Gangs of Godavari movie Review in Telugu : గ్యాంగ్స్ ఆఫ్‌ గోవింద..గోవింద!

Gangs of Godavari movie Review in Telugu
Spread the love

By M.D ABDUL/Tollywoodtimes

(చిత్రం : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విడుదల తేదీ : మే 31, 2024, రేటింగ్ : 2/5, నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు, దర్శకత్వం : కృష్ణ చైతన్య, నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య, సంగీతం : యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి, ఎడిటింగ్: నవీన్ నూలి).
కొన్ని నెలలుగా మూతపడిన థియేటర్ల తలుపులు మళ్లీ తెరచుకునేలా ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి రావడం… మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన సినిమా కావడంతో విడుదలకి ముందే సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహించడంతోపాటు..విడుదలైన ట్రైలర్ , ప్రచార చిత్రాలూ ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. భారీ అంచనాలతో నేడు (మే 31, 2024) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఈ మేరకు మెప్పించింది? తెలుసుకుందాం….
కథ: జీవితంలో ఎదగాలని.. ఎదగడం మన హక్కు అని నమ్మిన ఓ యువకుడు లంకల రత్నాకర్‌ (విష్వక్‌ సేన్‌). తండ్రి చెప్పిన ఆ మాటని చిన్నప్పుడే బాగా ఒంటబట్టించుకుంటాడు. తనలోని మనిషిని పక్కనపెట్టి, ఎదుటివాళ్లని వాడుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. చిన్నచిన్న దొంగతనాలు చేసే రత్నాకర్‌ … స్థానిక ఎమ్మెల్యే దొరసామి (గోపరాజు రమణ)కి కుడిభుజంగా మారతాడు. దొరసామి, నానాజీల మధ్య నడుస్తున్న రాజకీయ వైరంలోకీ తలదూర్చుతాడు. ఆ రాజకీయం అతన్ని ఎక్కడిదాకా తీసుకెళ్లింది? అతను కోరుకున్నట్టు ఎదిగాడా, లేదా? లంకల్లోని పగ అతన్ని ఎలా వెంటాడింది? బుజ్జి(నేహాశెట్టి), రత్నమాల (అంజలి)లతో రత్నాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన రత్నాకర్ ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? బుజ్జి ఎవరు.. రత్నాకర్‌కు ఆమెతో ఎలాంటి సంబంధం ఉంటుంది..? ప్రత్యర్థుల ఎత్తుగడలను రత్నాకర్ ఎలా తిప్పికొట్టాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ : గోదావరి నేపథ్యంలో సినిమా అనగానే పచ్చటి పల్లెసీమలు, ప్రశాంతమైన వాతావరణమే గుర్తొస్తుంది. ఇప్పటివరకు మన సినిమాల్లో ఎక్కువగా చూపించింది అదే. కృష్ణచైతన్య మాత్రం కాస్త భిన్నంగా ఎరుపెక్కిన గోదావరిని ఈ సినిమాలో చూపించారు. అక్కడి రాజకీయాలు, ఆధిపత్య పోరు, లంక గ్రామాల్లోని పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని ముడిపెడుతూ కథని మలిచారు. అక్కడక్కడా రంగస్థలం ఛాయలు కనిపించే ఈ కథ పరిధి గోదావరి అంతా విస్తృతంగానే వుంటుంది. ప్రతీ పాత్రకీ దానిదైన ఓ ప్రయాణంతో స్క్రిప్ట్‌ని రాసుకున్నాడు దర్శకుడు. కానీ విష్వక్‌సేన్‌, అంజలి పాత్రలు మినహా మిగతా ఏ పాత్రలూ ప్రభావం చూపించవు. గాఢత, భావోద్వేగాలే ఇలాంటి కథలకు బలం. కానీ ఇందులో చాలా సన్నివేశాలు మరీ ఎక్కువ నాటకీయతతో సాగడం.. ప్రతినాయకుడి పాత్రల్లో బలం లేకపోవడం.. కథానాయిక నేహాశెట్టి పాత్ర కూడా పెద్దగా ప్రభావం చూపించేలా లేకపోవడంతో ఆశించిన భావోద్వేగాలు పండలేదు. రాజకీయ క్రీడలో భాగంగా కథానాయకుడు వేసే ఎత్తులు పైఎత్తులు చాలానే ఉంటాయి. వాటిని మరింత ఉత్కంఠభరితంగా తెరకెక్కిస్తే బాగుండేది. ఇంత గాఢమైన కథని, నేపథ్యాన్ని ఆవిష్కరిస్తున్నపుడు ప్రతినాయకుల్ని మరీ అంత బలహీనంగా