(చిత్రం : సుందరకాండ, రేటింగ్ : 3/5, విడుదల : 27 ఆగస్టు-2025, నటీనటులు: నారా రోహిత్, శ్రీదేవీ విజయ్ కుమార్, వ్రితీ వఘానీ, వీకే నరేష్, వాసుకీ ఆనంద్, సత్య, అభినవ్ గోమటం, సిరిలేళ్ల, వీటీవీ గణేష్, అజయ్, రూపాలక్ష్మీ, సునైనా, రఘుబాబు తదితరులు. దర్శకత్వం: వెంకటేశ్ నిమ్మలపూడి, నిర్మాతలు: సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి, సంగీతం: లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్: ప్రదీష్ ఎం వర్మ, ఎడిటర్: రోహన్ చిల్లాలే, ఆర్ట్: రాజేశ్ పెంటకోట, బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్)
కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలు చేస్తుంటాడు హీరో నారా రోహిత్. తాజాగా ఆయన ‘సుందరకాండ’ పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటించాడు. టాలీవుడ్ లోకి నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో మంచి విజయాలు సాధిస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అంతగా అలరించలేదు. దీనికితోడు ఆయన నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చాయి. కొంత గ్యాప్ తీసుకుని గతేడాది `ప్రతినిధి 2` చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సైతం ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు `సుందరకాండ` అంటూ తన ఏజ్‌కి యాప్ట్ అయ్యే కథతో వచ్చారు. ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇందులో నారా రోహిత్‌కి జోడీగా శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని కథానాయికలుగా నటించారు. ఈ సినిమాని సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహాంకాళి సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా వినాయక చవితి పర్వదినాన బుధవారం (ఆగస్ట్ 27)న విడుదలైంది. `ప్రతినిధి 2`తో రీఎంట్రీ తర్వాత హీరో నారా రోహిత్ నటించిన చిత్రమిది. క్రేజీ లవ్ స్టోరీతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంది? ఎట్టకేలకు నారా రోహిత్ హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందనేది తెలుసుకుందాం…
కథ: నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ.. ముదిరిన బ్రహ్మచారి సిద్దార్థ్ (నారా రోహిత్) పెళ్లి చేసుకోవడానికి కష్టాలు పడుతుంటాడు. పెళ్లి చూపుల్లో కొన్ని కారణాలు చెప్పి అమ్మాయిలను రిజెక్ట్ చేసుకొంటూ వస్తుంటాడు. జీవితంలో అతడికి పెళ్లి పెద్ద సమస్యగా మారినప్పటికీ.. తనకు కావాల్సిన క్వాలిటీస్ విషయంలో రాజీ పడడు. అలాంటి పరిస్థితుల్లో ఐరా (వ్రితి వఘ్నీ)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తనకు కావాల్సిన క్వాలిటీస్ కూడా ఆమెలో ఉండటంతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు. అయితే సిద్దూ పెళ్లికి, ఐరా తల్లి వైష్ణవి (శ్రీదేవీ విజయ్ కుమార్) అడ్డంకిగా మారుతుంది. ఐరాను పెళ్లి చేసుకోవడానికి ఎదురైన సమస్యను అధిగమించి.. వైష్ణవిని ఒప్పించేందుకు సిద్దూ రంగంలోకి దిగుతాడు. కాబోయే భార్యలో సిద్దూ ఎలాంటి క్వాలిటీస్ కోసం వెతుక్కొన్నాడు? సిద్దూ పెళ్లికి ఎదురైన సమస్య ఏమిటి? చిన్నతనంలో స్కూల్‌లో సీనియర్ అమ్మాయితో ప్రేమ ఎలాంటి కష్టాలను తెచ్చిపెట్టింది? ఐరాతో ఎలా ప్రేమలో పడ్డాడు? ఐరాతో పెళ్లికి వైష్ణవి ఎలా సమస్యగా మారింది? వైష్ణవిని ఎందుకు? ఎలా ఒప్పించాల్సి వచ్చింది? వైష్ణవితో సిద్దూ ఉన్న సమస్య ఏమిటి? ఐరాతో సిద్దూ పెళ్లికి వైష్ణవి ఒప్పుకొన్నదా? ఐరాను పెళ్లి చేసుకోవడానికి సిద్దూ ఎలాంటి కష్టాలు పడ్డాడు అనే భావోద్వేగమైన, వినోదభరితంగా సాగిన కథనే సుందరకాండ సినిమా.
