Seetharamapuramlo oka prema janta Movie Review : అచ్చ‌మైన ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ!

seetharamapuramlo oka premajanta movie review
Spread the love

చిత్రం : సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌,
విడుదల : నవంబర్ 18, 2022,
రేటింగ్ : 3/5,
నటీన‌టులు: రణధీర్, నందిని,
సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ,
నిట్టల్‌, మిర్చి మాధవి, సంధ్య సన్‌ షైన్‌,
సుష్మా గోపాల్‌, భాషా, చంద్రకాంత్‌,
బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌,  లేట్‌ శివ శంకర్‌ మాస్టర్‌,
సురేష్‌ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
నిర్మాణం : శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌,
నిర్మాత : బీసు చందర్‌ గౌడ్‌ ,
కథ- కథనం-మాటలు-దర్శకత్వం: ఎం. వినయ్‌ బాబు,
డిఓపి : విజయ్‌ కుమార్‌ ఎ.,
ఎడిటింగ్‌ : నందమూరి హరి, ఎన్టీఆర్‌,
సంగీతం : ఎస్‌.ఎస్‌.నివాస్‌,
ఫైట్స్‌ : రామ్‌ సుంకర,
కొరియోగ్రఫీ : అజయ్‌ శివ శంకర్‌, గణేష్‌, మహేష్‌,
పిఆర్ఓ : చందు రమేష్.