చూపించడం కథకు ఏమాత్రం అతకలేదు. లంక గ్రామాల్లో కత్తి పట్టే సంప్రదాయంతో సన్నివేశాల్ని మొదలుపెట్టిన దర్శకుడు వేగంగానే కథా ప్రపంచంలోకి తీసుకెళ్లారు. కథానాయకుడిని మాస్‌గా ఆవిష్కరించిన తీరు, పోరాటాలు, అంజలి పాత్ర ప్రయాణం ప్రథమార్థానికి ఆకర్షణగా నిలుస్తాయి. కథానాయకుడి పాత్రలో మాస్‌ కోణం, అతని వ్యక్తిత్వం వరకూ సమస్యలేవిూ లేకపోయినా… ఆ పాత్ర ఎదుగుదల చూపెట్టిన తీరే మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఓ ఎమ్మెల్యేని కిడ్నాప్‌ చేయడం, మరో ఎమ్మెల్యేని చంపి నదిలోకి విసిరేయడం వంటి సన్నివేశాలే అందుకు ఉదాహరణ. ద్వితీయార్థం సినిమాలో నదిలో సాగే ఓ సన్నివేశం బాగుంది. చివర్లో తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో భావోద్వేగాల్ని పండించే ప్రయత్నం చేసినా అదేవిూ ప్రభావం చూపించలేదు. గ్యాంగ్స్ ఆప్ గోదావరి ఒక రొటీన్ మాస్ యాక్షన్ మూవీగా నిలుస్తుంది. విశ్వక్ సేన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే అంజలి నటన ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. అయితే, సెకండాఫ్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి. కృష్ణ చైతన్య డైరెక్షన్ బాగున్నా, స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. నేహా శెట్టి పాత్ర ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. అంజలి పాత్ర నిడివి కూడా ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది. ఎమ్మెల్యే పాత్రలో గోపరాజు రమణ కాకుండా వేరొక నటుడైతే ఆ ఇంపాక్ట్ బలంగా ఉండేది. నాజర్, సాయి కుమార్‌ల ట్యాలెంట్ వృధా అయ్యింది. స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, అనవసరమైన సన్నివేశాలు, కథ స్లోగా సాగడం ప్రేక్షకులకు నిరాశను మిగిలిస్తాయి. సినిమాలోని ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో సాగగా, సెకండాఫ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఫస్ట్ హాఫ్‌లోని ఆసక్తిని సెకండ్ హాఫ్‌లో కొనసాగించలేకపోయారు. కొన్ని సీన్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ వాటిని ప్రెజెంట్ చేసిన తీరు వాటిపై ఆసక్తిని తగ్గిస్తాయి. దర్శకుడు ఎమోషనల్ సీక్వెన్స్‌లపై మరికాస్త ఫోకస్ చేయాల్సింది. లంకల రత్నాకర్‌గా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అతడు గోదావరి యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అధికారం రాకముందు, వచ్చిన తరువాత అతడి పాత్రలోని వైవిధ్యాన్ని విశ్వక్ చాలా బాగా చూపెట్టాడు. అంజలి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, యువన్ శంకర్ రాజా అందించిన స్కోర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గోపరాజు రమణ, నాజర్, హైపర్ ఆదిలు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.
టెక్నీకల్ విషయాలకొస్తే…యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. అనిత్ మధడి సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్షన్ ఓవరాల్‌గా బాగున్నా, సెకండాఫ్‌పై ఆయన మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా కథ మరింత ఆసక్తికరంగా ఉండేది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే అనిపించింది. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మొత్తం మీద సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం గ్యాంగ్స్ ఆఫ్‌ గోవింద! అంటూ థియేటర్ల నుంచి బయటికి వస్తూ కనిపించారు.

Related posts

Leave a Comment