హైదరాబాద్, మార్చి 25 : భాగ్యనగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. . హ్యాపీ హోలీ అంటూ యువత సోమవారం తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. కలర్‌ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ హోలీ వేడుకలు సోమవారం శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు బద్దం భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెరుకు ఉమేష్ గౌడ్, పి.ఎస్.రాము, సర్దా శివకృష్ణ, ఏలే సుధాకర్, రేవంత్ గౌడ్, కృష్ణారెడ్డి, భాస్కర్, రాము గౌడ్, వీరాచారి తదితరులు ఈ హోలీ వేడుకల్లో పాల్గొని కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న యువత ఉత్సాహం అంతాఇంతా కాదు. చిన్నా, పెద్దా అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ కలర్‌ఫుల్ పండుగను ఎంజాయ్ చేశారు. దీంతో శ్రీ సాయినగర్ మొత్తం ఎక్కడ చూసినా రంగుల మయంగా మారిపోయింది.
ఈ సందర్బంగా శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు బద్దం భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘‘బురా మత్ మానో.. హోలీ హై..’’ అంటూ ఒకరికొకరు రంగులు పులుముకుంటూ ఏళ్ల నాటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి హోలీకి ఉందన్నారు. ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన ఈ వేడుకను ఏటా ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకల్లో మునిగిపోయారని చెప్పారు. ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన వేడుక ‘హోలీ’. భాగ్యనగరంలో భిన్న సంస్కృతులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తున్నారు. ప్రాంతాలు ఏవైనా ఇక్కడ అందరూ కలిసి కట్టుగా వేడుకలను నిర్వహించుకుంటారు. ఎవరికి వారు ప్రత్యేకతను చాటుకుంటారు. హోలీ ముందు కర్రలు, పిడకలు, నెయ్యితో కామదహనం ఏర్పాటు చేస్తారు. పండిత్‌ల మంత్రోచ్ఛరణల మధ్య కాముడు చుట్టూ ప్రదక్షణలు చేసి దహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. కుటుంబాలకు పరిమితం కాకుండా స్నేహితులతో సందడి చేస్తారు అని పేర్కొన్నారు.
శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకు ఉమేష్ గౌడ్ మాట్లాడుతూ… ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. దేశ వ్యాప్తంగా కూడా హోలీ సందడి మొదలైంది. అలాగే గత రాత్రి కామ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది. హోలీ పండుగకు ముందు రోజు కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా కాముడికి ప్రత్యేక పూజలు చేసి కామ దహనం చేశారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య పండుగను జరుపుకున్నారు. హోలీ అనగానే రంగులే కాదు.. దక్షిణాది రుచులు నోరూరిరుస్తుంటాయి. ఇళ్లలో సంప్రదాయబద్ధంగా పిండి వంటలు చేసుకుంటారు. కోల్‌కత్తా రుచులు గ్రీసీ కచోరాస్, దాహి బల్లాస్ భోజన ప్రియులను నోరూరిస్తుంటాయి. దక్షిణాది మిఠాయిలు రస్‌గుల్లా, రస్ మలై, చుమ్ చుమ్ వంటి స్వీట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. జొన్నలు, బెల్లం, కొబ్బరితో చేసే గుజియాలు హోలీ ప్రత్యేక వంటకం. రెస్టారెంట్‌లు ఈ రుచిని ప్రత్యేకంగా సిద్ధం చేసి వడ్డిస్తాయి. నేతితో సిద్ధమైన పురన్ పోలి, కుల్ఫీ, తండాయి వంటి వంటకాలు అదనపు ఆకర్షణగా ఉంటాయని చెప్పారు. అందుకే ఈ హోలీకి అంతటి ప్రాధాన్యత ఉందన్నారు.