ముత్యాలు ‘ఆత్మకథ’ ఆధారంగా ‘సూరీడు’ ప్రారంభం

ముత్యాలు 'ఆత్మకథ' ఆధారంగా 'సూరీడు' ప్రారంభం
Spread the love

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడుగా పి.సి ఆదిత్యకు పేరుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో ‘సూరీడు’ అనే మరో షార్ట్ ఫిలిం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మూహూర్తం షాట్ మంగళవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు హాజరై తొలిక్లాప్ కొట్టారు. బెంగళూరు యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ శ్రీమతి ఆశాజ్యోతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బి. అయిలయ్య తొలిషాట్ కు దర్శకత్వం వహించారు.
ఈ సందర్బంగా దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘ఓ దళితుడి ఆత్మకథని మినీమూవీగా నిర్మించడం ఈ రోజుల్లో పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఓ సంచలనం సృష్టిస్తుంది. అంతేకాకుండా, భావితరాలకు ఓ పాఠ్యఅంశంగా నిలిచిపోతుంది అంటూ ఈ సాహసానికి పూనుకున్న చిత్ర దర్శక- నిర్మాతల్ని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఆయన అభినదించారు.
కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బి. అయిలయ్య మాట్లాడుతూ.. ముత్యాలు రాసిన నవల ‘సూర’ను ఎం.ఏ తెలుగు కాకతీయ యూనివర్శిలో పాఠ్యఅంశంగా ప్రవేశపెట్టాము. ఇది ఓ దళితుడు సాధించిన విజయం అని పేర్కొన్నారు.
బెంగళూరు యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ శ్రీమతి ఆశాజ్యోతి మాట్లాడుతూ.. సాహిత్యం అంటే కేవలం ఆంధ్ర ప్రాంత భాషలే కాదు, తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషను మేము గుర్తించామని, అందుకే ముత్యాలు రాసిన నవలని బెంగళూరు విశ్వవిద్యాలయంలో పాఠ్యఅంశంగా ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
ఈ చిత్రంలోని ముఖ్యపాత్రలో ప్రముఖ రచయిత, విద్యావేత్త భూతం ముత్యాలు నటిస్తున్నారు. రచయిత ముత్యాలు జీవితంలో జరిగిన అనేక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 55 నిమిషాల నిడివిగల ఈ ‘సూరీడు’ చిత్రానికి సంబంధించి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నట్టు దర్శకుడు పి.సి ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాలను కదిలించే కథ ఇది. ప్రతీ ఒక్కరూ ఈ చిత్రంలోని పాత్రల్లో.. సన్నివేశాల్లో పూర్తిగా లీనమైపోతారు. ఈ ‘సూరీడు’ ఆద్యంతం వారిని ఆలోచింపజేస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమా వచ్చిన దాఖలాలు లేవు. అందరికీ నచ్చే విధంగానే ‘సూరీడు’ షార్ట్ ఫిలిం ను తీర్చిదిద్దనున్నట్టు దర్శకుడు పి.సి ఆదిత్య పేర్కొన్నారు. ముత్యాలుతో పాటు ఇతర ముఖ్యపాత్రల్లో శివాజీరాజా, రాజేంద్ర, సహదేవ్ పోతుగంటి, దీక్ష, ఫైజా, అరవింద్ తదితరులు నటిస్తున్నారని ఆయన తెలియజేశారు.
ఈ చిత్రానికి కెమెరా: ఏ.గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ : వెంకట్ సారంగ, ఎడిటింగ్ : పర్వతాలు నంబి, రచన-దర్శకత్వం : డా.పి.సి ఆదిత్య.

Related posts

Leave a Comment