విశ్లేషణ: నారా రోహిత్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఒక ఒపీనియన్ క్రియేట్ అయ్యింది. అది తాను చేసిన సినిమాల వల్ల కావచ్చు. కానీ ఆ అభిప్రాయాన్ని బ్రేక్ చేసే చిత్రం `సుందరకాండ` అని చెప్పొచ్చు. ఈ టైటిల్స్ తో ప్రతి జెనరేషన్‌లోనూ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఎప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్పటి కథలతో సినిమాలు రావడంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు కూడా ట్రెండీ స్టోరీతోనే నారా రోహిత్ ఈ సినిమా చేశారు. తన ఏజ్‌పై సెటైరికల్‌గానే ఈ చిత్రం చేయడం విశేషం. ఇందులో తన పెళ్లి కాకపోవడం, దీంతో ఆయన పడే బాధలు, ఇంకోవైపు తన రూల్స్ కారణంగా పెళ్లిళ్లు సెట్ కాకపోవడం ఇందులో హైలైట్ పాయింట్. వాటి చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది. తాను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి కూతురునే ఇప్పుడు ప్రేమించడమే ఇందులో హైలైట్ గా చెప్పొచ్చు. దాని చుట్టూతే అసలు కథ నడుస్తుంది. ఈ కథని ఎలా తీసుకెళ్లారనేది ఇందులో మరో హైలైట్. ఆ విషయంలో దర్శకుడు ఆడియెన్స్ ని కన్విన్స్ చేసిన తీరు, కథనాన్ని తీసుకెళ్లిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్ గా చెప్పొచ్చు. సినిమా ప్రారంభంలో కాస్త రొటీగానే అనిపిస్తుంది. రెగ్యూలర్ సన్నివేశాలతో సాగుతుంది. నారా రోహిత్ పెళ్లి రూల్స్, వాళ్ల నాన్న నరేష్ చేసే ఓవర్ యాక్షన్‌తో చప్పగానే సాగుతుంది. తన చిన్నప్పటి లవ్ ట్రాక్‌ని కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పడంతో కొద్దిగా డల్‌గానే అనిపిస్తుంది. అయితే హీరోయిన్ పాత్ర పరిచయం తర్వాత లవ్ ట్రాక్ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. సత్య పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా ఫన్నీగా మారుతుంది. కాలేజీలో ఓ వైపు హీరోయిన్‌తో హీరో లవ్ ట్రాక్, ఇంకోవైపు సత్య కామెడీ రెండింటిని బ్యాలెన్స్ చేసిన తీరు విశేషంగా అలరిస్తుంది. వెంకటేశ్ నిమ్మలపూడి రాసుకొన్నఈ సినిమాకు హిందీలో విజయవంతమైన లమ్హే, తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ముత్తానా కత్రిక, మలయాళ చిత్రం వెళ్లిముంగ సినిమా కథ చాలా దగ్గరగా ఉంటుంది. ఇక తెలుగులో వచ్చిన వెంకటేష్, మీనాల ‘సుందరకాండ’ సినిమా కథకు అపోజిట్‌గా ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాల స్పూర్తితో ‘సుందరకాండ’ను తెరకెక్కించారా? లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. తెలుగు నేటివిటికి, తాను నమ్ముకొన్న నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కథను, సన్నివేశాలను అల్లుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సత్య, అభినవ్, వీకే నరేష్ లాంటి కమెడియన్ ఆరిస్టులతో కథను నడిపించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడిని సినిమాకు ఎంగేజ్‌చేయడంలో తొలి చిత్ర దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అలాగే సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది ఒక జెన్యూన్ సర్ప్రైజ్ గా వచ్చి అక్కడ నుంచి సెకండాఫ్ మంచి ఎంగేజింగ్ గా సాగింది. ట్విస్ట్ రివీల్ చేసినప్పటికీ ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ ని అలానే ఆద్యంతం మైంటైన్ చేయడం అనేది మంచి విషయం. ఈ సినిమాలో సెటప్ అంతా మంచి ఎంగేజింగ్ గానే ఉన్నప్పటికీ కథ మాత్రం కొంచెం తెలిసినట్టే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం క్రేజీగా రాసుకున్నారు. క్రేజీగానే చూపించారు. అక్కడ హీరో షాక్ అవ్వడంతోపాటు ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. అక్కడి నుంచి సెకండాఫ్ మొత్తం అనేక ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. ఆద్యంతం ఫన్నీగానూ సాగుతుంది. అదే సమయంలో అసలు డ్రామా కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి ప్రేమ విషయాన్ని ఫ్యామిలీకి, అటు వైష్ణవికి, మరోవైపు ఐరాకి, ఫ్రెండ్స్ కి తెలియకుండా మ్యానేజ్ చేయడానికి హీరో, అండ్ వారి బ్యాచ్ పడే బాధలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో నరేష్ చేసే కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. తన ఏజ్‌పై నారా రోహిత్ సెటైర్లు వేయించుకున్న తీరు కూడా నవ్వులు పూయించేలా ఉంది. సెకండాఫ్‌లో సత్య తనదైన కామెడీతో సినిమాని తీసుకెళ్లిపోయారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఓ వైపు ట్విస్ట్ లు, మరోవైపు డ్రామాతో తిప్పితిప్పి, కాస్త ఎమోషనల్‌గా మార్చి, చివరికి సుఖాంతం చేసిన తీరు బాగుంది. అయితే సెకండాఫ్‌లో డ్రామా కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. శ్రీనువైట్ల సినిమాలను తలపిస్తుంది. ఇంకోవైపు ట్విస్ట్ లు కూడా ఓవర్‌గా అనిపిస్తాయి. విషయాన్ని తిప్పి తిప్పి చూపించినట్టుగా, చెప్పే విషయాన్ని తిప్పి తిప్పి చెప్పినట్టుగా ఉంటుంది. ఇంకోవైపు కామెడీలో కూడా కొంత సహజత్వం మిస్ అయ్యింది. అక్కడక్కడ బలవంతపు కామెడీగా అనిపిస్తుంది. చివర్లో ప్రేమ గురించి ఇద్దరు హీరోయిన్లతో నారా రోహిత్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్‌గా మంచి కామెడీతో కూడిన క్లీన్ లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా `సుందరకాండ` నిలుస్తుంది. మొత్తం మొద్ద ఇదొక సున్నితమైన కథాంశం. దర్శకుడు ఈ కథను ఎంచుకోవడమే కత్తి మీద సాము లాంటింది. వెంకటేష్ నటించిన ‘సుందరకాండ’ చిత్రంలో వెంకటేష్‌ను స్టూడెంట్ అపర్ణను ప్రేమిస్తే.. ఈ సినిమాలో లెక్చరర్ స్టూడెంట్‌ను ప్రేమిస్తాడు. ఇలాంటి ఓ టిపికల్ కాన్సెప్ట్‌కు దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి తెరకెక్కించాడు. తొలిభాగం ఎంతో సరదాగా.