సామ్రాట్ : ఒక పచ్చని జ్ఞాపకం!

Ghattamaneni Rameshbabu special story
Spread the love

మా హీరో కొడుకు ఎంట్రీ అంటే మాకెంత జోష్ ఉండాలి? అభిమానమంటే అభిమానమే. నాకు సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి అభిమానం. ఎందుకో మరి… చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నదనుకోండి. కృష్ణ వ్యక్తిత్వం కూడా ఈ అభిమానానికి కారణం కావొచ్చు. ఇక అభిమానమంటే ఒక్క ఆ హీరోకే పరిమితం కాదు. ఆ హీరో కుటుంబం నుంచి ఇంకొకరు సినీ ఎంట్రీ ఇస్తే వాళ్ళ మీదా పొంగుకొచ్చే గొప్ప అభిమానమన్నమాట. ఇది నా బాల్యంలో రమేష్ బాబుకూ, ఇప్పుడు మహేష్ కూ వర్తిస్తున్న అభిమానమే. నిన్న రమేష్ బాబు చనిపోయాడనే వార్త చెవిన పడగానే అతడితో అల్లుకున్న ఓ జ్ఞాపకం మళ్ళీ తాజా తాజాగా కదలాడసాగింది. ఈ జ్ఞాపకం జీవితాంతం వదలని జ్ఞాపకాల్లో ఒకటి.
రమేష్ బాబు అనగానే హిట్ హీరోనా? ఫ్లాప్ హీరోనా? అనే దానితో మాకు నిమిత్తం లేదు. కృష్ణ కొడుకు హీరో. అంతే. 1987లో రమేష్ బాబు సినీ అరంగేట్రం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఇప్పటికీ నా మదిలో అలా ముద్ర పడిపోయింది.
నాకు బాగా గుర్తు. అప్పుడు మా ఇంటికి ఆంధ్ర జ్యోతి వచ్చేది. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిగా పేపర్లో ముందుగా ఆకట్టుకునేది సినిమా పేజీనే. కృష్ణకు సంబంధించిన ఏ ఒక్క వార్తా వదలకపోయేది. రమేష్ బాబును హీరోగా పరిచయం చేస్తున్నట్లు వచ్చిన ఏ ఒక్క వార్త మా ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా చేసింది. రమేష్ బాబు సినిమాల్లోకి వస్తున్నాడన్న అనౌన్స్మెంట్ రాగానే ఒకేసారి పదికి పైగా సినిమాల ఆఫర్స్ వరుసకట్టాయన్న వార్త మా పిల్ల బచ్చా గ్యాంగ్ కు ఆయనపై ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి. మేం గాల్లో తేలిపోయాం. మా డిస్కషన్ టాపిక్ అంతా రమేష్ బాబే అయిపోయాడు. ఆయన్ని సినిమా రంగానికి ఆహ్వానిస్తూ కలర్ కలర్ గా, ఫుల్ పేజ్ యాడ్స్ తో దర్శనమిచ్చేది పేపర్. రమేష్ బాబు సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు, గుర్రపు స్వారీ చేస్తున్న పోజ్ పడింది పేపర్ లో అని చెప్పుకునే వాళ్ళం. ఆ ఫొటో ఇంకా మైండ్ లో లైవ్లీ గానే ఉంది నాకు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బేతాబ్’ ను ‘సామ్రాట్’గా రమేష్ ఫస్ట్ మూవీ. సన్నీ డియోల్ మొదటి సినిమానే మన రమేష్ బాబు మొదటి సినిమారా! అక్కడ సూపర్ హిట్. ఇక్కడ కూడా సూపర్ హిట్టేరా! సన్నీ డియోల్ కు ఫుల్ క్రేజ్. మనోడికి సినిమా రాకముందే వచ్చేసిందిరా. అబ్బా… ఎన్నెన్ని విషయాలో చెప్పుకోడానికి. క్లాస్ లో గ్యాప్ దొరికితే చాలు. ఇవే ముచ్చట్లు. ఫుల్ జోష్ లో మునిగి తేలేవాళ్ళం. ఇదంతా నా ఎనిమిదో తరగతిలోని మరువలేని జ్ఞాపకం. ఇది అట్లాంటిట్లాంటి జ్ఞాపకం కూడా కాదు. జీవితాంతం నిలిచిపోయే పదిలమైన జ్ఞాపకం.
