ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు… మొన్న కళాభారతి జమున గారు, నిన్న దర్శకుడు సాగర్ గారు, ఇవాళ దర్శక దిగ్గజం కాశీనాధుని విశ్వనాధ్ గారు! తెలుగు చిత్రసీమ లో ఆయనదొక గొప్ప చరిత్ర! ఒక శకం ముగిసింది! స్వర్ణ కమలం వాడి పోయింది! శంకరాభరణం కళతప్పింది! స్వాతిముత్యం జారిపోయింది! సప్తపది ఆగిపోయింది! సిరిసిరి మువ్వ మూగవోయింది!
తెలుగు చలన చిత్రసీమ అంటే ఆ తరానికి ఈ తరానికి గుర్తుండిపోయే ఒకే ఒక్క దర్శకుడు విశ్వనాధ్ గారు! 50 సినిమాలకు దర్శకత్వం వహించి మేటి ఆణిముత్యాలను అందించారు! 30 సినిమాల్లో నటుడిగా ఒదిగి జీవించారు! ప్రతి సినిమా అద్భుతంగా చెక్కిన సౌందర్య శిల్పమే! అందుకే ఆనాటి ఆత్మ గౌరవం నుంచి ప్రతి సినిమా ఇప్పటికీ చూస్తూనే ఉంటాం! ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కళా ఖండాలు! రికార్డింగ్ అసిస్టెంట్ గా స్టూడియో సౌండ్ ఇంజనీర్ గా ప్రస్థానం ప్రారంభించి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారికి అసిస్టెంట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కో డైరెక్టర్ గా రచయితగా మారి తొలి సినిమా ఆత్మ గౌరవం తోనే నంది గెలుచుకున్న సంచలన దర్శకుడు విశ్వనాధ్ గారు! ఎన్నో ప్రయోగాలు చేసిన సాహస దర్శకుడు! సమాంతర చిత్రాలను కమర్షియల్ గా మార్చిన ప్రతిభా సుసంపన దర్శకుడు! ఆయన తీసిన ప్రతి సినిమా ఒక కాళాత్మక కావ్యం ! ప్రతి పాట ఒక కళా హృద్యం ! ఆయా చిత్రాల్లో అన్నీ మన చుట్టూ కనిపించే పాత్రలే సృష్టించి సరికొత్తగా చూపించి మనసులో చెదిరిపోని ముద్ర వేసిన మహా దర్శకుడు విశ్వనాధ్ గారు!
ఆయనే రైటర్! అందుకే మంచి రచయితలను ఎంచుకుని మరింతగా మెరుగులు దిద్దుకోవడం ఆయన ప్రత్యేకత! సంభాషణలు సరే సరి! పాటలు సైతం సాహిత్యం సంగీతం సమంగా ఉండి ఎన్ని సార్లు అయినా వినాలనిపించేలా, చూడాలి అనిపించేలా తీయడం ఆయన సత్తా! వేటూరి, సినారే, సిరివెన్నెల ముగ్గురి పాటలను అత్యద్భుతంగా దృశ్యమానం చేసిన ఘనత అయనదే! ఆయనకు ఆయనే సాటి మేటి! ఒక్కో సినిమా గురించి ఒక్కో పుస్తకమే రాయవచ్చు! ఆయన సినిమాలే పెద్ద గ్రంథాలయం!
ఇక వారితో నా పరిచయం మహాద్భాగ్యం! మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ గా వున్నప్పుడు వారిని కలిసే అవకాశం లభించలేదు! ఆ తరువాత పలు మార్లు వివిధ వేదికలపై చూడటం, వారి ఉపన్యాసం దూరంగా వినడం చేసే వాడ్ని! సాంస్కృతిక మండలి లో చేరాక అప్పటి చైర్మన్, అభినందన, నీరాజనం సినిమాల నిర్మాత ఆర్. వి. రమణమూర్తి గారి ద్వారా నాకు పరిచయం కలిగింది! వారిని కలసినప్పుడల్లా నా నోరు మూగవోయేది మాటలు రాక! ఒక శ్రోత లా ఉండి పోయేవాడ్ని!
