ఐజేయూ సారథిగా శ్రీనివాస్ రెడ్డి

k Srinivasreddy
Spread the love

ఐజేయూ సారథులుగా తిరిగి ఎన్నికైన కె. శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్మూ
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడుగా కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ గా బల్విందర్ సింగ్ జమ్మూ తిరిగి ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులతోపాటు, 150 మంది ఐజేయూ కౌన్సిల్ సభ్యుల పదవులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవికి కె. శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ పదవికి బల్విందర్ సింగ్ జమ్మూ తరపున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారిద్దరూ పోటీ లేకుండా ఎన్నికైనట్టు ఐజేయూ ఎన్నికల సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్ (సీఆర్డీ) ఎం.ఎ. మాజిద్ ప్రకటించారు. వారిద్దరి తరపున 12 రాష్ట్రాల నుంచి రెండేసి సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. అది సెప్టెంబర్ 20 నాటికి పూర్తవుతుంది.
కె. శ్రీనివాసరెడ్డి, బల్విందర్ సింగ్ జమ్మూ ఆగస్టు 24 వ తేదీన తమ నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐజేయూ నాయకుల సమక్షంలో తమ నామినేషన్ పత్రాలను సీఆర్డీ మాజిద్ కు సమర్పించారు.
కె. శ్రీనివాసరెడ్డి, బల్విందర్ సింగ్ జమ్మూ ఐజేయూ అధ్యక్ష, సెక్రటరీ జనరల్ గా తిరిగి ఎన్నిక కావడం పట్ల అనేక మంది ఐజేయూ నాయకులూ, వివిధ రాష్ట్రాల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపినవారిలో ఐజేయూ మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ మాజీ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా, ఐజేయూ ఉపాధ్యక్షుడు. అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) అధ్యక్షడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, డి. కృష్ణా రెడ్డి, డి. సోమసుందర్, అలపాటి సురేష్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు కె. రాంనారాయణ, నల్లి ధర్మా రావు ఉన్నారు.
ఉద్యమ నేత శ్రీనివాస్ రెడ్డి : ఐజేయూ అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైన కె. శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ జిల్లా పల్లెపహాడ్ గ్రామంలో జన్మించారు. విద్యార్ధి దశలో అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎ.ఎస్.ఎఫ్)లో చురుకైన నాయకుడుగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే విశాలాంధ్ర దినపత్రికలో చేరిన శ్రీనివాస్ రెడ్డి ఆపత్రికలో వివిధ హోదాల్లో పని చేసి సంపాదకుడుగా పదవీ విరమణ చేశారు. ఏపీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడుగా సుదీర్ఘ కాలం పని చేసి రాష్ట్రంలో జర్న లిస్టు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అనంతరం ఆయన ఐజేయూ సెక్రటరీ జనరల్ గా, అధ్యక్షుడుగా రెండు దశాబ్దాలకు పైగా పని చేసి దేశంలో జర్నలిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే శ్రీనివాస్ రెడ్డి వేజ్ బోర్డుల ఏర్పాటు, జర్నలిస్టులు, ఇతర పత్రికా సిబ్బందికి న్యాయమైన వేతనాలు సాధించడానికి కృషి చేశారు. రెండు సార్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) సభ్యుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనేక ముఖ్య మైన కమిటీలలో పని చేశారు. మీడియాలో పెద్ద జాడ్యంగా పరిణమించిన పెయిడ్ న్యూస్ పై పిసిఐ వేసిన కమిటీ కన్వీనర్ గా ఆయన అనేక రాష్ట్రాల్లో పర్యటించి, అద్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక అందరి ప్రశంసలు పొందింది. పాత్రికేయ వృత్తి లో ఐదు దశాబ్దాలుగా నైతిక విలువలతో పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవిత పాపల్య పురస్కారాన్ని అందుకున్నారు. విశాలాంధ్ర ఎడిటర్ గా పదవీ విరమణ చేసిన అనంతరం శ్రీనివాస్ రెడ్డి ‘మన తెలంగాణ’ దిన పత్రికను స్థాపించి సంపాదకుడిగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన ‘ప్రజా పక్షం’ దిన పత్రిక సంపాదకులుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ స్థాపనలో కీలక భూమిక పోషించిన శ్రీనివాస్ రెడ్డి దాని మొదటి చైర్మన్ గా నియమితులయ్యారు ఆ సమయంలో ఆయన దాదాపు అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించి వేలాది మందిని సుశిక్షితులైన పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. విశాలాంధ్ర ప్రతినిధిగా, జర్నలిస్టు యూనియన్ ప్రతినిధిగా ఆయన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక వంటి అనేక దేశాలలో పర్యటించారు.
ఉద్యమ నాయకుడు బల్విందర్ : ఐజేయూ సెక్రెటరీ జనరల్ గా తిరిగి ఎన్నికైన బల్విందర్ సింగ్ జమ్మూ పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లా గశ్రాలా గ్రామంలో జన్మించారు. డిగ్రీ, పీజీ చదివే కాలంలో ఆయన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) లో చురుకైన నాయకుడుగా పనిచేశారు. 1979లో ఏఐఎస్ఎఫ్ పాటియాలా జిల్లా శాఖ అధ్యక్షుడుగానూ, 1985-86 సంవత్సరాలలో పంజాబ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగానూ పనిచేసి అనేక ఉద్యమాలలో కీలక పాత్ర నిర్వహించారు.
‘ఇస్తే ఉద్యోగాలు ఇవ్వండి లేదా జైలుకు పంపండి’ అంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య నిర్వహించిన దేశ వ్యాప్త ఉద్యమం సందర్భంగా బల్విందర్ ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. ఐదు రోజుల పాటు అయన జైల్లో ఉన్నారు. 1990లో “నవాన్ జమానా” అనే పత్రిక జలంధర్ ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా చేరి పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు.1993 లో ‘పంజాబ్ ట్రిబ్యూన్’ దిన పత్రికలో చేరి 27 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో పని చేసి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ గా పదవ విరమణ చేశారు.
పంజాబ్ అండ్ చండీఘర్ జర్నలిస్ట్స్ యూనియన్ స్థాపకులలో ఒకరైన బల్విందర్ 2022 మే 7వ తేదీ వరకు దానికి అద్యక్షుడిగా ఉన్నారు. చండీఘర్ ప్రెస్ క్లబ్ లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న బల్విందర్ రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా మరో రెండు సార్లు సీనియర్ ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా సేవలందించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా పని చేసిన బల్విందర్ సింగ్ జమ్మూకాశ్మీర్ లో మీడియా పరిస్థితులపై కౌన్సిల్ వేసిన కమిటీ కన్వీనర్ గా వ్యవహరించారు. లోగడ ఐజేయూ కార్యదర్శిగా, ఉపాద్యక్షులుగా, సెక్రటరీ జనరల్ పనిచేసిన బల్విందర్ ఇప్పుడు మరో సారి తిరిగి ఎన్నికయ్యారు.

Related posts

Leave a Comment