-చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో పాటు మా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది.
బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా దర్శకుడు లక్ష్మణ్ విలేఖర్లతో ముచ్చటించి సినిమాకి సంబంధించిన పలు ఆస్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రశ్న: దర్శకుడిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
లక్ష్మణ్: మాది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. అందరి దర్శకుల లాగే చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే ఆసక్తి. అప్పట్లో స్కూల్ లో చిన్న చిన్న డ్రామాలు రాసేవాడిని. సినిమాల మీద ఇష్టంతో ఇంజనీరింగ్ ని మధ్యలో వదిలేసి హైదరాబాద్ వచ్చేశాను. హైదరాబాద్ రాకముందే ముగ్గురు నలుగురం కలిసి ఒక టీమ్ లా షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం. ఆ టీమ్ లో ఒక ఫ్రెండ్ కి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వస్తే, అతన్ని నమ్ముకొని మేమంతా ఇక్కడికి వచ్చేశాం. అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా చోట్ల ట్రై చేశాను గాని వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ చేశాను. రూ.3 వేల లోపు బడ్జెట్ తో ‘లాస్ట్ విష్’ అనే షార్ట్ ఫిల్మ్ చేశా. అది చూసి ఒకాయన లక్షా 30 వేలు బడ్జెట్ పెట్టడంతో ‘కృష్ణమూర్తి గారింట్లో’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి మంచి ఆదరణ లభించింది. సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు వచ్చింది. అప్పుడు నేను చెప్పిన ఒక స్టోరీ నచ్చి, సైమా వాళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేస్తామన్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. అయితే ముందు ట్రయల్ గా 12 లక్షల బడ్జెట్ తో ‘సదా నీ ప్రేమలో’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాం. దానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇంతలో లాక్ డౌన్ రావడంతో ఆ సమయంలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాయాలన్న ఉద్దేశంతో ‘స్వాతిముత్యం’ స్టోరీ రాయడం జరిగింది.
ప్రశ్న: ఈ సినిమా కోసం దేని నుంచైనా స్ఫూర్తి పొందారా?
లక్ష్మణ్: గోదావరి జిల్లాల్లో చిన్న చిన్న టౌన్స్ లో ఉదయాన్నే స్కూల్ టీచర్స్ వెళ్లడం, ఇంటి దగ్గర ఉండే చుట్టాలు వచ్చి మన మీద సెటైర్స్ వేయడం.. ఇలా మన చుట్టూ జరిగే సంఘటనల నుంచే ఈ కథ పుట్టింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళు స్పందిస్తారు? పక్కింటి వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఎవరి ఎమోషన్స్ ఎలా ఉంటాయి ? ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయి.
ప్రశ్న: అసలు ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటి?
లక్ష్మణ్: అబ్బాయి పేరు బాల మురళి కృష్ణ. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిన్న టౌన్ లో అప్పుడే జూనియర్ ఇంజనీర్ గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న ఒక యువకుడి కథ ఈ చిత్రం. జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెడతారు. ఒక సాధారణ పెళ్లిలో కూడా ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం.
ప్రశ్న: కథ రాసుకున్నాక సితార సంస్థను సంప్రదించారా?
లక్ష్మణ్: నేను ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని కొత్త వాళ్ళతో చేయాలనుకున్నాను. అప్పుడే గణేష్ స్టోరీలు వింటున్నాడు. ఆ సమయంలో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా గణేష్ ని కలిశాను. అయితే నేను మొదట గణేష్ కి ఈ కథ చెప్పలేదు. వాళ్ళ బ్రదర్ లా యాక్షన్ సినిమాలు చేస్తాడనుకుని నా దగ్గరున్న వేరే లైన్స్ చెప్పాను. అయితే గణేష్ మాత్రం నేను చేసిన ‘సదా మీ ప్రేమలో’ ట్రైలర్ చూసి, ఏదైనా సింపుల్ స్టోరీ ఉంటే చెప్పమని అడిగాడు. అప్పుడు ఈ కథ చెప్పడంతో గణేష్ కి బాగా నచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ సురేష్ గారికి చెప్పడం, ఆయనకు కూడా నచ్చడం. అక్కడి నుంచి సితారకు రావడం జరిగిపోయాయి.
ప్రశ్న: ‘స్వాతి ముత్యం’ అనే క్లాసిక్ టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టే సాహసం ఎందుకు చేశారు?
లక్ష్మణ్: సాహసం అని కాదండి. రాధాకృష్ణ గారు కు (చినబాబు) గారికి స్టోరీ చెప్పకముందు వేరే వేరే టైటిల్ అనుకున్నాం. ఆయన మొత్తం కథ విన్నాక.. ఇందులో ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయని ఆయన సజెస్ట్ చేశారు. ఇందులో విలన్ ఎవరూ ఉండరు. ఒక టౌన్ లో కొన్ని ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ ఇది. అందుకే ఆయన సజీషన్ తో ఈ టైటిల్ పెట్టాం. ఫస్ట్ ఈ టైటిల్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయమేసింది. కమల్ హాసన్ గారు పోషించిన పాత్రతో పోలుస్తారేమో అని భయపడ్డా. కానీ చినబాబు గారు ఇచ్చిన సపోర్ట్ తో ముందుకెళ్ళాం.
