రవీంద్రభారతిలో భాగ్యనగర్ నృత్యోత్సవం

Bhagyanagar Dance Festival in Rabindra Bharati
Spread the love

శ్రీకీర్తి నృత్య అకాడమి ఆధ్వర్యంలో మంగళవారం డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భాగ్యనగర్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ ఆంధ్రనాట్యం గురు డాక్టర్ సజని వల్లభనేని, డ్యాన్స్ ఇండియా సంపాదకులు డాక్టర్ విక్రమ్ కుమార్ తెలిపారు. తొలిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న భాగ్యనగర్ నృత్యోత్సవాల్లో పాల్గొనేందుకు దేశం లోని వివిధ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా ప్రముఖ నాట్య కళాకారులు పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసారని వారు వివరించారు. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలు వెల్లడించారు. ఇటలీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సి, చౌ నృత్య కళాకారిణి ఇలియానా సిటారిస్టిని మహంకాళి మోహన్ జాతీయ స్మారక పురస్కారంతో సత్కరించనున్నారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ దివ్యసేన (భరతనాట్యం), కర్ణాటక కథక్ కళాకారిణి శ్వేత వెంకటేష్ లను మహంకాళి మోహన్ జాతీయ యువ పురస్కారాలు స్వీకరించనున్నారు. మహారాష్ట్ర కళాకారిణి కశ్మీరా త్రివేదిని జాతీయ ఉత్తమ నృత్య సంచాలకులుగా సన్మానించనున్నారు. భాగ్యనగర్ జాతీయ గౌరవ పురస్కారాల కోసం ప్రముఖ నాట్య గురువులు డాక్టర్ వనజా ఉదయ్, డాక్టర్ వేలూరి సుమిత్ర, డాక్టర్ కె. రత్నశ్రీ, డాక్టర్ ఆర్. సుధాకర్, డాక్టర్ విజయ్ పాల్, డాక్టర్ హెచ్. అనితలను ఎంపిక చేశారు. ఈ వేడుకలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి, డాక్టర్ కోట్ల హనుమంతరావు, కె. గీతామూర్తి, డాక్టర్ మహ్మద్ రఫీ, డాక్టర్ కళాకృష్ణ, డాక్టర్ భాగవతుల సేతురామ్, బొప్పన నరసింహారావు అతిధులుగా పాల్గొంటారని నిర్వాహకులు డాక్టర్ సజని వల్లభనేని వివరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులచే ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కళాప్రియులు విచ్చేసి దిగ్విజయం చేయాలని ఆహ్వానిస్తున్నారు.

Related posts