టాలీవుడ్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇతివృత్తాలతో తెరకెక్కిన ప్రేమ‌క‌థా చిత్రాల‌కు ప్రేక్ష‌కులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఈ మాత్రం మంచిగా అనిపిస్తే.. ఆయా చిత్రాలను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. ఇప్పుడు అదే కోవ‌లో వ‌చ్చిన‌ ప్రేమ‌క‌థా  చిత్రం ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌`.  టైటిల్ ద‌గ్గ‌ర నుంచి పాట‌లు, ట్రైల‌ర్స్ తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా నేడు (శుక్ర‌వారం, నవంబర్ 18, 2022) థియేట‌ర్స్ లో విడుద‌లైంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి అత్భుతమైన స్పందన వచ్చింది. మరి ఎన్నో అంచ‌నాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌’ ఆ అంచ‌నాల‌ను అందుకుందో లేదో తెలుసుకోవాలంటే సినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే..
 కథ ఏంటంటే.. :  సీతారామ పురం అనే ఓ గ్రామంలో ప‌టేల్ (సుమ‌న్‌) అనే ఒక స‌ర్పంచ్ ఉంటాడు. ఆ స‌ర్పంచ్‌కి నందు ( హీరోయిన్ నందిని) అనే ఒక అంద‌మైన కూతురు ఉంటుంది. అదే ఊరిలో న‌ర్సింహ గౌడ్  (సూర్య‌) మాజీ స‌ర్పంచ్ కొడుకు శివ (ర‌ణ‌ధీర్‌) నందు ఇద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి చ‌దువుకుంటారు. దీంతో వారి మ‌ధ్య ప్రేమ పరవళ్లు తొక్కుతుంది. కానీ హీరోయిన్ నందుకి మేన‌బావ ( అమిత్‌)  ఉంటాడు. అత‌నికి ఇచ్చి పెళ్లి చేయాల‌న్న‌ది ప‌టేల్ ఆలోచ‌న‌. ఈ క్ర‌మంలో నందు, శివ ల ప్రేమ విష‌యం పెద్ద‌ల‌కు తెలుస్తుంది. ఇద్ద‌రి ఇంట్లో వార్నింగ్ ఇస్తారు. దీంతో ఒకానొక రోజు చెట్టాపట్టాలేసుకొని హీరో హీరోయిన్ లేచిపోతారు.  దీంతో ఇద్ద‌రి ఇంట్లో పెద్ద‌లు రాజీ కొచ్చి .. ఆ ప్రేమజంటను వెత‌కడం ప్రారంభిస్తారు. కానీ అప్ప‌టికే నందుతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమిత్ కి అది  న‌చ్చ‌దు .  అమిత్ ఎలాగైనా త‌న మేన మ‌ర‌ద‌ల్ని పెళ్లి చేసుకుని ప‌టేల్  ఆస్తి  కొట్టేయాల‌ని రౌడీల‌ను తీసుకొని హీరో హీరోయిన్ల‌ను వెతికి ప‌ట్టుకుంటాడు.  ఆ త‌ర్వాత ఏమైంది?  హీరో హీరోయిన్ల‌ను అమిత్  ఏం చేసాడు? ఎంతో గాఢంగా ప్రేమించిన హీరో శివ కోసం హీరోయిన్ నందు ఏం చేసింది? అనేది క్లైమాక్స్.  ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌’ కోసం థియేటర్లో అడుగుపెట్టి సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే… : ఈ చిత్రంతో ర‌ణ‌ధీర్  హీరోగా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యాడు. త‌న‌కు తొలి చిత్రమే అయినా ఎంతో అనుభ‌వం ఉన్న నటుడిలా తన నటనను ప్రదర్శించాడు. ప్రతీ సన్నివేశంలో ఈజ్ కనిపించింది. ఎంతో అనుభవమున్న హీరోలా న‌టించాడు. ఒక ప‌ల్లెటూరి కుర్రాడిగా, ల‌వ‌ర్ బాయ్ గా ఆద్యంతం మెప్పించాడు. మోత్తం మీద ఫర్వాలేదనిపించేలా ర‌ణ‌ధీర్ నటన సాగింది. కొంచెం మెరుగులు దిద్దుకుంటే మాస్ హీరోగా పరిశ్రమలో నిలదొక్కుకునే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. డాన్స్ ల్లో, ఫైట్స్ లో చెక్కు చెదరని ఆత్మ విశ్వసాన్ని చూపిస్తూ చక్కటి ఈజ్ క‌న‌బ‌రిచాడు. ఇక హీరోయిన్ గా నటించిన  ఒక ప‌ల్లెటూరి గ‌డుసుపిల్ల‌గా నందిని తన హావభావాలతో అద‌ర‌గొట్టింది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.  తెలంగాణ స్లాంగ్ లో త‌ను చెప్పిన డైలాగ్స్ తో సినిమా ఫ‌స్టాప్ అంతా ఎంతో ఎంట‌ర్ టైనింగ్ గా సాగింది. అంతే కాకుండా తన అందంతో పాటు అభిన‌యాన్నీ ప్రదర్శించి విశేషంగా అలరించింది. ప్రతీ ఫ్రేమ్ లో తన నటనను తెరపై ప్రేక్షకులు మెచ్చేలా ప్రదర్శించి ఆక‌ట్టుకుంది. హీరోయిన్‌కి చెప్పిన డ‌బ్బింగ్ చక్కగా ఉంది. సుమ‌న్‌, సూర్య‌, మిర్చి మాధ‌వి పాత్ర‌లు  సినిమాకు ఎంతో కీల‌కం. హీరో హీరోయిన్స్ ఫ్రెండ్స్ పాత్ర‌లు కూడా కడుపుబ్బ నవ్వించాయి. అమిత్ ఎప్ప‌టిలాగే త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. ఎలాంటి పాత్రలు అతడికి కొట్టిన పిండే!
 సాంకేతిక నిపుణుల ప‌నితీరు: ఈ ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌’ చిత్రం గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవలసింది సినిమాటోగ్ర‌ఫీ గురించి. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా తన కెమెరాలో బంధించిన సినిమాటోగ్రాఫర్ తన ప్రతిభను ప్రేక్షకులు మెచ్చుకునేలా చేశారు. అటు తర్వాత మ్యూజిక్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎస్‌.ఎస్‌.నివాస్‌ అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు ఎంతో హైలెట్ గా నిలిచాయి.  ద‌ర్శ‌కుడు ఒక మంచి క‌థ రాసుకోవ‌డంతో పాటు, సాంకేతిక నిపుణులు, న‌టీన‌టుల  ద‌గ్గ‌ర నుంచి వ‌ర్క్ రాబ‌ట్టుకోవ‌డంలో  స‌క్సెస్ అయ్యాడు.  తెలంగాణ స్లాంగ్ లో ద‌ర్శ‌కుడు రాసిన సంభాష‌ణ‌లు అందర్నీ ఆక‌ట్టుకుంటాయి. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ‌కు ఎంత ఖ‌ర్చు పెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టారు నిర్మాత. ఫలితంగా ఈ ‘ సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌’ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థా  చిత్రంగా అన్నివర్గాల ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది.
 విశ్లేష‌ణ‌లోకి వెళితే.. : సినిమా ఫస్టాఫంతా కథానాయిక తెలంగాణ స్లాంగ్ లో చెప్పే డైలాగ్స్ తో , హీరో హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సీన్స్ తో  ఎంతో వినోదాత్మకంగా సాగుతుంది. అక్క‌డ‌క్క‌డ మిన‌హా ద‌ర్శకుడు రెండు గంట‌ల పాటు  ప్రేక్షకుల‌ను కూర్చున్న సీట్లకు హతుక్కుపోయేలా ఎంట‌ర్ టైన్ చేశాడన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఆనందంగా ఉండాలంటే ఆస్తులు కాదు…ప్రేమ ఉండాలి..’ పెద్ద‌లు ప‌ట్టింపుల‌కు పోకుండా పిల్ల‌ల మ‌న‌సులు అర్థం చేసుకోని వారి ప్రేమ‌ను అంగీరించాలి. బ‌తిక‌నంత కాలం క‌లిసిమెలిసి బ‌త‌కాలి అంటూ ద‌ర్శ‌కుడు ఇచ్చిన సందేశానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. వీనుల విందైన.. విన‌సొంపైన పాట‌లు,  అద్భుత‌మైన‌  లొకేష‌న్స్, అంద‌మైన హీరో హీరోయిన్ జంట‌, సినిమాటోగ్ర‌ఫీ ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమాని త‌ప్పకుండా చూసి తీరాల్సిందే! చాలా కాలం త‌ర్వాత స్వ‌చ్ఛ‌మైన, అచ్చ‌మైన ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థతో వ‌చ్చిన చిత్ర‌మిది.  ఫ్యామిలీతో పాటు యువతరం అంతా చూసే క్లీన్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌’. ‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విభిన్నమైన ప్రేమకథాచిత్రమిది. ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి ఈ చిత్రానికి ఎంతో డిఫరెన్స్‌ ఉంది. దర్శకుడు వినయ్‌బాబు అత్భుతమైన ట్విస్ట్‌లతో సినిమాను ఇంట్రెస్టింగ్‌గా తెరక్కించారు. అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది. మంచి కంటెంట్‌తో పాటు కమర్శియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. అందుకే.. యువతో పాటు ప్రతి తల్లీదండ్రి చూడాల్సిన సినిమా ఈ ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌’.

Related posts

Leave a Comment