‘డెకాయిట్‌’ మూవీ రివ్యూ…భిన్నమైన ప్రయత్నం!

'Decoit' Movie Review...A Different Attempt!
Spread the love

హీరో అడవి శేష్‌ సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అనే ఒక ముద్ర ఉంది. ఆయన గత చిత్రాల్లో యాక్షన్‌, దేశభక్తి, క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, విజయాలు సాధించారు. . ఇప్పుడు లవ్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ చిత్రం `డెకాయిట్‌`తో వచ్చాడు. ఇందులో ఆయనకు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. శానిల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. వీరితోపాటు ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌ ఎస్‌ ప్రొడక్షన్స్, సునీల్‌ నారంగ్‌ ప్రొడక్షన్స్ పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్‌ నారంగ్‌ సమర్పకులు. ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 10)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అడివి శేష్‌ మెప్పించాడా? అనేది తెలుసుకుందాం.

కథ : తక్కువ కులానికి చెందిన వ్యక్తి హరి దాస్ (అడివి శేష్). అతను పెద్ద కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హరి  ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. అతను నేరం చేశాడని.. అతనికి శిక్ష పడేలా చేస్తుంది సరస్వతి. అసలు ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటుంది?, ప్రాణంగా ప్రేమించిన హరిని ఆమె ఎందుకు దూరం చేసుకుంటుంది?, ఆమె పై పగ బట్టిన హరి మళ్లీ ఆమె జీవితంలోకి వచ్చి ఏం చేశాడు ?, చివరకు వీరిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ : అడవిశేషు మొదటిసారి ఒక హై ఎమోషనల్‌ లవ్‌ స్టోరీని చేశాడు. కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడిని ప్రధానంగా చూపించారు. అదే సమయంలో ఎక్కువ కులం, తక్కువ కులం మధ్య అంతరాలను టచ్‌ చేశారు. ప్రేమ, ఎమోషన్‌, ప్రేమ కోసం పోరాటం వంటి అంశాలను ప్రతిబింబిస్తూ యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. లవ్‌ స్టోరీస్‌లో ఇదొక కొత్త తరహా కథగా చెప్పొచ్చు. తనని మోసం చేసిన హీరోయిన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి, ఆమె పరిస్థితి చూసి హెల్ప్ చేయాలనుకోవడం కొత్తగా ఉంది. మొదటి భాగంలో మెయిన్‌గా అడవిశేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ మధ్య ప్రేమని చూపించారు. అదే సమయంలో ఆమె చేసిన ద్రోహాన్ని ఆవిష్కరించారు. దీంతో జైల్లో ఉన్న ఆయన తన ప్రేమని, ఆమె చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ కథ సాగుతుంది. ఆ తర్వాత ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం జైలు నుంచి తప్పించుకోవడం వంటివి సీన్లు హైలైట్‌గా సాగుతాయి. ఈ సమయంలో  `కన్నెపెట్టరో కన్నుకొట్టరో` సాంగ్‌ని వాడిన తీరు బాగుంది. ఆయా సీన్లు హోరెత్తిస్తాయి. లవ్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. కొంత రొమాంటిక్‌గా ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే సీన్లు కొంత వాహ్‌ ఫీలింగ్‌ ఇస్తాయి. సెకండాఫ్‌.. దొంగతనం నేపథ్యంలో సాగుతుంది. మృణాల్ పాత్ర మెయిన్‌గా సెకండాఫ్‌లో కథ సాగుతుంది. అదే సినిమాకి బ్యాక్‌ బోన్‌. హీరోయిన్‌ని హీరో కలవడం, ఆమె పడే స్ట్రగుల్స్ ని చూపించారు. ఆమె కోసం, తన కోసం దొంగతనానికి పాల్పడటం,   పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది వెంటపడటం, వీళ్లు తప్పించుకొని పారిపోవడం, ఈ క్రమంలో రేసింగ్‌ ప్రధానంగా సాగుతుంది. ఆ సమయంలోనే ప్రకాష్‌ రాజ్‌, అనురాగ్ కశ్యప్‌, సునీల్‌ వంటి వారి పాత్రలు ఎంట్రీ ఉంటుంది. పోలీసుగా అనురాగ్‌ కశ్యప్‌.. జైలు నుంచి పారిపోయిన హీరోని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు.  హరి  గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వాళ్లు తెలుసుకుంటారు. ఇవి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. మృణాల్‌ గురించి ఓ షాకింగ్‌ విషయం తెలిశాక హీరోలో మార్పు వస్తుంది. ఆ తర్వాత పోరాటమే మారిపోతుంది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ని హార్ట్ టచ్చింగా, హై ఎమోషనల్‌గా తీసుకెళ్లారు. అదే స్థాయిలో ముగింపు పలికారు.

నటీనటులు ఎలా చేశారంటే? : హరిదాస్‌ పాత్రలో అడివి శేష్‌ అదరగొట్టారు. ఆయన పాత్రలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయి. ఒక కొత్త శేష్‌ని చూడొచ్చు. సరస్వతి, అలియాస్‌ జూలియట్‌గా మృణాల్‌ ఠాకూర్‌ ఆకట్టుకుంది.. చాలా చోట్ల శేష్‌ని డామినేట్‌ చేసింది. సెకండాఫ్‌ మెయిన్‌గా ఆమె పాత్ర చుట్టూనే సాగుతుంది. స్ట్రగులింగ్‌ సీన్లలో మెప్పించింది. మల్లీగా కామాక్షి భాస్కర్ల కాసేపు మెరిసినా తన ఇంపాక్ట్ చూపించింది. ఆసుపత్రి హెడ్‌గా ప్రకాష్‌ రాజ్‌ పాత్ర ఫర్వాలేదు. కాకపోతే అంత బలంగా లేదు. పోలీస్‌ ఆఫీసర్‌గా అనురాగ్‌ కశ్యప్‌ పాత్ర ఉన్నంత సేపు ఆకట్టుకుంటుంది. పోలీస్‌గా సునీల్‌ బాగా చేశాడు. మరో పోలీస్‌గా జైన్‌ మేరీ ఖాన్‌ తన ఇంపాక్ట్ చూపించింది. మృణాల్‌ కూతురుగా చేసిన పాప అదరగొట్టింది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో పాత్ర వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతలుగా సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ‘డెకాయిట్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. (రేటింగ్ : 3/5)

Related posts