* కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన
* గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి
మెగా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘడియలు రానే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 శనివారం రాత్రి అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి తమ జీవితాల్లోకి రావడం పట్ల చిరంజీవి సురేఖ దంపతులు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భాన్ని ‘దైవిక ఆశీర్వాదం’గా మెగాస్టార్ అభివర్ణించారు. కొణిదెల కుటుంబంలో ఈ కొత్త వెలుగులు నిండటం పట్ల తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రస్తుతం తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. చిరంజీవి ‘తాతయ్యగా మాకు ఇది అత్యంత సంతోషకరమైన సమయం. మా కుటుంబంలోకి ఈ చిన్నారులను ఆహ్వానించడం ఒక అద్భుతమైన అనుభూతి. మాపై ప్రేమను కురిపిస్తూ, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని చిరంజీవి అన్నారు. మెగా వారసులు రావడంతో సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్న మెగాస్టార్ , లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తతం మెగా కుటుంబంలో ఈ ఆనందం రెట్టింపు అయ్యింది. కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు మొదలయ్యాయి. రామ్ చరణ్ ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ.. ”మాకు ఒక బాబు, ఒక పాప జన్మించారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది. మా జీవితాల్లో మహిళలే మా గొప్ప బలం. ప్రతి క్షణం మా వెంట నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” తెలియజేశారు. డెలివరీకి ముందు తీసుకున్న ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో చరణ్, ఉపాసన ప్రశాంతంగా ఆనందాన్ని వెదజల్లుతూ కనిపించారు. ఫ్లోయింగ్ గౌన్‌లో ఉపాసన మెరవగా, చరణ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఆ ఫోటోకు పర్శనల్ టచ్ ని జోడిస్తూ వారి బ్లాక్ డాగ్స్ ఇరువైపులా కూర్చొని, కుటుంబంలో ఉన్న స్నేహం, ఐక్యత, ఎదురుచూపులను అందంగా ప్రతిఫలించాయి. కవలల రాకతో మెగా కుటుంబంలో సంబరాలు డబుల్ అయ్యాయి. ఇది రామ్ చరణ్–ఉపాసన జీవితాల్లో ఒక మధురమైన కొత్త అధ్యాయానికి ఆరంభం. అభిమానులు, శ్రేయోభిలాషులు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా ట్విన్స్ పుట్టారనే వార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వారసుడు పుట్టినందుకు చిరంజీవి సైతం చాలా హ్యాపీగా ఉన్నారని అర్థమవుతోంది. ఇంట్లో అందరూ ఆడ పిల్లలే ఉండటంతో లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్లు ఉందని, ఒక్క వారసుడిని కనివ్వమని రామ్ చరణ్ తో చెబుతుంటానని చిరు గతంలో ఓ సినిమా ఈవెంట్ లో అన్నారు. ఆయన కోరుకున్నట్టుగానే ఇప్పుడు మెగా ఫ్యామిలీలోకి వారసుడు వచ్చాడు. రామ్ చరణ్ – ఉపాసనలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023 జూన్ 20న వీరు క్లిన్ కారాకి జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. ఇప్పుడు కవల పిల్లలకు జన్మనిచ్చి తమ కుటుంబాన్ని పెద్దదిగా మార్చుకున్నారు. ట్విన్స్ రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మెగా ఫ్యాన్స్ తమ విషెస్ తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. కవలలు పుట్టిన విషయాన్ని చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలుపగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా మెగాభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దవాఖాన వద్దే సంబురాలు చేసుకున్నారు.. స్వీట్లు పంచి పెట్టారు. మెగా ఇంటికి కవలలు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి, రామ్ చరణ్ ఉపాసన ఫ్యామిలీస్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