ఒకసారి హరికథ వారోత్సవాలు ఏర్పాటు చేశాం రవీంద్రభారతి ప్రాంగణం లోని ఘంటసాల వేదికలో! ఒక సాయంత్రం ఫోన్ వచ్చింది విశ్వనాధ్ గారి నుంచి! పేపర్ లో చూశాను హరికథలు జరుగుతున్నాయని, వీలు ఉంటే నేను వస్తాను అని! ఆశ్చర్యపోయాను! అంత పెద్ద దర్శకులు, ఆయనకు ఆయన ఫోన్ చేసి వస్తా అన్నారని! రమణమూర్తి గారికి చెబితే అంతకన్నా ఆనందం ఏముంటుంది అని ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు! అలా మిగిలిన నాలుగు రోజులు రోజూ వచ్చి ప్రేక్షకులలో కూర్చుని హరికథ విని వెళ్ళేవారు! స్టేజి పైకి రమ్మంటే వచ్చే వారు కాదు! ఆయనకు హరికథ అంటే అంత ఇష్టం అని అప్పుడు తెలిసింది! ఆ తరువాత రవీంద్రభారతి కి అతిధిగా వచ్చినప్పుడు వారి అసిస్టెంట్ ద్వారా నన్ను పిలిపించడం, సాంస్కృతిక విషయాలు అడిగి తెలుసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది!
ఒకసారి తెలుగు మహా సభలు గురించి మాట్లాడటానికి వారి ఇంటికి వెళ్లాను! సహజంగా వారి ఇంటికి వెళ్లిన వాళ్ళు అందరూ అక్కడ సోఫా ఉన్నప్పటికీ, వారి పై గౌరవంతో కిందనే కూర్చుంటారు! భక్తి ప్రేమ తో పాదాభి వందనం చేస్తుంటారు! నేను అలా కింద కూర్చోబోయాను! ఆయన వారించి పైనే కూర్చోవాలి అని పట్టుబట్టి కూర్చునేంత వరకు ఊరుకోలేదు! ఆ తరువాత రెండేళ్ల క్రితం వరకు వారు ముఖ్య అతిధిగా, నేను ఆత్మీయ అతిధిగా పలు పుస్తకావిష్కరణలు, ఆడియో వీడియో, లోగోలు విడుదల, పురస్కారాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం!
విశ్వనాధ్ గారి తెలివి తేటలు అమోఘం! జ్ఞాపక శక్తి అద్భుతం! పరిశీలనా శక్తి ఆశ్చర్యం కలిగిస్తుంది! చూడటానికి చాలా గంభీరంగా కనిపించినా సెటైర్లు భలే వేస్తారు! ఎంతో నిరాడంబరంగా ఉంటారు! అద్భుత సినిమాలు తీసాననే గర్వం ఉన్నప్పటికీ అది బయటకుకనిపించదని, కేవలం తన దగ్గరే చూపిస్తారని వారి సతీమణి జయలక్ష్మి చెప్పేవారు నవ్వుతూ!
ఒకసారి తను తీసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏమిటని అడిగారు! స్వాతి కిరణం అని చెప్పాను! ఆయనకు మాత్రం ప్రముఖ నాట్యచార్యులు శ్రీ కళాకృష్ణ హీరో గా నిర్మించిన సిరిమువ్వల సింహనాదం అని చెప్పారు! నచ్చని సినిమా అంటే నేను సూత్రధారులు అన్నాను. గంగిరెద్దుల వారి జీవిత కోణం లో చేసిన ప్రయోగం అయినప్పటికీ అది కొంచెం బోరు కొట్టింది అని చెప్పాను! ఆయనకు మాత్రం సిరిసిరి మువ్వ! అది సూపర్ డూపర్ హిట్ అయినా ఇంకా బాగా తీసి ఉండాలనేది వారి అసంతృప్తి! శివుడు అంటే ప్రాణం! శోభానాయుడు గారు అంటే చాలా ఇష్టం! పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి వీరాభిమాని విశ్వనాధ్ గారు!…ఇలా ఎన్నో విషయాలు పంచుకునే గొప్ప అదృష్టం లభించింది! వారి సాన్నిహిత్యం వారి తో మాట్లాడిన అనుభూతి ఎప్పటికి గుర్తుండిపోయే వెంటాడే జ్ఞాపకం! మరో విశ్వనాధ్ మన వెండితెర కు లభించరు! ఇప్పటికీ ఎప్పటికి ఒకే ఒక విశ్వనాధుడు! అతడే కళాతపస్వి, దాదా సాహెబ్ పాల్కె అవార్డు గ్రహీత పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గారు! వారికి వినమ్ర నివాళి 🙏
– డా. మహ్మద్ రఫీ
వెండితెర విశ్వనాధుని పలుకు రాగ మధురం!
