తెలంగాణ ఉద్యమ వీర వనిత చాకలి ఐలమ్మ జీవితం తొలిసారి కూచిపూడి నృత్య రూపకంలో వేదిక పైకి రానున్నది! తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు రవీంద్రభారతిలో ప్రముఖ నాట్య గురువు, కళాతపస్వి, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డా. అలేఖ్య పుంజాల బృందం ప్రదర్శించనున్నారు. ఆధునిక సామాజిక పరిణామానికి, భూపోరాటానికి నాంది పలికిన మహిళ చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని, ఐలమ్మ పాత్రను తానే పోషిస్తున్నట్లు డా. అలేఖ్య పుంజాల తెలిపారు. ఇవాళ అకాల మృతి చెందిన సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఈ నృత్య రూపకాన్ని రచించగా వి. బి.ఎస్.మురళి బృందం సంగీతం అందించారు. తన ఆలోచన అని, తానే నృత్య దర్శకత్వం అందించి ప్రధాన ఐలమ్మ పాత్రను పోషించనున్నట్లు డా. అలేఖ్య పుంజాల చెప్పారు. ఉద్యమ నాయకురాలు చాకలి ఐలమ్మ జయంతి ప్రతియేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఆమె వివరించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ప్రదర్శించే ఈ నృత్య రూపకాన్ని తిలకించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరు కానున్నట్లు ఆమె వివరించారు. సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక తాము సమర్పిస్తున్న తొలి ప్రదర్శన అని, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వీర నారీమణి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తొలిసారిగా శాస్త్రీయ సాంప్రదాయ కూచిపూడి నృత్య రూపంలో ప్రదర్శిస్తున్నట్లు అలేఖ్య పుంజాల వివరించారు. పెద్ద ఎత్తున కళాప్రియులు హాజరై చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తిలకించి నివాళులు అర్పించాలని, ఉచిత ప్రవేశం అని అలేఖ్య పుంజాల ఆహ్వానిస్తున్నారు.
10న చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్యరూపకం
