన పేరును మహేశ్ చంద్రగా మార్చుకుని కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తీసిన చిత్రం ‘పిఠాపురంలో అలా మొదలైంది’. గతంలో ‘ప్రేయసి రావే’, ‘చెప్పాలని ఉంది’, ‘ఆలస్యం అమృతం’ వంటి సినిమాలను రూపొందించిన చంద్రమహేశ్ తన పేరును మహేశ్ చంద్రగా మార్చుకుని తీసిన చిత్రం ఇది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా కీలక పాత్రలు పోషించారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్స్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మించారు. ఈ శుక్రవారం ( సెప్టెంబర్ 18, 2026) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో ఏముంది? మహేశ్ చంద్ర ఈ సినిమాతో ఏం చెప్పారు? మహేష్ చంద్ర చాలా యేళ్ల తర్వాత డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసిందా లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!
కథ : అనగనగా పిఠాపురంలోని ఓ గ్రామం. ఆ గ్రామ ప్రెసిడెంట్ వీర రాఘవ (రాజేంద్ర ప్రసాద్), అక్కడ బాగా డబ్బున్న వ్యక్తి బంగారయ్య (పృథ్వీ), స్కూల్ టీచర్ విశ్వనాథ్ (కేదార్ శంకర్) మంచిmమిత్రులు. వీర రాఘవ కూతురు అంజని (ప్రత్యూష), విశ్వనాథం బిడ్డ కీర్తన (శ్రీలు), బంగారయ్య కూతురు గీత (రిహాన) వీళ్లు ముగ్గురు కూడా తండ్రి మాదిరే మంచి ఫ్రెండ్స్. ఇందులో వీరరాఘవ తన కూతురుతో స్నేహంగా మెలుగుతుంటాడు. బంగారయ్య తన కూతురుకు ఇష్టమొచ్చినంత డబ్బు ఇస్తాడు. దాంతో కూతురు ఏమి చేసినా పట్టించుకోని నైజం. ఇక విశ్వనాథ్ తన కూతురు బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకున్నా.. వందకు వంద ఎందుకు రాలేదని కూతురును అదో రకంగా తిట్టే టైపు. ఈ ముగ్గురు స్నేహితురాళ్లు స్కూల్ అయ్యాకా.. పై చదువుల కోసం ఓ కళాశాలలో జాయిన్ అవుతారు. అక్కడ వీళ్లు ప్రేమలో పడతారు. ఈ క్రమంలో బంగారయ్య కూతురు గీత ఓ అబ్బాయితో లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. విశ్వనాథం కూతురు కీర్తన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన కూతురు చచ్చిపోయిందని చెబుతాడు. ఈ క్రమంలో గత, విశ్వనాథం విషయంలో జరిగిన ఘటనలు చూసిన అంజని తను ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలా ? చెబితే ఏమనుకుంటారు. వాళ్లలాగే తన పరిస్థితి కూడా అలాగే అవుతుందా.. ఇక ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న గీత, కీర్తనల జీవితం ఏమైంది ? కాలేజీలో చదువకునే వయసులో అమ్మాయిలు ప్రేమలో పడితే వారి జీవితం ఎలా మారుతుంది. చదువుకునే వయసులో తల్లిదండ్రుల మాట వినకపోతే ఏం జరుగుతుంది? వీరి జీవితాలు ఓ కొలిక్కి వచ్చాయా లేదా? పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయినేదే ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమా కథ.
విశ్లేషణ: తెలియని వయసులో, చదువుకునే రోజుల్లో ప్రేమ పేరుతో తప్పుడు దారులు పట్టే కొందరి అమ్మాయిల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో అలా మొదలైంది’. గతంలో ప్రేయసి రావే, చెప్పాలని ఉంది, ఆలస్యం అమృతం సినిమాలతో సెన్సిటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న చంద్ర మహేష్ ఎన్నో ఏళ్ల తర్వాత మహేష్ చంద్రగా పేరు తిరగేసి ‘పిఠాపురంలో అలా మొదలైంది’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం సమాజంలో కనిపెంచిన తల్లిదండ్రులను కాదని చదువుకునే వయసులో ప్రేమ పేరుతో తమకు నచ్చినవారిని పెళ్లి చేసుకోవడం. అంతా సవ్యంగా సాగితే ఓకే. కానీ ఏదైనా తేడా కొడితే వారిని పట్టించుకునే వారు ఉండరు. ఇలా రెంటికి చెడ్డ రేవడిలా మారుతున్న ఆడపిల్లల బతుకులు. తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉన్నా.. ఒక్కోసారి పిల్లలు తప్పుదారి పట్టడం దీని వల్ల కుటుంబంలో మానసిక అశాంతితో కుమిలి పోవడం వంటి అంశాలు కామన్ ఆడియన్స్‌ను కదిలించేలా తెరకెక్కించాడు మహేష్ చంద్ర. మొత్తంగా ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలి. చదువుకునే వయసులో చదువుకోవాలి కానీ.. ప్రేమించ కూడదు. ప్రేమించడం తప్పు కాదు కానీ.. చిన్నప్పటి నుంచి కనీ పెంచిన తల్లిదండ్రులను కాదని కాబోయే వాడి కోసం పేరేంట్స్ వద్దునుకోవడం వంటి అంశాలు ఇప్పుడున్న కొంత మంది తల్లిదండ్రుల పరిస్థితికి అద్ధం పడుతుంది. ఓ విలేజ్ లో సాగే చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇది. బ్రహ్మానందం వాయిస్ ఓవర్‌తో రాజేంద్రప్రసాద్, పృథ్వీ, కేదార్ శంకర్ పాత్రలు వారి కుటుంబ నేపథ్యాల గురించి పరిచయం చేశారు. ఫస్టాప్ అంతా హీరోయిన్ల స్కూల్ డేస్, తర్వాత కాలేజ్ ప్రేమ, పెళ్లి ఒక అమ్మాయి లేచిపోయే సీన్స్‌తో నింపేశారు. కాలేజ్ పేరుతో విలేజ్ నుంచి టౌన్‌కి వెళ్లిన ముగ్గురు అమ్మాయిల్లో వచ్చిన మార్పును చూపించారు. ఈ మధ్యలో సాగే లవ్ ట్రాక్, ఇతర సన్నివేశాలన్ని రొటీన్‌గానే సాగుతాయి. కీర్తన పెళ్లి, గీత లేచిపోవడంతో విరామం. ఆ తర్వాత అయినా కాస్త కొత్తగా ఏమన్నా చూపిస్తారేమో అని చూస్తే.. అక్కడ కూడా అదే రొటీన్ డ్రామా. పెళ్లి తర్వాత కీర్తన కష్టాలు, లేచిపోయిన తర్వాత బాయ్‌ఫ్రెండ్ ద్వారా గీతకు ఎదురైన సమస్యలు చూపించారు. అవి కాస్త ఎమోషనల్‌గా బాగానే ఉన్నాయి. క్లైమాక్స్‌లో అంజని పెళ్లితో అందరూ ఒక దగ్గరికి చేరినట్లు చూపించారు. క్లైమాక్స్‌లో పెళ్లి తంతు, తండ్రీ కూతుళ్ల మధ్య భావోద్వేగాలు, రైతుల గురించి చర్చించిన సన్నివేశాలు సినిమాలో కాస్త ఊరట కలిగించే అంశాలు. మొత్తంగా లేచిపోయి పెళ్లి చేసుకున్న స్నేహితులు పడే కష్టాలు.. చివర్లో అంజని పెళ్లితో గీత, కీర్తనలు తల్లిదండ్రులకు దగ్గర కావడం అంశాలతో హ్యాపీ ఎండింగ్ చేశారు. మొత్తంగా కలిసి ఉంటే కలదు సుఖం. పెళ్లి కోసం తల్లిదండ్రులను దూరం చేసుకోకూడదనే అంశాన్ని బలంగా చెప్పే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఆడపిల్లల తల్లిదండ్రులకు కనెక్ట్ అయ్యే కథ. బ్రహ్మానందం వాయిస్ ఓవర్‌తో కథను ప్రారంభించి ప్రస్తుత యేడాది నుంచి ఆరేళ్ల ఫ్లాష్ బ్యాక్‌లో 2021లో కథను నడిపించాడు. డైరెక్టర్ చంద్ర మహేష్ చాలా కాలం తర్వాత ‘మహేష్ చంద్ర’గా పేరు మార్చుకుని ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్, ఫ్యామిలీ ఎమోషన్స్ .. నేటి తరానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్‌ను చెప్పే ప్రయత్నం ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. టీనేజ్ వయసులో పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు తల్లిదండ్రుల పెంపకాన్ని లెక్కచేయకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితం ఎంతలా తల్లకిందులవుతుందో ఇందులో చక్కగా చూపించారు. తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లల భవిష్యత్తు కోసం వారు పడే తపన వంటి భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల కంటతడి పెట్టిస్తాయి.
నటీనటుల పనితీరు : రాజేంద్ర ప్రసాద్ ఊరి ప్రెసిడెంట్ పాత్రలో ఒదిగిపోయారు. తన అనుభవంతో ఊరి ప్రెసిడెంట్‌గా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. క్రమశిక్షణగల తండ్రి పాత్రలో కేదార్ శంకర్ నటన బాగుంది. 30 ఇయర్స్ పృథ్వీ తన మార్క్ నటనతో గొప్పింటి వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీ శైలిలో నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. హీరోయిన్లు రిహానా, శ్రీలు, ప్రత్యూష తమ పరిధి మేరకు గ్లామర్, ఎమోషనల్ సీన్లలో బాగా నటించారు. ముఖ్యంగా గోవా రొమాంటిక్ సాంగ్‌లో విజువల్స్ .. సాంగ్ పిక్చరైజేషన్ చాలా రిచ్‌గా వచ్చాయి. రిహానా గ్లామరస్‌గా కనిస్తూనే ఎమోషన్ సీన్స్‌లో మెప్పించింది. శ్రీలు డీ గ్లామారైజ్ పాత్రలో మెప్పించింది. ప్రత్యూష జస్ట్ ఓకే అనిపిస్తుంది. ముగ్గురు అమ్మాయిల లవర్స్‌గా నటించిన సాయి ప్రణీత్, విరాట్, సన్నీ అఖిల్ లకు అసలు నటించే అవకాశమే రాలేదు. మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే.
సాంకేతిక నిపుణుల పనితీరు.. కెమెరా వర్క్ సినిమాకు ఎసెట్. జి.సి. క్రిష్ సంగీతం ఫర్వాలేదనపించింది. నేపథ్య సంగీతం బావుంది. ఎడిటర్ కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సి ఉంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే కథంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఆ దిశగా దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడు. తెలిసీతెలియని వయసులో ప్రేమ పేరుతో మోసపోయి కష్టాలు పడే అమ్మాయిల గురించి మంచి పాయింట్ చెప్పారు. తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు అని చక్కగా వివరించారు. మొత్తంమీద ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా. నేటి యువతకు, తల్లిదండ్రులకు ఒక మంచి అవగాహన కల్పించే ప్రయత్నం దర్శకుడు విజయవంతంగా చేశారు.
‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ రివ్యూ … క్లీన్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా!
