హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో-252, దానికి సవరణగా తీసుకొచ్చిన జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్తో పాటు మరికొందరు ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు అక్రిడిటేషన్‌కు సంబంధించిన అన్ని సౌకర్యాలను యథావిధిగా కొనసాగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బర్కత్ అలీ ఖాన్ కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రస్తుతం అమలులో ఉన్న కార్డుల గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ, తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.హైకోర్టు తాజా ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఊరట లభించింది. వీరంతా ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావడంతో పాటు, కార్డు ద్వారా లభించే ఇతర రాయితీలను, సౌకర్యాలను యథావిధిగా పొందనున్నారు. మరోవైపు, అక్రిడిటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులు, జారీ చేసిన కార్డులు, తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలతో పాటు వాటికి గల కారణాలను కోర్టు ముందు ఉంచాలని కోరుతూ పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒక అప్లికేషన్ దాఖలు చేశారు. దీన్ని తదుపరి విచారణలో కోర్టు పరిశీలించనుంది.కాగా, హైకోర్టు ఉత్తర్వులను తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఘౌస్ మొహియుద్దీన్ స్వాగతించారు. అయితే ఇది తమకు లభించిన తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, జర్నలిస్టుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు: జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు పెంపు
