* బి.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకులు, ఆలేరు మాజీ జడ్పిపీటీసీ బొట్ల పరమేశ్వర్
ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నాచారంలోని హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు త్వరలోనే సరికొత్త రూపును సంతరించుకోనుండడం..ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో రూ.37.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టడంతో స్థానిక ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమవుతోందని బి.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకులు, ఆలేరు మాజీ జడ్పిపీటీసీ బొట్ల పరమేశ్వర్ అన్నారు. సుందరీకరణకు ఎంతో చొరవ చూపిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ కు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో చెరువు పునరుద్ధరణతో పాటు ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనుండడం సంతోషించతగ్గ విషయమన్నారు. చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, చెరువు చుట్టూ బండ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేందుకు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్లు, పిల్లల ఆట స్థలాలను ఏర్పాటు చేయనుండడం వల్ల ప్రజలు ఎంతో ఆహ్లకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. మహిళలకు, పిల్లలకు చక్కటి వాతావరణం కల్పించే లక్ష్యంతో హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువును సుందరీకరణ చేయనున్నారు. పిల్లలకు ఆట వస్తువులు, పూల మొక్కలు, గార్డెనింగ్ సదుపాయాలు అభివృద్ధి జరగనుందని.. మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకు నేందుకు ప్రత్యేక బతుకమ్మ కుంటతో పాటు విశాలమైన ప్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయనుండడం పట్ల స్థానిక హెచ్.ఎం.టి నగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి కొట్టే శ్రీనివాస రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సుందరీకరణతో సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకంగా బతుకమ్మ కుంట, విశాలమైన ప్రాంగణాన్ని అభివృద్ధి కూడా చేయనున్నారు. పూల తోటలు, గార్డెనింగ్, వీధి దీపాలతో చెరువు పరిసరాలు ఆకర్షణీయంగా మారనున్నాయి. చెరువులోకి కలుషిత జలాలు చేరకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే చెరువులోకి విడుదల చేయడం వలన నీటి నాణ్యత మెరుగుపడి దోమల సమస్య తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమం పూర్తయితే హెచ్ఎంటీ నగర్, నాచారం ప్రాంతాలకు కొత్త అందాలు రావడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందనుంది. చెరువు సుందరీకరణతో స్థానిక ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన విహార కేంద్రం అందుబాటులోకి రానుండడం పట్ల ప్రజల్లో ఆనందం వెల్లి విరయనుందని పరమేశ్వర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