ఎనిమిది మందితోటి ఉండేది మా సినిమా పిచ్చోళ్ళ బ్యాచ్. అందునా మేమంతా కృష్ణకే వీరాభిమానులం. సామ్రాట్ సినిమా రిలీజ్ కోసం పదహారు కళ్లతో ఎదురు చూశాం. కానీ మా ఎదురు చూపులకు నిరాశా మబ్బులు కమ్మేసి మా మిర్యాలగూడలో సినిమానే రిలీజ్ చేయలేదు. నల్గొండ లో రిలీజ్ అయినట్లు తెలిసింది. ఎట్లయినా సరే. రిలీజ్ అయిన వెంటనే సినిమా చూడటం, దాని గురించి క్లాస్ లో ఊదరగొట్టడం అంటే అదో క్రేజ్ కదా. ప్రతి సినిమా జనరల్ గా ముందు మిర్యాలగూడలో వచ్చి, ఆ తరువాతే నల్గొండలో రిలీజ్ అయ్యేది. కానీ ఎందుకో సామ్రాట్ మూవీ మాత్రం ముందుగా నల్గొండలోనే రిలీజ్ అయింది. మేమెంతగానో ఎదురుచూస్తున్న మా హీరో కొడుకు సినిమా ఏంటి, మేము చూడలేకపోవడమేంటి? ఉసూరుమంది ప్రాణం. ఏం చేయాలి?
సినిమా చూడకపోతే లైఫే వేస్ట్ అన్నట్లుంది మా కథ. రిలీజ్ అయిన రోజు శుక్రవారం గడిచింది. మరుసటి రోజు కూడా గడిచిపోతున్నది. ఇట్లా మౌనంగా కూర్చుంటే లాభం లేదనిపించింది. ఏదేమైనా సరే రేపొచ్చే ఆదివారాన్ని సినిమా చూడని అనాథగా వదిలేయకూడదని ఫిక్స్ అయిపోయాం. అంతే! కట్ చేస్తే…
నాలుగు సైకిళ్ళు సంపాదించి, ముందు జాగ్రత్తగా క్యారెల్ పై గాలిపంప్ బిగించుకుని చలో నల్గొండ టూర్ పెట్టుకున్నాం. 45కిలో మీటర్లు ప్రయాణం. ఇంట్లో చెబితే అస్సలు పంపించరు కాబట్టి టాప్ సీక్రెట్ మెయింటెయిన్ చేస్తూ బయలుదేరిపోయాం. మధ్యాహ్నం 2గంటలకు మొదలుపెట్టిన మా ప్రయాణం… సాయంత్రం 5గంటలకు వెంకటేశ్వర టాకీస్ కు చేర్చింది. అబ్బా..! అంతగా చెమటలు కక్కి రొప్పుతూ చేరుకున్న మాకు ఆ టైం షో అందలేదు. హౌస్ ఫుల్ బోర్డు వెక్కిరించింది.
