(14-4-1939 ◆ 12-12-2019) ఆయన వర్థంతి
సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత,పాత్రికేయుడు గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14 న విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణం లోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్‌సీ (ఆనర్స్) చేశారు.
మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లారు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తరువాత ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశారు.
చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గోగోల్ రాసిన An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించారు.
విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదవ అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఆయన రచన అనంతం, ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యులు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నారు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించారు.
ఆ అసోసియేషనుకు వి.వి.గిరి అధ్యక్షుడు.
1954లో ‘ఆశాజీవి’ కథారచనతో సాహిత్య రచనకు శ్రీకారం చుట్టారు. ఈ కథ ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక ‘రేనాడు’ లో 1954, డిసెంబరు 9న ప్రచురితమయ్యింది.
నిదురపోయే సెలయేరు నుంచి పేరనోయిక్ అను బొజ్జారావు కథవరకు 58 కథలు ఒక సంపుటిగా ప్రచురించారు.
చీకటిలో చీలికలు వీరి తొలినవల. ఎర్రసీత, గాలిలో ఓక్షణం, ఇడియట్, వెన్నెల కాటేసింది, కాలం దాచిన కన్నీరు మొదలగు నవలలు సంపుటాలుగా వచ్చాయి.
రాగరాగిణి, కరుణించిన దేవతలు, మహానటుడు, ఒకచెట్టు రెండేపూలు, లావాలో ఎర్రగులాబి, సత్యం గారిల్లెక్కడ, గో టు హెల్, భారతనారీ నీ మాంగళ్యానికి మరో ముడి వెయ్యి, అవినీతీ! నీవెక్కడ?, జగన్నాటకం మొదలగు నాటకాలు రాశారు.
అనంతం, పతిత, విలువలు, ఆశయాలకు సంకెళ్ళు, పగ, నిజం నిద్రపోయింది, పాపం, ప్రశ్న, రెండు రెళ్ళు ఆరు, కళ్ళు, దొంగగారొస్తున్నారు జాగ్రత్త, చిరంజీవి మానవుడు, రేపటి మనిషి, మూడుపువ్వులు మొదలగు 26 నాటికలు రాశారు.
ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీలలో (1970) ‘కళ్ళు’ నాటిక ఉత్తమ ప్రదర్శన, రచన బహుమతులు పొందింది. 1975లో సాహిత్య అకాడమి బహుమతి పొందింది. షష్టి పూర్తి సందర్భంగా గొల్లపూడి మారుతీరావు సమగ్ర సాహిత్యం 18 సంపుటాల్లో వెలువడింది. అమ్మకడుపు చల్లగా (2010) ఆత్మకథను వెలువరించారు.
చైనా ఆక్రమణ పై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరి లలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు.
చైనా విప్లవం పై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం వందే మాతరంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959, డిసెంబరు 16న ‘రాగరాగిణి’ అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించబడింది.
‘పథర్ కే అన్సూ’ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించబడింది. ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.
1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించారు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 ఆయన నటించిన కొన్ని సినిమాలు.
మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.
ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడి చికిత్స పొందుతూ 2019, డిసెంబరు 12న అస్తమించారు.