Love Me Telugu Movie Review and Rating : ‘లవ్ మీ’ మూవీ రివ్యూ: హారర్ థ్రిల్లర్!

Love Me Telugu Movie Review and Rating
Spread the love

వైష్ణవి చైతన్య , ఆశిష్, జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వలో తెరకెక్కిన సినిమా ‘లవ్ మీ’. చిన్న సినిమా అయినా ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించగా, స్టార్ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. దయ్యంతో హీరో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. లవ్ మీ కు If You Dare అని క్యాప్షన్ ఇచ్చారు. లవ్ మీ సినిమా నేడు మే 25న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైయింది.
కథ : ఓ చిన్న ఊరు. ఆ ఊర్లో ఓ ఫ్యామిలీ, వాళ్ళని చూసి ఊరి వాళ్ళు భయపడటం, అందులో భార్య ఒంటికి నిప్పు అంటించుకొని చనిపోవడం, భర్త చనిపోవడం, వాళ్ళ పాప బతికి ఉన్నట్టు చూపిస్తారు. అసలు కథలోకి వస్తే అర్జున్(ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దయ్యాలు, ఆత్మలు, స్మశానాలు.. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటారు. ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా(వైష్ణవి చైతన్య) కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఓ రోజు ఆ పాప గురించి ఆసక్తికర న్యూస్ అర్జున్ దగ్గరికి వస్తుంది. ఆ పాప పెద్దయ్యాక చనిపోయి దివ్యవతి అనే దయ్యం అయిందని, ఆ దయ్యాన్ని చూడటానికి వెళ్లినవాళ్ళందర్నీ చంపేస్తుందని ప్రియా చెప్పడంతో అర్జున్ అసలు ఆ దయ్యం కథేంటో చూద్దామని వెళ్లి ఆ దయ్యంతో ప్రేమలో పడతాడు. కానీ అక్కడ ఓ అమ్మాయి ఉందని గ్రహించి చనిపోయింది ఎవరు? అసలు దివ్యవతి ఎవరు అని రీసెర్చ్ చేయడం మొదలుపెడతారు. ఈ క్రమంలో ముగ్గురు అమ్మాయిలు చనిపోయినట్టు తెలియడంతో వాళ్ళకి దివ్యవతికి లింక్ ఏంటి అని వెతకడం మొదలుపెడతాడు. అసలు దివ్యవతి ఎవరు? ఆ పాప ఎవరు? ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? ఎలా చనిపోయారు? అర్జున్ దయ్యాన్ని ఎందుకు ప్రేమించాడు? దయ్యం అర్జున్ ని ఏం చేసింది? ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియా అర్జున్ తో ఎలా ప్రేమలో పడింది? అసలు ప్రతాప్, అర్జున్ ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ : ఒక మాములు కథకి ఇంకో కొత్త కథని జతచేసి ఓ కొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దర్శకుడిగా అరుణ్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమా మొత్తంగా ‘లవ్ మీ’ ఓ దయ్యం కోసం, ఆమె చుట్టూ ఉన్న కథ కోసం హీరో పాత్ర చేసిన రీసెర్చ్ ఏంటి? ఆ దయ్యానికి హీరో ఎలా కనెక్ట్ అయ్యాడు అని ఆసక్తికరంగా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఆశిష్ రౌడీ బాయ్స్ లో కాలేజీ కుర్రాడిగా అలరించి ఇప్పుడు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఈ సినిమా కోసం ఆశిష్ అడవుల్లో, స్మశానాల్లో చెప్పులు లేకుండా బాగానే కష్టపడ్డాడు. ఇక బేబీతో అందర్నీ ఇంప్రెస్ చేసిన వైష్ణవి చైతన్య మరోసారి ఈ సినిమాతో మెప్పిస్తుంది. వైష్ణవి పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. రవికృష్ణ కూడా ఆశిష్ కి బాగా సపోర్ట్ ఇస్తూ నటించాడు. సిమ్రాన్ చౌదరి అక్కడక్కడా స్కెలెటిన్ స్పెషలిస్ట్ గా కనిపించి ఓకే అనిపించింది. కథ మొత్తం వీరి మధ్య తిరుగుతుంది. మిగిలిన పాత్రలు చిన్నచిన్నవి అయినా వారంతా పర్వాలేదనిపించారు. సినిమా దర్శకుడు ఒక నవల రచయిత అని ప్రమోషన్స్ లో చెప్పారు. సినిమా చూస్తుంటే కూడా చాలా వరకు ఒక నవల చెప్పినట్టే స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ ఆ స్క్రీన్ ప్లే దయ్యమే కథ చెప్తున్నట్టు ఆసక్తికరంగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ గురించి, అర్జున్ దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం, అక్కడ దయ్యంతో సీన్స్ తో సాగి ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ ముగ్గురు అమ్మాయిల గురించి, దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసి కథపై ఆసక్తి కలిగించినా కథనం మాత్రం కొంచెం కన్ఫ్యుజింగ్ గా ఉంటుంది. సినిమా మొదట చూపించిన పాపకి క్లైమాక్స్ కి లింక్ ఇచ్చిన తర్వాత మాత్రం క్లైమాక్స్ ఇంతేనా అనిపిస్తుంది. కానీ చివర్లో మళ్ళీ ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ముందు నుంచి చెప్తున్నట్టు సినిమాలో ఐదారుగురు హీరోయిన్స్ ఉన్నారు. వైష్ణవి, సిమ్రాన్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పాత్రలేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
టెక్నికల్ విషయాలకొస్తే… సాధారణంగా పీసీ శ్రీరామ్ కెమెరామెన్ అంటే ఆ సినిమా విజువల్స్ బాగుంటాయని అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఆసక్తికర కథ ఉండటంతో మరింత అద్భుతంగా విజువల్స్ అందించారు శ్రీరామ్. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ బీజీఎమ్ తోనే భయపెట్టారు. పాటలు కూడా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ లొకేషన్స్ ని అద్భుతంగా డిజైన్ చేసాడు.
రేటింగ్: 3

Related posts

Leave a Comment