రేపు ఎల్ బి స్టేడియంలో సంగీత నాటక అకాడమీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు

Sangeet Natak Akademi Bhakta Ramdas Jayanti celebrations at LB Stadium tomorrow
Spread the love

తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకు పోతున్నట్లుగానే ఆథ్యాత్మిక తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సుప్రసిద్ధ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డా. అలేఖ్య పుంజాల తెలిపారు. శుక్రవారం కళాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా విశేషాలు వెల్లడించారు. మార్చి 2వ తేదీ హైదరాబాద్ లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరుగుతాయని డా. అలేఖ్య పుంజాల వెల్లడించారు. ప్రతి యేటా తమిళనాడు తిరువయ్యూర్ లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా ఇకపై ప్రతియేటా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు అధికారికంగా జరుగుతాయని ఆమె ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని, 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొంటున్నారని అలేఖ్య పుంజాల వివరించారు. ఈ ఉత్సవాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మిత సభర్వాల్ తదితరులు పాల్గొంటారు. నవరత్న శ్రీరామ కీర్తనల బృంద గాన గోష్టితో ప్రారంభమయ్యే ఉత్సవాలలో ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ డా. యెల్లా వెంకటేశ్వరరావు, పద్మశ్రీ డా. శోభారాజు, కళారత్న పురస్కార గ్రహీతలు హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి, హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ, ప్రేమా రామమూర్తి, కోవెల శాంత, డివి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొంటారని అలేఖ్య పుంజాల వివరించారు. ఎన్నో శ్రీరామ కీర్తనలు రచించి కీర్తించి భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాల్లో పేర్లు నమోదు చేసుకోని వాళ్ళు కూడా నేరుగా పాల్గొనవచ్చని, కళాకారులు అందరికి అవకాశం కల్పించడమే లక్ష్యంగా సంగీత నాటక అకాడమీ కృషి చేస్తున్నదని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో బి. మనోహర్, ఆర్. వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

Leave a Comment