హైదరాబాద్: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కు అన్ని హంగులతో అద్భుత భవనాన్ని నిర్మించి ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డిమాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వానికి జర్నలిస్టులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తాము ఈ ఏడాది చివరి నాటికే కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రూ.20 కోట్లు ఖర్చు అయినా సరే పాత్రికేయుల కోసం అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో మహిళల సౌకర్యం కోసం నిర్మిస్తున్న భవనానికి తన స్వచ్ఛంద సంస్థ అయిన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 5 లక్షల నగదు సహాయం అందిస్తాననీ మంత్రివెల్లడించారు. అనంతరం ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి తో పాటు కార్యవర్గ సభ్యలతో కలిసి క్లబ్ ను పరిశీలించారు. గత దశాబ్ద కాలంగా ప్రెస్ క్లబ్ లో పెండింగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ భవన్ నిర్మాణం గురించి జర్నలిస్ట్ లు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మంత్రి.. క్లబ్ కార్యవర్గం తో చర్చించి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి తో సమావేశం నిర్వహించి జీ +4 గా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్ ను మంజూరు చేసి అద్భుతమైన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశామని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అద్భుతమైన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు.మంత్రి గారి స్పందన పట్ల జర్నలిస్ట్ లు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల నాయుడు, రవి కాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రావు, సి వనజ, జాయింట్ సెక్రెటరీ చిలుకూరి హరి ప్రసాద్, కోశాధికారి రాజేష్,ఈసీ మెంబర్లు శ్రీనివాస్,వసంత్ కుమార్,బి.గోపరాజు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్, యూసుఫ్ బాబు, ఆజం ఖాన్ తదితరులు హాజరయ్యారు. ముస్లిం మతగురువు సయ్యద్ షా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.