వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించింది. సినిమా విడుదల సందర్భంగా ఐశ్వర్య లక్ష్మీ ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే…
– నేను హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మూడేళ్లు అవుతుంది. నా తొలి చిత్రాన్ని మలయాళంలో చేశాను. రెండో చిత్రాన్ని తెలుగులోనే చేయాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత దర్శక నిర్మాతలు అనుకున్న పాత్రలకు నేను సూట్ కాకపోయి ఉండొచ్చు. వచ్చిన పాత్రలు నాకు నచ్చలేదు.. ఇలా పలు కారణాలతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. రెండో సినిమాలో ఇక్కడ ప్రేక్షకులను పలకరించాల్సిన నేను 15 సినిమాగా చేస్తోన్న ‘గాడ్సే’తో పలకరించబోతున్నాను. తెలుగులో నా తొలి చిత్రం ‘గాడ్సే’.
– ఇందులో చాలా విషయాలను చర్చించాం. ముఖ్యంగా మన వ్యవస్థలో భాగమైన ప్రభుత్వం.. అదెలా పని చేస్తుంది. అందులో లోపాలేంటి? అనే విషయాలను చూపించాం. మనలో చాలా మందికి అనేక సమస్యలను ఫేస్ చేసుంటాం. రియాక్ట్ కావాలని కూడా అనుకుంటాం. కానీ రియాక్ట్ కాలేం. అలాంటి చాలా మందిలో నుంచి పుట్టిన ఓ వ్యక్తి ‘గాడ్సే’ ధైర్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటమే కథాంశం.
– ఇందులో వైశాలి అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపిస్తాను. నటిగా నన్ను నేను ఎలివేట్ చేసుకోవటానికి చాలా స్కోప్ ఉన్న రోల్ చేశాను. నిజ జీవితంలో చాలా విషయాలను పట్టించుకోకుండా కూల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ ‘గాడ్సే’లో రియల్ లైఫ్‌కు విరుద్ధమైన పాత్రలో నటించాను. కథ వినగానే డిఫరెంట్‌గా అనిపించటంతో సినిమాలో నటించటానికి ఓకే చెప్పాను. తెలుగులో నటించటం తొలిసారి కావటంతో నటిగా చాలా హోం వర్క్ చేశాను. డైలాగ్స్‌తో పాటు ఎమోషన్స్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేశాను. ఏదో డబ్బింగ్‌లో చూసుకుందాంలే అని యాక్ట్ చేయలేదు. అలా చేయను కూడా. ఇలాంటి ఓ ఇన్‌టెన్స్ మూవీలో యాక్ట్ చేయటం హ్యాపీగా అనిపించింది.
– ‘గాడ్సే’ సినిమాకు ముందు నేను రెగ్యులర్‌గా పేపర్స్ చదివేదాన్ని కాదు. కానీ ఇంతకు ముందు చెప్పినట్లు వైశాలి పాత్ర కోసం.. మన సోసైటీలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో పేపర్ చదవటం దినచర్యగా పెట్టుకున్నాను. అలా ప్రిపేర్ అయ్యాను. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ పాత్రలో నేను ఒదిగిపోవటానికి బాగా సపోర్ట్ చేశారు.
– సత్యదేవ్, నా పాత్రలో ఓ ట్విస్ట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. సత్యదేవ్ అమేజింగ్ యాక్టర్. తను నటించిన ఇతర చిత్రాలను చూశాను. గాడ్సే తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైనది. తనతో కలిసి సినిమా చూశాను. ఆ సమయంలో తను సహ నటుడిగా తనకు తెలిసిన మేరకు ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. అలాగే నా నుంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాడు. అలా చాలా తక్కువ మంది ఉంటారు.
– డైరెక్టర్ గోపి గణేష్‌గారు తన నటీనటులు, టెక్నీషియన్స్‌పై చాలా నమ్మకంగా ఉంటారు. కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తారు. తనకు ఏం కావాలనే దాన్ని కమ్యూనికేట్ చేస్తారు. నేను తనని బాబాయ్ అని పిలిచే దాన్ని. ఆయన ఫ్యామిలీ కూడా నాకు దగ్గరైంది. నటిగా ఆయన నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ కాన్ఫిడెన్స్ ఇచ్చారు.
– మణిరత్నంగారు రూపొందిస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ అన్ని త్వరలోనే విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. నాకు మణిరత్నంగారు దేవుడితో సమానం. సినిమా అంటేనే నాకు ఆయనే గుర్తుకొస్తారు. ఆయనతో వర్క్ చేసిన సమయంలో తొలి రెండు వారాలు భయంతో సరిగా పెర్ఫామ్ చేయలేదు. కానీ ఆయన ఏమీ అనకుండా సపోర్ట్ చేశారు. అంత పెద్ద దర్శకుడి దగ్గర పనిచేయటం మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్.
– రొమాంటిక్ కామెడీ తరహా పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను. ఇప్పట్లో నెగిటివ్ టచ్ పాత్రల్లో నటించాలని అనుకోవటం లేదు.
– తెలుగులో అమ్ము అనే తెలుగు సినిమాలో నటించాను. ఆ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. మలయాళం, తమిళంలో సినిమాలను చేస్తున్నాను.