బిసి రిజర్వేషన్ల సాధనకు వేలాదిగా పాల్గొని విజయవంతం చేస్తాం
ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యార్థి విద్యావంతుల ఐక్యవేదిక
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి విద్యావంతుల జేఏసీ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు దేవరకొండ సైదులు, కిరణ్ కుమార్, సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రిజర్వేషన్ల సాధనకు చివరి అడుగులు వేస్తున్న వేళ తామంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈనెల 5 6 7 తేదీలలో జరగనున్న వివిధ నిరసన కార్యక్రమాల్లో తాము సైతం పాల్గొంటున్నట్లు చెప్పారు. బీసీల స్థితిగతులను అధ్యయనం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఇక్కడి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ఉండడం హర్షనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ ను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న రాములు, కోల జనార్ధన్, డాక్టర్ శివ ముదిరాజ్, మహేష్ గౌడ్, ప్రశాంత్, యాద నాగేశ్వరరావు లతోపాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.