సుద్దాల హనుమంతు
(06.06.1910 – 10.10.1982)
జన్మ స్థలం:- నేటి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పాలడుగులో
తల్లిదండ్రులు:- బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ
“పల్లెటూరి పిల్లగాడా
పసులుగాసే మొనగాడా
పాలు మరిచి యెన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడా కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో”
తెలంగాణలో ఈపాట పాడని పల్లె లేదు. పట్నం లేదు. జనుల నాలుకల మీదికెక్కిన ఈ అర్ద్ర మానవతాగీతం రాసింది తెలంగాణా సాయుధపోరాటంలో పెన్నూ, గన్నూ ధరించి పోరాడిన ప్రజాగెరిల్లాకవి సుద్దాల హనుమంతు. సాయుద పోరాటకాలంలో ప్రజల్ని యోధులుగా మార్చిన పాటలెన్నో ఆయన రాసారు. ఆమరణాంతం నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినవాడు, ఆచరణకు అడ్డుపడ్డ అన్నింటినీ తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్యజీవి.
సుద్దాల హనుమంతు నేటి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని పాలడుగులో పుట్టాడు. నిజానికి వీరి తాతలవూరు ఇడుకుడ. హనుమంతు తాత పేరు కృష్ణహరి, నాయనమ్మ వెంకటరావమ్మ. తాతగారు హరికథ కళాకారుడు. హనుమంతు తండ్రి బుచ్చిరాములు, తల్లి లక్ష్మీనరసమ్మ. బుచ్చిరాములు, ఆయన సోదరులైదుగురు కళాకారులే. 30 సంవత్సరాల పాటు వీధినాటకాలు ప్రదర్శంచినవారు. పాలడుగు గ్రామానికి వచ్చి స్థిరపడిన బుచ్చిరాములు మంచి పేరున్న ఆయుర్వేద వైద్యుడు.
గొప్ప మానవతావాదియైన ఆ గురువు నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానన్నాడు సుద్దాల. హరికథ చెప్పడానికి పాలడుగు వచ్చిన ఆధ్యాత్మిక గురువు ఆత్మకూరి అంజన్ దాసుగారికి శిష్యుడైపోయి, ఆయన వెంట డ్రామా కంపెనీ సభ్యుడిగా రెండేండ్లు వూళ్ళెన్నో తిరిగాడు. హనుమంతుగారిది కోకిల గొంతు. పద్నాలుగేండ్ల వయసొచ్చేసరికి గొప్ప గాయకుడు, నటుడయ్యాడు.
ఆరోజుల్లో గ్రామాల్లో వెట్టిచాకిరి విధానముండేది. ఆ పనిచేసేవాళ్ళని వెట్టివాళ్ళని పిలిచేవారు. అలాంటి వెట్టి చాకిరీ కూలీ పాపయ్య అనారోగ్య స్థితిని లెక్కచేయకుండాని తన్ని ఈడ్చుకపోవడం చూసి హనుమంతు మనసు కలతపడ్డది. ఆ సన్నివేశం మనసులో వుండిపోయింది. తర్వాతికాలంలో ఆ సంఘటనే ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పిన తీరదో కూలన్న’ అనే పాటగా ప్రాణం పోసుకుంది.
సుద్దాల ఊరు విడిచి హైదరాబాద్ పట్నం చేరి వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసారు. ఆకాలంలో బుద్వేలులో వుండేవాడు. నైజాంపాలనను వ్యతిరేకించే ఆర్యసమాజంలో చేరి, కార్యకర్తగా పనిచేసాడు. అప్పుడే ‘యదార్థ భజనమాల’ అనే పాటల పుస్తకం రాసాడు. ఆర్య సమాజంలో చేరక , విద్యాలంకార్ వినాయకరావ్, రుద్రదేవ్, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారితో పరిచయాలు అయ్యయి.
తెలంగాణ సాయుద ఉద్యమంలో భాగంగానే ఇప్పటి జనగామ జిల్లాలోని సుద్దాలకు చేరుకుని స్థిరపడ్డాడు. అపుడు సుద్దాల గ్రామం దొరల పాలన కిందనే నలుగుతూవుండేది. సుద్దాలలో పొరుగు గ్రామాలలో 1946 ప్రాంతంలో తొలి సారిగా ఎర్రజెండాను, జాతీయజెండాను ఎగరేసారు. జానపద కళారూపాలైన బుర్రకథ, గొల్లసుద్దులు, బుడబుక్కలపాట, పిట్టలదొర పదం, పకీర్ల పదాలను ప్రక్రియలుగా ఎన్నుకొని సుద్దాల ప్రజల భాషలో, ప్రజా కళారూపాలతో పాటలు, పదాలు ఎన్నో రాసారు.