నెక్స్ట్ సినిమా అంటే ఇక సెకండ్ షోనే. అంటే 9, 9.30 టైం. వామ్మో! ఆ రాత్రికి సినిమా చూసి, ఆ చీకటిలో మళ్ళీ మిర్యాలగూడకు ఎట్లా చేరతాం అన్న ఆలోచనే లేకపోయింది అప్పుడు. ఇప్పటిలా బస్సుల ఫ్రీక్వెన్సీ లేని సింగిల్ రోడ్లు. రోడ్లకు ఇరువైపులా దెయ్యాల్లాటి చెట్లు. ఊళ్ళల్లో కరెంట్ ఉండటమే కష్టమైన రాత్రుల్లో రోడ్లపై వెలుతురును ఆశించని రోజులవి. ఎట్లాగూ వచ్చాం. సినిమా చూడకుండా వెనుదిరగలేం. మూడు గంటలపాటు సైకిల్ తొక్కిన అలసట. ఇంకా నాలుగ్గంటలు ఎదురు చూస్తే తప్ప ఈ మూడు గంటల శ్రమకు ఫలితం దక్కదు. దీనికి తోడు కడుపులో ఎలుకలు దూరిపోయాయి. అటూఇటూ పరుగెడుతున్నాయి. బస్సు టికెట్లకు డబ్బులు లేకనే సైకిళ్ళ పై సినీ సాహసయాత్రకు పూనుకున్నవాళ్ళం. సినిమా టికెట్ కు మాత్రం అతికష్టంగా, సీక్రెట్ గా కూడబెట్టుకునే బాల్యం. ఊరు గాని ఊర్లో థియేటర్ కోసం వెళ్ళిన వాళ్ళం. ఏం చేసేది? ఏమీ లేదు.‌ ఆ సినిమా హాల్లోనే కబుర్లు చెప్పుకుంటూ, ఆ సామ్రాట్ సినిమా పోస్టర్లే మళ్లీ మళ్లీ చూసుకుంటూ, సినిమాలో హీరో అట్లా చేసి ఉంటాడు. ఇట్లా చేసి ఉంటాడనే కబుర్లతో గడిపేసినము. ఆకలి వేస్తుంటే ఉల్లిగడ్డ మర మరాలకు మాత్రం చిల్లర డబ్బులు మాత్రం ఉఃడినయ్. కొనుక్కున్నాం. వాటిని తిని కడుపు నిండిన ఫీలింగ్ తో సెకండ్ షో దాకా థియేటర్ ప్రాంగణంలోనే గడిపేసాం. సినిమాకు మళ్ళీ టిక్కెట్ లు ఎక్కడ దొరక్కుండా పోతాయోననే భయంతోటి 8 గంటలకే బుకింగ్లోకి దూరిపోయినం. నలుగురం లైన్ లో నిల్చుంటే మరో నలుగురం బయట వెయిటింగ్. బుకింగ్ లైన్లో ప్రశ్నలు మా చెవులకు చిల్లులు పెట్టాయి. ఏ బాబులు ఎవరు మీరు? ఇంత చిన్న పిల్లలు పెద్దోళ్ళు లేకుండా సెకండ్ షోకు వచ్చారా? అని. మా మొఖాలు మేము చూసుకుంటున్నాము. అక్కడికీ మా వాడొకడు నోరు జారనే జారాడు మిర్యాలగూడ నుండి సినిమాకు వచ్చామని. అది వినగానే ఆ లైన్లో నిల్చున్న వాళ్ళు వామ్మో! అన్నారు. మా అభిమానంపై కాస్త జాలి, మాపై ఇంకాస్త కంగారు కనిపించింది వాళ్ళల్లో. ఏదోలా మమ్మల్ని మాత్రం ఒత్తి పడేయలేదు ఆ లైన్ లో. ఆహ్..! ఎట్టకేలకు టిక్కెట్లు దొరికాయి. ఫుల్ జోష్ మా సైన్యంలో. అబ్బ ఒకొక్కరికి రూ.1:50 (రూపాయిన్నర/ఒక రూపాయి యాభై పైసలు) టికెట్. ఏదో సాధించామనే విజయగర్వం ఉప్పొంగుతుండగా… మేమంతా థియేటర్లో, స్క్రీన్ ముందు ఆసీనులయ్యాం. మొత్తానికి సినిమా చూసేశాం. రాత్రి పన్నెండు గంటల తరువాత సినిమా శుభం కార్డు పడింది.
కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. అర్ధరాత్రి. 45 కిలోమీటర్లు సైకిళ్ల మీద ప్రయాణం. అందరి మనసుల్లో భయం కుతకుతలాడుతున్నది. అది కానరాకుండా కప్పిపెట్టేందుకు మేము చూపిన మేకపోతు గాంభీర్యం చిన్న సన్నది కాదు. సినిమా మీద రివ్యూ చేసుకుంటూ మా ప్రయాణం మొదలుపెట్టాం. మేము మిర్యాలగూడ పొలిమేరను తాకేటప్పటికి మూడు కావొస్తుందట. రామచంద్ర గూడకు చేరేటప్పటికి రెండు సైకిళ్ల మీద ఇద్దరు బీట్ కానిస్టేబుల్స్ ఎదురయ్యారు. మమ్మల్ని చూసి ఏ ఎవ్వరా మీరు? ఆగండి అన్నారు. మేము చెప్పిన సమాధానాలకు ఆ పోలీసులకు దిమ్మతిరిగింది. మా గ్యాంగ్ లో టెన్త్ ఫెయిల్ అయిన మా సీనియర్ ఖాజా భాయ్ ఉన్నాడు. ఆయన నోటి దూల గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. టెన్త్ ఫెయిల్ అయ్యి రేషన్ షాపులో పార్ట్ టైం జాబ్ చేసేవాడు ఖాజాభాయ్. ఇద్దరు పోలీసోళ్ళలో ఒకతన్ని గుర్తించాడు. ఎలా అంటే… చక్కెరకు, కిరోసిన్ కోసం ఆ పోలీస్ వాళ్ళ రేషన్ షాపుకు వెళ్ళేవాడట. ఆ చనువుతోటి మనోడు ఆ పోలీసునుద్దేశించి, చేయెత్తి, బేస్ వాయిస్ తో ‘హెలో బాస్ నేను ఖాజా. రేషన్ షాపు గుమస్తాను’ గబగబా అన్నాడు. పాపం ఆయన ఏమనలేదు కానీ ఆయన పక్కనున్న ఇంకో పోలీస్‌కు బాగా చిరాకేసినట్లుంది. “ఏం రా!? బాస్ ఎంది బే” అన్నాడు. వామ్మో… అసలే పోలీసు. ఆ పైన మనోడు ఏందో క్లోజ్ ఫ్రెండ్ లెక్క ‘హలో బాస్’ అన్నాడు. మా గుండెలు గుబగుబలాడాయి. కానీ ఏమన్న మాట్లాడదామంటే ఒక్కరికీ గొంతుపెగిలి చావట్లేదు. ఏం చేసేది? ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాటర్ ఇక్కడే ఖతం కావాలి. ఇదే మ్యాటర్ ఇళ్ళకు లీకయితే…. వామ్మో ఆ బాధ వర్ణనాతీతం. సినిమా టిక్కెట్లు చూపించినా ‘హలో బాస్’ ఎఫెక్ట్ బాగానే ఉంది వాళ్ళ మైండ్ లో. అందరం ఏదోలాగా మేనేజ్ చేయాల్సిందే. తప్పదు.
లాభం లేదనిపించింది. బతిమాలుకున్నాం. ఆ పోలీసోళ్ళు మెత్తబడ్డారు. ఓకే అన్నారు. కానీ వాళ్ళిచ్చిన ట్విస్ట్ కు దిమ్మతిరగడం మా వంతైంది. వారు చెప్పింది ఏంటంటే… మేము ప్రయాణిస్తూ వచ్చిన మార్గంలో ఏదైనా దొంగతనం కానీ, మర్డర్ కానీ జరిగిందనుకోండి. వాళ్ళు మా ఇళ్ళకే వస్తారట. అట్లా అని వూరికే వదల్లేదు. మా అడ్రస్ లు తీసుకొని మరీ వదిలారు. ఇంటికి వెళ్ళే సరికి సమయం తెల్లవారుఝాము 4గంటలు దాటి కోడి కూతలు వినిపిస్తున్నాయి.
ఇక అమ్మ, నాన్నలతోటి జరిగిన ప్రైవేట్ క్లాసులు, స్పెషల్ మీటింగులు చెప్పాలంటే ఇంకో పెద్ద వ్యాసమే. ఇప్పుడు ఇలా రాశాను కానీ, ఆ వారం రోజులు మా బ్రతుకు దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షే. తెల్లవారితే చాలు… ఎక్కడైనా దొంగతనం వార్త ఉందా..! మర్డర్ జరిగిందా..! అని పేపర్ తిరగేయడమే అయింది మా పని. అది కూడా ఆంధ్రజ్యోతి పేపరే.😀

✍️ఆజం ఖాన్
09.01.2022

Related posts

Leave a Comment