ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరంటే? అందాల తార జాన్వీ కపూర్ అంటూ ఠక్కున సమాధానం వస్తే ఎలాంటి సందేహం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో వరుస ఫ్లాపులతో ఆమె కెరీర్ అగమ్య గోచరంగా కనిపించింది. కానీ ఆ వైఫల్యాలను దాటుకొని ప్రస్తుతం శ్రీదేవి ముద్దుల కూతురు తన కెరీర్‌ను గాడిలో పెట్టుకొనే పనిలో పడింది. దక్షిణాదిలో అగ్రహీరోలతో కలిసి నటిస్తున్న ఆమె.. ప్రస్తుతం తన ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేస్తున్నది. ప్రస్తుతం జాన్వీ నిర్ణయాలు బాలీవుడ్‌లో భారీ చర్చకు దారి తీసింది. ఆమె తీసుకొన్న సంచలన నిర్ణయం ఏమిటనే వివరాల్లోకి వెళితే.. జాన్వీ కపూర్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే నిర్ణయం తీసుకొన్నప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ శ్రీదేవీ, బోనికపూర్ దంపతులు ఆమెను ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ చేతిలో పెట్టింది. దాంతో ఆ సంస్థ అధినేత కరణ్ జోహర్.. జాన్వీ బాగోగులు, సినిమాలు విషయంలో శ్రద్దపెట్టారు. దఢక్ నుంచి హోంబౌండ్ సినిమా వరకు ఆయన చాలా కేర్ తీసుకొన్నాడు. కరణ్ హెల్ప్ లేకుండా జాన్వీ ముందుకు సాగలేదనేంతగా ప్రభావాన్ని ధర్మ ప్రొడక్షన్ చూపించింది. అయితే ఇటీవల కాలంలో తనకు ఇండస్ట్రీలో గురువు లాంటి టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్‌కు, మాతృ సంస్థ లాంటి దర్మ ప్రొడక్షన్‌కు దూరంగా ఉండేందుకు జాన్వీ కపూర్ ప్రయత్నిస్తున్నారు. తనకంటూ ఓ గుర్తింపు ఉండేలా కెరీర్ పరంగా స్ట్రాటెజీ అనుసరిస్తున్నారు. నెపోకిడ్, ఫేవరిటీజం లాంటి విమర్శలకు దూరంగా ఉండేందుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొంటున్నారనే వాదన గట్టిగానే వినిపిస్తున్నది. ఈ క్రమంలో ధర్మ ప్రొడక్షన్స్ నిర్వహించే టాలెంట్ మేనేజ్‌మెంట్‌కు జాన్వీ కపూర్ గుడ్‌బై చెప్పింది. తన గురువు లాంటి కరణ్ జోహర్‌కు హ్యాండించ్చి.. తన లెవెల్‌లో కెరీర్‌ను చక్కదిద్దుకొనేందుకు ప్లాన్ చేసుకొంటున్నది. ధర్మ నుంచి బయటకు వచ్చి ‘దేవర’ బ్యూటీ ప్రస్తుతం ముంబైలోని కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్ అనే సంస్థతో ఒప్పందం చేసుకొన్నది. దాంతో ధర్మ ప్రొడక్షన్‌తో తెగతెంపులు చేసుకొన్నట్టేనా? అనే ప్రశ్న ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నది. జాన్వీ కపూర్ తనలోని టాలెంట్‌కు తగినట్టు కొత్త అవకాశాల వేటలో పడింది. అందులో భాగంగానే ఆమె కొత్త టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థతో భాగమైంది. త్వరలోనే భారీ ప్రాజెక్టులు, కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు సమాచారం. అయితే ఈ నిర్ణయం జాన్వీ కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొనేందుకు శ్రీదేవి అనుసరించిన ప్రొఫెషనల్ స్ట్రాటెజీని అనుసరిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో వస్తున్న ప్యాన్ ఇండియా సినిమాలపై ఆమె కన్నేసింది. ‘దేవర’ లాంటి సూపర్ హిట్ సినిమా ద్వారా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో కలిసి ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వచ్చే మూవీలోను ఆమె నటించేందుకు సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకా పలు భారీ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.
శ్రీదేవిని మించిన స్ట్రాటెజీతో..!