ఒకసారి ఓ గ్రామంలోని సభలో సుద్దాల హనుమంతు. పాట పాడుతుండగా రజాకార్ల దాడి మొదలైంది. భయపడి పారిపోతున్న ప్రజల్ని చూసి అక్కడున ఓ ముసలమ్మ ‘ఎందుకు బయపడి చస్తరు. వచ్చినోల్లు వందమందిలేరు. మనం వెయ్యిమందిమున్నం. వెయ్యిర దెబ్బ వెయ్యెహె’ అనడం విన్న సుద్దాల అప్పటికప్పుడే ఆశువుగా అల్లినపాట
‘వెయ్ రా దెబ్బ వెయ్
దెబ్బకు దెబ్బ వెయ్ రా వెయ్
………………………………
దయ్యపు గుండాగొయ్యలు రాజాకారులు
కయ్యానికి మనపైబడి వచ్చిరి
ఇయ్యర మొయ్యర దంచర బడిశతో
కుయ్యో మొర్రన కోయర చురికతో’ అని ఆవేశంతో పాడుతుంటే ప్రజలు తిరుగబడి, రజాకార్లను ఎదిరించారు. ఈ సంఘటన ఒక పాట ప్రజలతో ఎంత చైతన్యన్నిరగిలిస్తుంది అన్న దానికి ఉదాహరణగా నిలిచింది.
ఆయన పాటలు ప్రజలకు కంఠోపాఠమైనాయి. పోరాటగీతాలైనాయి, ప్రజలను పోరాట యోధులుగా మారడానికి స్పూర్తినిస్తూనే వున్నాయి.
హనుమంతు ఒకరోజు సుద్దాల పొరుగు గ్రామం తేరాలకు వెళ్ళి వస్తూ తొవ్వలో పశువులను అదమాయించలేక, కాళ్ళకు గుచ్చుకున్న ముండ్లను తీసుకోలేక రాతిగుండుమీద కూర్చుని ఏడుస్తున్న పసులకాపరి పిల్లగాడు బత్తుల అబ్బయ్య కాలిముండ్లు తీసి, ఓదార్చాడు. వాని బదులు తనే పశువులను అదమాయించాడు. వాని రూపమే కండ్లల్లో మెదులుతుంటే సుద్దాల గుండెలో పాట గూడు కట్టుకుంది. ఇంటికి వస్తూ దారిలో అల్లుకున్న పాటే
‘పల్లెటూరి పిల్లగాడా
పసులుగాసే మొనగాడా’
‘ఈ పాటను 1979లో గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన ‘మా భూమి’ సినిమా టైటిల్ సాంగ్ గా తీసుకున్నారు.
‘ప్రజలబాధల పట్ల కూడా అంత తీవ్రంగానే స్పందించగలిగాను కాబట్టే ఎంత కర్కశమైన తుపాకీనైనా చేతపట్టి యుద్ధం చేసాను. కలంపట్టి అంతే తీవ్రతతో ప్రజలకొరకు పాటలు రాసాను’ అన్నాడు సుద్దాల హన్మంతు.
ఆయన పాటల్లో ‘రణభేరి మ్రోగింది, సంఘం వచ్చింది, ఔనంటావా ఇది కాదంటావా, చిందొర పెద్దొర, వా వారెవా వహ్వారెవా, దొరలు – భూస్వాములు, మంటలు మంటలు మంటలు, ఇంకెన్నడు సోషలిజం, వ్యవసాయ కూలి, శివగోవింద పదం, నందామయా గురుడ పదం ప్రసిద్ధమైనవి. సుద్దాల అసంపూర్ణంగా రాసిన ‘వీర తెలంగాణ’ యక్షగానాన్ని ఆయన పెద్దకొడుకు సుద్దాల అశోక్ తేజ పూర్తి చేసి పుస్తకంగా అచ్చువేయించాడు.
హనుమంతు జీవితం తెలంగాణ సాయుధపోరు వేరు వేరు కావు! ఆయన పాటలన్నీ ఉద్యమ ప్రేరణనిచ్చే అగ్నిగీతాలే. మానవత్వం పరిమళించే సౌమ్యగీతాలూ వున్నాయి. బతుకే పాటైనవాడు. పాటను పోరుబాటగా వేసినవాడు బతుకంతా సమసమాజ స్వప్నాన్ని శ్వాసించిన సుద్దాల హనుమంతు తెలంగాణకే కాదు సమస్త ఉద్యమ ప్రపంచానికి వైతాళికుడే!
(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “తెలంగాణ తేజోమూర్తులు” గ్రంధం.)