రోషన్, అనశ్వర రాజన్ హీరోహీరోయిన్లుగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఛాంపియన్. ఈ చిత్రం ఈ గురువారం (డిసెంబర్ 25, 2025) విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…
కథ : ఔత్సాహిక ఫుట్బాల్ క్రీడాకారుడు మైఖేల్ (రోషన్). లండన్ కి వెళ్లి అక్కడే తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆడాలని కలలు కంటాడు. మరోవైపు భైరాన్పల్లి అనే గ్రామంలో రజాకార్లు దాడులు చేస్తూ ఉంటారు. వారి దాడులను ఆ గ్రామ ప్రజలు తిప్పి కొడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మైఖేల్ తెలంగాణ ప్రాంతంలోని ఉద్యమాలకు పుట్టినిల్లు భైరాన్పల్లి గ్రామానికి వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఉండాల్సి వస్తోంది. అక్కడ జరిగిన సంఘటనలు మైఖేల్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కన్న మైఖేల్ ఉద్యమకారుడిగా ఎందుకు మారాడు?, చివరకు మైఖేల్ సాధించింది ఏమిటి?, దానికి స్పూర్తిగా నిలిచిన అతని తండ్రి కథ ఏమిటి ?, మొత్తానికి భైరాన్పల్లి గ్రామంలో రజాకార్లు జరిపిన దమనకాండపై ఆ గ్రామస్థులు ఎలా ఎదురుదాడి చేశారు? అనేది కథ.
విశ్లేషణ : సినిమాలో చెప్పాలనుకున్న ఎలిమెంట్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంది. కథనం ఇంకా ఆసక్తికరమైన ప్లోతో ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. రజాకార్లు తెలంగాణ ప్రాంతంలో జరిపిన దమనకాండ తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమాలో కొన్ని చోట్ల కొత్త ఎలిమెంట్స్ ను పెట్టడం బాగుంది. దీనికి తోడు, ఈ సినిమాలో ఫుట్ బాల్ సీక్వెన్స్ లు కూడా ఆకట్టుకుంటాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం.. మరికొన్ని సీన్స్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి కొంతమేర మైనస్ గానే నిలిచాయి. దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… అతను రాసుకున్న సీన్స్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లో నేరేషన్ తో సాగాయి. దర్శకుడు 1948 నేపథ్యంలో కథని రాసుకున్న విధానం ఆకట్టుకుంది. మెయిన్ గా వార్ సన్నివేశాలను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే, పతాక సన్నివేశాల్లోని మలుపులు బాగున్నాయి. ముఖ్యంగా మైఖేల్ కి అతని తండ్రికి మధ్య వచ్చే సీన్ చాలా బాగుంది. సినిమాలో ఎమోషన్ కూడా కనెక్ట్ అవుతుంది. 1948 ప్రాంతంలో భైరాన్పల్లి గ్రామంలో రజాకార్లు జరిపిన దమనకాండపై ఆ గ్రామస్థులు ఎదురుదాడి జరిపారు అనే కోణంలో సాగిన ఈ సినిమా.. ఆ చారిత్రాత్మక విషాద సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించింది. డైలాగ్స్ పరంగా, సన్నివేశాల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చారిత్రాత్మక కథకు అనుగుణంగా పాత్రల తీరును, కథా నేపథ్యాన్ని చూపించిన విధానం కూడా బాగుంది. అలాగే, ఈ సినిమాలో అప్పటి సామాజిక కోణాలతో పాటు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో వచ్చిన ఎమోషన్స్, వార్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. హీరోగా నటించిన రోషన్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తన యాక్షన్ అండ్ లుక్స్ తో మెప్పించాడు. హీరోయిన్ అనశ్వర రాజన్ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మ కూడా బాగా నటించారు. ఇక ప్రత్యేక పాత్రలో కళ్యాణ్ చక్రవర్తి నటన పాత్రకు తగ్గట్టు ఆకట్టుకుంది. విలన్ గా నటించిన సంతోష్ ప్రతాప్, ఇక అర్చన, రచ్చ రవితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. స్వతంత్రానికి పూర్వం చారిత్రాత్మక నేపథ్యంతో పాటు స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ ఎమోషనల్ వార్ డ్రామాలో.. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి చిత్రీకరణ కూడా బాగున్నాయి. రోషన్ లుక్స్ అండ్ యాక్టింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచింది. ఐతే, కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగడం సినిమాకి మైనస్ అయింది.
సాంకేతిక విభాగం : ప్రదీప్ అద్వైతం దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, జి.కె. మోహన్, జెమిని కిరణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది.
(చిత్రం : ఛాంపియన్, విడుదల : డిసెంబర్ 25, 2025, రేటింగ్ :2.75/5, నటీనటులు : రోషన్ మేక, అనస్వర రాజన్, నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన తదితరులు. దర్శకుడు : ప్రదీప్ అద్వైతం, నిర్మాణం : ప్రియాంక దత్, జి.కె. మోహన్, జెమిని కిరణ్, సంగీత దర్శకుడు : మిక్కీ జె. మేయర్, సినిమాటోగ్రాఫర్ : ఆర్ మధీ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు)
