నిజామాబాద్ కు చెందిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో 52 కిలోల విభాగం లో థాయిలాండ్ బాక్సర్ జిట్ పాంగ్ ను ఓడించి స్వర్ణం గెలిచింది! ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా రికార్డు కైవసం చేసుకుంది.
మొత్తం 12 మంది ఇండియన్ బాక్సర్లు ఈసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పోటీ పడగా, నిఖత్ సత్తా చాటింది. మొదటి రౌండ్ నుంచీ దూకుడు ప్రదర్శించి ఫైనల్స్ వరకు శివంగిలా దూసుకెళ్లి పసిడి పతకం పట్టేసి భారత జెండా ను రెపరెప లాడించి తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పింది. స్వర్ణం సాధిస్తా అని చెప్పి మరీ విజయం సాధించింది. విశ్వ విజేతగా నిలిచి ఇండియన్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్లు మేరీ కోమ్, సరిత సరసన నిలిచింది.
వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తొలి సారి పాల్గొని టైటిల్ కైవసం చేసుకున్న నిఖత్ సాధన మాములుగా సాగలేదు! ఆ అమ్మాయి కఠోర పరిశ్రమ గురించి ముందే తెలుసుకున్న కెటిఆర్ 50 లక్షలు ప్రకటించి ఆశీర్వదించి పోటీలకు పంపించారు! ఇప్పుడు స్వర్ణం తో తిరిగి వచ్చాక కెసిఆర్ భారీ నజరానా అందించనున్నారు! మరో వైపు భారత రాష్ట్రపతి నిఖత్ కు అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ నిఖత్ నీ రాక కోసం ఎదురు చూస్తున్నా అని ప్రకటించారు. కేంద్రం నుంచి భారీ నజరానా నిఖత్ కు లభించనున్నది!
నిఖత్ జరీన్ వయసు 26. తల్లిదండ్రులు పర్వీన్ సుల్తానా, మహ్మద్ జమీల్ అహ్మద్! నిజామాబాద్ లో హై స్కూల్ విద్య పూర్తి అయ్యాక హైదరాబాద్ దోమలగూడ లో వున్న ఎ.వి.కాలేజీ లో బి.ఎ., పూర్తి చేసింది. ఎ.సి.గార్డ్స్ లో వున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా లో స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తోంది!
ఆమె తొలి కోచ్ తండ్రి జమీల్ గారే! 2009లో విశాఖపట్నం వెళ్లి స్పోర్స్ అథారిటీ లో చేరింది! అక్కడ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వి.రావు గారి దగ్గర శిక్షణ పొందింది. 2010 లోనే జాతీయ స్థాయి లో గోల్డెన్ బెస్ట్ బాక్సర్ గా గెలిచి భవిష్యత్ తనదే అని చెప్పకనే చెప్పింది. అనేక జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రత్యేకతను చాటుకుంటూ వివిధ మెడల్స్ సాధిస్తూనే ఉంది! అడిదాస్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా 2018 లో నియమితురాలు అయ్యింది. నిజామాబాద్ పట్టణ అధికార బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది. నిఖత్ కు అభినందనలు.
– డాక్టర్ మహ్మద్ రఫీ
***
Nikhath Zareen ఏడుస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు : Sky baba
——————————————————————————————————
నిఖత్ జరీన్ దుఃఖం వెనక కోట్లమంది అమ్మాయిల దుఃఖముంటది!
తండ్రులూ అన్నలూ! జర జమీల్ అహ్మద్ ను చూసి నేర్చుకోండిరా భయ్!
°°°°
నిన్న బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచాక నిఖత్ జరీన్ ఉద్వేగానికి గురైంది. ఏడ్చేసింది. ఎంతో కష్టం మీద ఏడుపు ఆపుకుంది. ఆ దుఃఖం వెనక ఎన్ని అవమానాలుంటాయో! ఎన్ని సూటిపోటి మాటలుంటాయో!
మతం మాటున ఎన్ని నీతులు విని విదిలించుకుందో!
ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో రాష్ట్రంలో ఎందరో ముస్లిం అమ్మాయిలు కూడా ఇలాగే తమ ఆశల్ని ఆశయాల్ని నెరవేర్చుకోవాలని ఉన్నా తండ్రులు, అన్నలూ, మతాన్ని అడ్డం పెట్టి ఎందరో వారి ఆశల్ని అడియాశలు చేసి ఉంటారో.. చేస్తున్నారో..!
చాలామంది అదేం లేదు, అదిగో అక్కడ ముస్లిం అమ్మాయి హిజాబ్ లోనే పైలెట్ అయ్యిందనో.. ఐఏఎస్ అయ్యిందనో.. ఇప్పుడీ జరీన్ ఛాంపియన్ అయ్యిందనో.. -అయ్యాక మాట్లాడుతుంటారు. అయ్యే క్రమంలో మాత్రం వాళ్ళు ఎంత మొండికేసి, అవమానాలు భరించి, ఇంట్లో కొట్లాడి అన్నలను ఎదిరించి, తండ్రులను బతిమాలుకొని ఆ స్థాయికి ఎదిగారో ఎవరూ ఆలోచించరు. అంతెందుకు, తమ ఇండ్లలో ఎందరు అమ్మాయిలు పెద్ద చదువులు చదివి గొప్ప స్థానాల్లో ఉన్నారో తరచి చూసుకొని మాట్లాడమనండి, ఉదాహరణలు చెప్పలేరు. సోషల్ మీడియాలో ఎక్కడివో వార్తలు షేర్ చేసి గొప్పలు చెప్తుంటారు. మీ ఇండ్లలో ఎందుకు అలాంటి అమ్మాయిలు లేరని అడిగితే నోరాడదు. మారండిరా భై!
