ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ఆదివారం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాల్రెడ్డి, లక్ష్మణ్ రావు, గోటేటి మోహన్ తదితరులు సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ ఇ. జనార్దన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. అబ్దుల్ , ప్రధాన కార్యదర్శిగా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్, భాగవతుల మురళి (శక్తిమాన్, కోశాధికారిగా చదలవాడ భరద్వాజ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసీ మెంబర్స్ గా సీనియర్ జర్నలిస్ట్ గిరిధర్, నరసింహ, సాయిరమేష్, ఆర్.డి.ఎస్ ప్రకాష్, సి.హెచ్. నవీన్, గోరంట్ల రవి, అప్పాజీ, శ్యామ్, జిల్లా సురేష్, చందు రమేష్, టి. కేశవాచారి తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ..”1969లో ఏర్పాటు అయిన ఈ అసోసియేషన్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన చరిత్ర ఉంది. ఇంతటి చరిత్ర కలిగిన అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటి కలను నిజం చేయటానికి ముందుకువచ్చిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు గారికి అసోసియేషన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాం. ఫిలిం క్రిటిక్స్ ను అణగదొక్కాలి అని కొందరు చేసిన ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఈ సందర్బంగా స్వర్గస్తులైన నా శ్రీమతి ఆడెపు దుర్గా మాధవి జ్ఞాపకార్ధం 50 వేలు క్రిటిక్స్ కు విరాళంగా ఇస్తున్నాను అని ప్రకటించారు.
అధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ .. నేను మహానగర్ ఈవినింగ్ ఎడిషన్ లో 500 రూపాయల జీతంతో సినిమా జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించాను. ఆ సమయంలో ప్రముఖ సినిమా పి.ఆర్.ఓ గిరిధర్ గారు పి.ఆర్.ఓగా మరో 500 వేతనం నాకు ఇచ్చారు. ఆ రోజుల్లో గిరిధర్ గారు నన్ను చదలవాడ శ్రీనివాసరావు గారికి పరిచయం చేశారు. ఈ రోజు నేను చదలవాడ గారి కుటుంబ సభ్యుడుగా మారాను. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల అందరినీ చదలవాడ శ్రీనివాసరావు గారు తమ ఇంటి పెద్దకొడుకులు గా భావిస్తున్నారు. ఆ ప్రేమతోనే వారు అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటి కలను నిజం చేసేందుకు ముందుకు వచ్చినందుకు వారికి అసోసియేషన్ అధ్యక్షులుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రోజుల్లో 300 కోట్ల ఆస్తిని సభ్యులకు ఇచ్చేందుకు ముందుకు రావటం శ్రీనివాసరావు గారి పెద్ద మనస్సుకు నిదర్శనం వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. గతంలో సెక్రెటరీగా పనిచేశాను. ఇప్పుడు అధ్యక్షులుగా అవకాశం కల్పించిన సభ్యులు అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ.. నేను కృష్ణా పత్రికలో పని చేస్తున్న సమయం నుండి ఈ క్రిటిక్స్ అసోసియేషన్ అంటే అభిమానం. ఈ అసోసియేషన్ సీనియర్స్ రాసిన ఎన్నో వ్యాసాలు కటింగ్స్ దాచుకున్నాను .వార్తలో ఉద్యోగం వచ్చాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నేను ఈ అసోసియేషన్ నెంబర్ అయ్యాను. గతంలో ఈ అసోసియేషన్ కు నేను రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశాను. ఇప్పుడు కార్యదర్శి గా ఎన్నుకున్నారు. గతంలో కరోనా సమయంలో అసోసియేషన్ తరుపున ఫండ్ రేజ్ చేసి సభ్యులకు ఆర్థిక సహాయం చేశాం. అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కు కృషి చేస్తాను. ఈ అసోసియేషన్ సభ్యులను స్వంత నిధులతో స్వంత ఇల్లు కల్పించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు అన్నారు.
సీనియర్ సభ్యులు బాల్ రెడ్డి మాట్లాడుతూ .. ఎంతో పేదవారు అయిన అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటి కలను నిజం చేసేందుకు ముందుకు వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారి పెద్ద మనస్సుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. ఈ రోజు అసోసియేషన్ కళ కళలాడటానికి చదలవాడ శ్రీనివాసరావు గారి చొరవే అన్నారు. ఇంకా ఈ సమావేశంలో సీనియర్ సభ్యులు లక్ష్మణరావు , మామిడి గిరిధర్, సాయి రమేష్, భాగవతుల మురళి తదితరులు ప్రసంగించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం.డి అబ్దుల్ వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

