సీనియర్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి మూడు రోజులపాటు కేరళ రాజధాని తిరువనంతపురంలో తొలిసారి జరగనున్న జాతీయ సమావేశాల్లో పాల్గొనమంటూ సీనియర్ పాత్రికేయులు మహ్మద్ రఫీకి ఆహ్వానం అందింది. దేశంలోని పలు జర్నలిస్ట్ నేతలతో పాటు కొంతమంది సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన పాత్రికేయులు ఈ సమావేశాల్లో పాల్గొని మేధోమథనం చేయనున్నారు. ముఖ్యంగా 60 దాటిన పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం పింఛన్ ప్రవేశపెట్టేందుకు అవసరమైన విధి విధానాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. కేరళ స్టేట్ గెస్ట్ హౌస్ ఆడిటోరియంలో జరిగే ఈ జాతీయ సమావేశాలను ముఖ్యమంత్రి పినరై విజయన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వంద మంది సీనియర్ పాత్రికేయులను ఈ సమావేశాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. పాత్రికేయులకు సంబంధించిన ప్రత్యేక ఫోటోగ్రఫీ ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారని జాతీయ సమావేశాల కార్యదర్శి కేరళకు చెందిన ఫ్రాంకో లూయిస్ చెప్పినట్లు ఇండియా నౌ తెలుగు టివి ముఖ్య సంపాదకులు డా. మహ్మద్ రఫీ వివరించారు. ఈ సమావేశాల్లో సీనియర్ పాత్రికేయుల జీవితాలకు వెలుగు ఇచ్చే దిశగా చర్చలు జరుగుతాయని, తీర్మానాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకు వచ్చేలా భవిష్యత్ ప్రణాళిక రూపొందించనున్నట్లు డా. మహ్మద్ రఫీ తెలిపారు.
పాత్రికేయుల జాతీయ సమావేశాలకు మహ్మద్ రఫీ