ఈ సందర్భంగా నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ ను మనసారా అభినందిస్తున్నాను! అతడికి అలాయిబలాయి!
తన బిడ్డ పొట్టి లాగులేసి బాక్సింగ్ నేర్చుకుంటుంటే ఎందరో ఎన్నో నీతులు చెప్పారట.. ఇప్పుడు నిఖత్ జరీన్ తో వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. అమ్మాయిలకు అందునా ముస్లిం అమ్మాయిలకు మగవాళ్ళలాగా ఆటలేంటి అని ఎందరో జమీల్ భాయ్ ని ఎత్తిపొడిచి ఉంటారు. ఇంకా ఎన్నో అవమానాలు భరించి ఉంటాడు. కానీ ఆయన తన బిడ్డను ఇవాళ ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఎందరో ముస్లిం తండ్రులకు మార్గదర్శిగా నిలిచాడు.
ముస్లిం తండ్రులూ.. అన్నలూ తమ్ముళ్లూ.. మగ, మత మైండ్ సెట్ తోనే ఆలోచించే తల్లులూ!
నిఖత్ జరీన్ స్ఫూర్తిగా మీ ఆడబిడ్డల ఆశలను, ఆశయాలను పరిగణలోకి తీసుకోండి. వారికి ఇష్టమైనట్లుగా జీవించనివ్వండి .
*
ఎంతగా సన్మానించాలి : – డా. షాజహానా
———————————————————————————–
ఎంతగా సన్మానించాలి
ఎన్నెన్ని ఊరేగింపులు తీయాలి
ఎంత సెలబ్రెట్ చేయాలి
ఎంత రాయాలి
ఈ మట్టి తాకత్ ను చాటిన నీకు ఎన్ని సార్లు ముబారక్ లు చెప్పినా తక్కువే..!
ఆ దుఃఖ తెరల వెనుక
ఎంత పట్టుదల దాగి ఉందో..
ఈ విజయం.. వెనుక
ఎన్ని కన్నీళ్లు దాగి ఉన్నాయో
ఈ రోజు నువ్వు దేశానికే స్ఫూర్తివి..!
దునియాలో బయటకు రానివ్వని ఎన్నో జీవితాలకు వెలుతురివి!
దేశ పతాకాన్ని విను వీధుల్లో రెపరెప లాడించినందుకు ఆ చేతులకు సలాములు!
పసిడి కాంతులు వెదజల్లుతున్న ఆ గెలుపు చిరునవ్వు కు సలాములు!
నిన్ను కన్న తలిదండ్రులకు పరి పరి సలాములు!
·
చిరునవ్వు వెనుక దుఃఖం : Rambabu Thota
ఏ ఫోటోలో చూసినా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న నిఖత్ జరీన్, బంగారు పతాకాన్ని గెలిచిన క్షణంలో మాత్రం కట్టలు తెచ్చుకున్న దుఃఖంతో ఏడ్చేసింది. ఆ దుఃఖం వెనుక ఆ అమ్మాయి, ఆమె పేరెంట్స్ సంవత్సరాల తరబడి ఎదుర్కొన్న సాంఘిక ఒత్తిడి ఉంది. “బాక్సింగ్ అంటే షార్ట్సూ అవీ వేసుకోవాలి. మీ అమ్మాయిని పంపొద్దు” అని చెప్పిన రిలేటివ్స్ & ఫ్రెండ్స్ సూటిపోటి మాటలు ఉన్నాయి.
“ఎందుకు ఏడ్చేసావు” అని the quint ఇంటర్యూలో నిఖత్ ని అడిగితే నేను స్ట్రగులవుతున్న సమయంలో నాకు మా అమ్మ, నాన్న తప్ప వేరెవరూ సపోర్ట్ లేరని చెప్పింది. దీనిలో హిజబ్ పాత్ర కొద్దిగా మాత్రమే. అమ్మాయిలను స్పోర్ట్స్ కి పంపించే విషయంలో మెజారిటీ హిందువుల్లో, క్రైస్తవుల్లో కూడా ఇదే మైండ్ సెట్ ఉంది.
ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. మతాలను, కులాలను పక్కన పెట్టి, పేరెంట్స్ పిల్లల పక్షాన నిలబడటం. చుట్టూ ఉన్న సమాజం అటువంటి పేరెంట్స్ ని ఒంటరిగా వదిలేయకుండా, వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వడం.
( డాక్టర్ మహ్మద్ రఫీ, Sky baba, డా. షాజహానా, Rambabu Thota కు కృతజ్ఞతలతో…)