ప్రశ్న: ఇది గణేష్ కి మొదటి సినిమా కదా.. వర్క్ షాప్స్ ఏమైనా చేశారా?
లక్ష్మణ్: మా ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కదా. తనకి నేను చెప్పిన స్టోరీ అయితే నచ్చింది కానీ.. నేను ఎంతవరకు హ్యాండిల్ చేయగలనని అతనికి డౌట్స్ ఉండొచ్చు. అలాగే నాకు కూడా ఇతనితో అనుకున్న అవుట్ ఫుట్ ఇవ్వగలనా అనే డౌట్స్ వచ్చాయి. అయితే డైరెక్టర్ గా నేను, హీరోగా తను సక్సెస్ అవ్వాలని ఇద్దరం కలిసి ఎక్కువ ట్రావెల్ అయ్యి, చాలా వర్క్ షాప్స్ చేశాం. అలా ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో సెట్స్ మీద ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
ప్రశ్న: వర్ష బొల్లమ్మను ఎవరు ఎంపిక చేశారు?
లక్ష్మణ్: వర్ష ఎంపిక నాదే అండీ. ’96’ మూవీ చూసినప్పుడే ఆ అమ్మాయి నచ్చింది. మొదటి సినిమా చేస్తే ఈ అమ్మాయితో చేయాలనుకున్నాను. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే హీరోయిన్ పాత్రకు ఆమెని ఊహించుకునే రాసుకున్నాను. గణేష్ హీరోగా, సితార సంస్థ నిర్మాణం అనుకున్న తరువాత కొన్ని వేరే పేర్లు కూడా అనుకున్నాం. అయితే అదే టైంలో వర్ష నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ రావడం, ఆమె పేరు సజెస్ట్ చేయగానే ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోవడం జరిగిపోయాయి.
ప్రశ్న: సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నారా?.. మీకు సంతృప్తి కలిగిందా?
లక్ష్మణ్: చూశానండీ.. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ వచ్చేవరకు అనుకున్న అవుట్ పుట్ వస్తుందా రాదా అని మనసులో చిన్న భయముండేది. కానీ అవుట్ పుట్ చూశాక హ్యాపీ. డీఓపీ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మొదట నేను ఓ లవ్ స్టోరీ ఫిల్మ్ చేద్దామనుకున్నప్పుడు నాతో ట్రావెల్ అయ్యాడు. అయితే అది వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ఓకే అయ్యాక, డీఓపీ గురించి చర్చ వచ్చినప్పుడు నాగవంశీ గారు సూర్య అనే పర్సన్ ఉన్నాడని చెప్పారు. ఆ సూర్య, ఈ సూర్య ఒక్కరే అని తెలిసి వెంటనే తీసుకోవడం జరిగింది.
ప్రశ్న: ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ వంటి పెద్ద సినిమాలతో పాటు విడుదలవుతుంది. అసలు ఈ నిర్ణయం ఎవరిది?.
లక్ష్మణ్: విడుదల తేదీ అనేది పూర్తిగా నిర్మాతల నిర్ణయం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఫెస్టివల్ కి విడుదల చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో పాటు విడుదల కావడం కొంచెం భయంగా ఉన్నా సంతోషంగా ఉంది.
ప్రశ్న: మీ అభిమాన హీరో ఎవరు?
లక్ష్మణ్: చిరంజీవి గారు. ఆయనతో సినిమా చేసే అవకాశం రాలేదు కానీ ఆయన సినిమా విడుదలవుతున్న రోజే నా సినిమా విడులవుతుంది. చిన్నప్పటి నుంచి నేను అభిమానించిన చిరంజీవి గారి సినిమాతో పాటు నా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది.
ప్రశ్న: తదుపరి సినిమాల గురించి చెప్తారా?
లక్ష్మణ్: ఇంకా ఏం అనుకోలేదండి. కానీ ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా ఈసారి కామెడీ థ్రిల్లర్ లేదా సీరియస్ డ్రామా చేయాలనే ఆలోచన ఉంది.
ప్రశ్న: దర్శకుడిగా మీకు స్ఫూర్తి ఎవరు?
లక్ష్మణ్: మణిరత్నం గారు, వంశీ గారు, బాపు గారు, జంధ్యాల గారు.
ప్రశ్న: నెక్స్ట్ సినిమా సితారలో ఉండొచ్చా?
లక్ష్మణ్: ఉండొచ్చు. ఖచ్చితంగా మాకే చేయాలని అగ్రిమెంట్ అలాంటివి ఏం తీసుకోలేదు. ఫ్రీడమ్ బాగా ఇస్తారు. మళ్ళీ సితారలో చేసే అవకాశముంది.