అబ్బాస్‌ రీఎంట్రీ..

Abbas's reentry..
Spread the love

అప్పట్లో నటుడు అబ్బాస్‌ ఓ ట్రెండ్‌ సెటర్‌. ఆయన హెయిర్‌ స్టయిల్ కూ ప్రత్యేక అభిమానగణం ఉండేది. విశేష గుర్తింపు పొందిన ఈ నటుడు దాదాపు 11 ఏళ్లు నటనకు దూరమయ్యారు. ఇప్పుడు ‘హ్యాపీరాజ్‌’ తో రీఎంట్రీ ఇచ్చారు. ఇంతకాలం ఎక్కడున్నారు? ఏం చేశారు? ‘కాదల్‌ దేశం’ (ప్రేమదేశం)తో తొలి పరిచయంలోనే అబ్బాస్‌కు ఊహించనంత క్రేజ్‌ వచ్చింది. అలా 2007 వరకు వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆ తర్వాత చిత్రాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2008 నుంచి 2014 వరకు ఏడాదికి ఒకట్రెండు ఉండేవి. 2015లో కేవలం ఒక్క సినిమా ‘పచక్కళ్లమ్‌’ (మలయాళం)లో నటించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లారు. అక్కడ ఓ సంస్థలో బిజినెస్‌ అనలిస్ట్‌గా పని చేసి.. ఇటీవల భారత్‌కు తిరిగొచ్చారు. ఆ తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదనకు సినిమాను ఓ మార్గంగా ఎంచుకున్నా. కెరీర్‌ ప్రారంభంలోనే విజయాలు అందుకున్నా. తర్వాత ఫెయిల్యూర్‌నీ చూశా. ఓ సమయంలో అవకాశాలు లేక నిర్మాతను అడగాల్సి వచ్చింది. అలా కొన్నాళ్లకు నా పనిని నేను ఆస్వాదించలేకపోయా. అందుకే సినిమాలకు దూరమయ్యా’’ అని అబ్బాస్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన జీవితానుభవం మేరకు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను మోటివేట్‌ చేస్తూ ఉంటారు. ‘ప్రియా ఓ ప్రియా’, ‘రాజహంస’, ‘రాజా’, ‘అనగనగా ఒక అమ్మాయి’.. ఇలా తెలుగులో హీరోగా, సపోర్టింగ్‌ రోల్స్‌తో అలరించారు. కన్నడ, హిందీలోనూ నటించారు. ఆయన రీఎంట్రీ మూవీ ‘హ్యాపీరాజ్‌’ తెలుగులోనూ ఈ శుక్రవారం విడుదలైంది. ఇందులో జీవీ ప్రకాశ్‌ హీరో. హీరోయిన్‌ తండ్రిగా అబ్బాస్‌ తెరపై సందడి చేశారు.

Related posts