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోతుంది. ఇంతలోనే ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథ ఓ విచిత్రమైన మలుపు తిరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్ మాత్రం కలుగుతుంది. ఇదే కథలో కీలకమైన ఘట్టం. తొలిభాగంలో నారా రోహిత్‌పై చిత్రీకరించిన పాట, ఫైట్‌లు కథకు కాస్త ఇబ్బందిగా అనిపించాయి. అయితే ఆ తరువాత వెంటనే ఓ మంచి సన్నివేశం, ఓ మంచి సంభాషణతో దర్శకుడు ఆ బోరింగ్ ఎలిమెంట్‌ను కవర్ చేశాడు. ముఖ్యంగా దర్శకుడు సంభాషణలు చక్కగా రాసుకున్నాడు. మంచి వినోద భరితమైన డైలాగ్‌లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అయితే వింటానికి చాలా విచిత్రంగా ఉంటే ఈ కథాంశం మెయిన్ పాయింట్‌ను దర్శకుడు మంచి అనుభవమున్న దర్శకుడిలా డీల్ చేశాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించినా వెంటనే తదుపరి సన్నివేశంలో దర్శకుడ కవర్ చేయడంతో సినిమా ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. కాస్త నీడ వస్తే ఆరిపోయే బట్టలు తడిపితే కోపం వస్తుందో లేదో తెలియజేసే లాజిక్, మా ఇంటికి ఎవరైనా భోజనానికి పిలవాలన్నకున్న కూడా భోజనం పెట్టి పిలుస్తాం అనే తరహాలో సాగే కామెడీ సంభాషణలు.. ఇలాంటివి ఎన్నో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచాయి. ఫస్ట్‌హాఫ్ తరువాత అందరికి తెలిసిపోయిన ఓ విచిత్రమైన కాన్సెప్ట్‌ను దర్శకుడు ఎంతో కన్వీన్సింగ్‌గా తెరకెక్కించాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన తెరకెక్కించిన విధానం దర్శకుడిగా, రచయితగా ఆయన ప్రతిభకు నిదర్శనం. ప్రేమను ఆస్వాదిస్తూ.. దానిపై ఎంతో క్లారిటీ ఉంటే తప్ప.. ప్రేమలో ఉండే గమ్మత్తుని అందులో ఉండే మజిలీని తెరపై ఆవిష్కరించలేం. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి.. ప్రేమ విషయంలో పరిపక్వత చెందినట్టుగానే కథని మలిచారు. ప్రేమలో ఉండే లేయర్స్‌ని ఒక్కొక్కటిగా టచ్ చేస్తూ.. ఇష్టం, ప్రేమ, పెళ్లి, జీవితాన్ని రియాలిటీకి దగ్గరగా చూపించారు. నిజానికి దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ చిన్నదే కానీ.. దాన్ని కన్వెన్సింగ్ చెప్పడమే పెద్ద టాస్క్. ఇంటర్వెల్ ట్విస్ట్‌లో రివీల్ చేసిన పాయింటే.. కథలో కీలకం. ‘తల్లిని ప్రేమించి పిల్లతో పెళ్లి.. ఆ పెళ్లిని ఒప్పించడం కోసం తిరిగి తల్లి దగ్గరకు వెళ్లడం’ అనేది ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ.. ఇదేదో బాగానే ఉంది.. బాగానే బ్యాలెన్స్ చేశాడే అనేట్టుగా చాలా కన్వెన్సింగ్‌గా కథని మలిచాడు దర్శకుడు. కథని మొదలుపెట్టిన తీరు.. ముందుకు తీసుకెళ్లిన విధానం.. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథనాన్ని ఆసక్తికరంగా మార్చేశారు. తాను రాసుకున్న ప్రతి సీన్‌లోనూ వినోదాన్ని జోడించడమే ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. తన కథకి తానే రచయిత కావడంతో.. దర్శకుడు రాసిన మాటలు బాగా పేలాయి. ‘అబద్దం వర్షం లాంటిది.. ఒక్క చినుకుతో ఆగదు’ లాంటి తేలికైన పదాలతోనే బరువైన భావోద్వేగాలను పలికించారు. లవ్, ఎమోషన్, కామెడీ సమపాళ్లలో రంగరించి ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. హీరో నారా రోహిత్ చాలా ఏళ్లుగా సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు. అయితే ఈసారి ప్రయోగాలు చేయకుండా తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ డ్రామాను ఎంచుకొని చేయడం మంచి పరిణామంగా కనిపించింది. డ్యాన్సులు, ఫైట్స్ చేయడానికి కష్టాలు పడినా.. కుదురుగా పెర్ఫార్మ్ చేయడంలోను, ఎమోషన్స్ పలికించడంలో ఎంతగానో మెప్పించాడు. మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఫైనెస్ట్ నటుల్లో నారా రోహిత్ కూడా ఒకరు. ఆ మాట ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పవచ్చు. తన ‘సోలో’ సినిమా నుంచి మొన్న ‘భైరవం’ వరకు చూసుకున్నా ఎలాంటి రోల్ ని అయినా చాలా ఈజ్ గా తాను చేస్తారు. ఇప్పుడు సుందరకాండ లో కూడా ఒక లైట్ క్యారెక్టర్ ని కూడా అంతే ఈజ్ గా మంచి నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా చాలా బాగుంది. సెకండాఫ్ లో తనపై ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సత్య, అభినవ్, నరేష్ సహకారంతో సినిమా భారన్నంతా తన భుజాల మీద మోసి.. విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడని చెప్పొచ్చు. సిద్ధార్థ్ పాత్రలో అతడు చూపిన నటన భేషుగ్గా ఉంది. తన ఏజ్ కి యాప్ట్ అయిన పాత్ర కావడంతో అంతే బాగా చేశాడు. నటుడిగానూ ఆయనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆయన ప్రేమని వ్యక్తం చేసే విషయంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఇక శ్రీదేవీ విజయ్ కుమార్ ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్. హుందాగా తన పాత్రలో ఒదిగిపోయింది. చిన్నప్పటి లవర్ వైష్ణవిగా శ్రీదేవి సైతం బాగా చేసింది. చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించిన శ్రీదేవి విజయకుమార్ రోల్ కూడా సినిమాలో బాగుంది. కథలో తన రోల్ చూపించే ఇంపాక్ట్ బాగుంది. అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా ఈ పాత్రని బాగా క్యారీ చేసి రక్తి కట్టించారు. ఐరా అమ్మగా ఆమె నటన అదిరిపోయింది. హుందాగా అనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు కూడా అందంలో హీరోయిన్‌ని డామినేట్ చేసింది. ఐరాగా నూతన నటి వృతి వాఘాని చాలా అందంగా ఉంది. చాలా బాగా నటించింది. ఆమె పాత్రకి మంచి ప్రయారిటీ దక్కింది. సినిమాకు కావాల్సిన గ్లామర్ సరుకును అందించడం మాత్రమే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మెప్పించింది. ఐరా గా ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం కానీ అందులో ఆమె నటించిన తీరు బాగా ఇంప్రెస్ చేస్తాయి. తన కాన్ఫిడెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమెలో పరిపక్వత కనిపిస్తుంది. డెఫినెట్ గా ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంది. హీరో అక్కగా వాసుకీ కూడా సహజంగా నటించి ఆకట్టుకుంది. ఇంకోవైపు హీరో ఫ్రెండ్ సత్య లెక్చరర్‌గా అదరగొట్టాడు. ఆద్యంతం నవ్వులు పూయించాడు. ఆయనకు జంటగా నటించిన సునైనా సైతం బాగానే నవ్వించింది. వీరి కామెడీనే సినిమాకి హైలైట్. నారా రోహిత్ తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ రెచ్చిపోయాడు. తనవంతు నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. కొరియన్ పిచ్చి ఉన్న భార్యగా రూపాలక్ష్మీ కామెడీని పండించింది. హీరో మరో ఫ్రెండ్‌గా అభినవ్ గోమటం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పాత్ర కమెడియన్ సత్య గురించి. ఆయన కామెడీ టైమింగ్.. ఆయన నటన సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఫుల్‌లెంగ్త్ వినోదాన్ని అందించాడు. అజయ్ కాసేపు మెరిశారు. వీటీవీ గణేష్ సీరియస్ రోల్ చేశారు. ఆయన్నుంచి మనం కామెడీ ఆశించలేం. సునైనా, సత్య కాంబినేషన్ అదిరింది. ఇతర నటీనటులంతా ఈ సినిమా విజయానికి కావాల్సిన బలాన్ని అందించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రదీప్ వర్మ వైజాగ్ అందాలను అద్బుతంగా కెమెరాలో బంధించారు. సన్నివేశాలను అందంగా చూపించడానికి ఎంచుకొన్న కలర్ ప్యాలెట్ బాగుంది. కంటికి ఇంపుగా ప్రతీ ఫ్రేమ్‌ను చక్కగా రూపొందించారు. పాటలు అంత గొప్పగా లేకపోయినా.. లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పలు సన్నివేశాలను మ్యూజిక్‌తో ఫీల్ గుడ్‌గా మార్చారు. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఎంచుకున్న పాయింట్ బాగుంది. కొత్తగా, చాలా యూనిక్‌గా ఉంది. దాని చుట్టూ అల్లుకున్న ఫన్, డ్రామా ఆకట్టుకునేలా ఉంది. సంక్లిష్టమైన పాయింట్‌ని డీల్ చేసిన తీరు వాహ్.. అనిపిస్తుంది. ఈ సినిమా రాజేశ్ పెంటకోట చేసిన ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. రోహన్ తన కత్తెరకు ఇంకా పదును పెట్టాల్సింది. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకి తగ్గట్టుగా సెటప్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది. ‘సుందరకాండ’ గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా తెలిసిన రెగ్యులర్, రొటీన్ ఫ్యామిలీ డ్రామా. కామెడీ, లవ్ అంశాలను మేళవించి రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించే విధంగా తొలి చిత్ర దర్శకుడు వెంకటేష్ ఈ చిత్రాన్ని మలిచాడు. ఓవరాల్‌గా సరదాగా ఫ్యామిలీతో చూడగలిగే మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో సిద్దూ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇతర పాత్రలను పరిచయం చేయడానికి, కథని విపులంగా చెప్పడానికి దర్శకుడు కాస్త సమయం ఎక్కువగానే తీసుకోవడం.. సినిమాను ఉద్దేశపూర్వకంగా సాగదీశాడా? అనే అనుమానం కలుగుతుంది. కథలో సమస్యను సృష్టించడానికి ఇంటర్వెల్ వరకు సమయం తీసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే స్టోరీలో కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దర్శకుడు వెంకటేష్ అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతీ ఐదు నిమిషాలకు ట్విస్టు, ఓ సమస్యను సృష్టించి దానిని క్లియర్ చేస్తూ కథను ముందుకు నడిపించిన విధానం బాగుంది. అయితే వైష్ణవి, సిద్దూ పాత్రల మధ్య చోటు చేసుకొన్న సమస్య అతి సున్నితమైంది. దానిని చాలా మెచ్యురిటీతో డీల్ చేసిన విధానంతోనే ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తాను తన మొదటి సినిమాకే సాలిడ్ వర్క్ అందించారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా తన బ్యాలన్సుడ్ కథనం సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. పాత్రలు డిజైన్ చేసుకున్న విధానం కానీ వాటిని తీసుకెళ్లిన తీరు, ట్విస్ట్ లు లాంటివి తన విజన్ ని చూపిస్తాయి. ఫ్యూచర్ లో తన నుంచే ఇదే రీతిలో మైంటైన్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుందనిపిస్తుంది. ఓవరాల్‌గా.. సుందరకాండ ఫీల్ గుడ్ మూవీ. బయట చల్లగా వర్షం పడుతుంటే చేతిలో లేత మొక్కజొన్న పొత్తు పెడితే ఎంత ఆస్వాదిస్తూ తింటామో.. ఈ సినిమా కూడా అలా వెళ్లిపోతుంది. ఫ్యామిలీతో వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు… మరి ఎందుకు ఆలస్యం.. ?